సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలోని ఐదు జూనియర్ కాలేజీల విద్యార్థులు ప్రతి సంవత్సరం నవంబర్ కోసం ఎదురుచూస్తుంటారు.
కాలేజీలలో చదవు వూపందుకునే సమయంలో, సిలబస్ పూర్తి చేసేందుకు లెక్చరర్లు, పరీక్షలకు సిద్ధమయ్యేందుకు విద్యార్థులు శ్రమించడమనేది ఈ నెలనుంచే ప్రారంభమవుతుంది. అయితే ఇదే నెల నుంచి ఈ కాలేజీలలోలని 2550 మంది విద్యార్థులు మరొక కార్యక్రమం కోసం ఎదురుచూస్తుంటారు, అదే వాళ్లకి ప్రత్యేకంగా ప్రారంభమయ్యే మధ్యాహ్న భోజన పథకం.
ఈ నియోజకవర్గంలోని చాలా మంది విద్యార్థులు ఈ అయిదు జూనియర్ కాలేజీలకు సూదూర ప్రాంతాలనుంచి కూడా వస్తుంటారు.
వాళ్లంతా ఇళ్ల దగ్గిర పొద్దునే బయలు దేరి వస్తుంటారు. ఆ టైంకు క్యారియర్ తయారు కావడం చాలా కష్టం. అందువల్ల చాలా మంది విద్యార్థులు క్యారియర్ లేకుండానే వస్తుంటారు. లంచ్ మానేస్తుంటారు. విద్యా సంవత్సరంలో నవంబంర్ – మార్చి మధ్య సమయం చాలా విలువైంది కాబట్టి, ఈ సమయంలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం గురించి ఆలోచించరాదు, అసలు దానిమీదకు దృష్టి పోకుండా చేయడమెలా? అయితే, చాలా మంది పేదకుటుంబాలనుంచి ఈ కాలేజీ పిల్లలకు రకరకాల కారణాల వల్ల మధ్యాహ్నం భోజనం పెద్ద సమస్య అయింది.
సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేకుకోనేరు కొణప్పకు ఒక ఆలోచన వచ్చింది. వీళ్లందరికి మధ్యాహ్నం భోజనం ఏర్పాటుచేస్తే…భోజనమనే అతి ముఖ్యమయిన సమస్య పరిష్కారమవుతుంది. చదువు మీద దీని ప్రభావం పడదు.
పాఠాల మీద శ్రద్ధచూపుతారు, అటెండెన్స్ పెరుగుతుంది.తన ఆలోచన గురించి ఆయన కాలేజీ టీచర్లతో, శ్రేయోభిలాషులతో మాట్లాడారు. వాళ్లంతా ఇది మాంచి ఆలోచన అన్నారు. అంతే, అయిదేళ్ల కిందట కాగజ్ నగర్, సిర్పూర్, దహేగాం, కౌటాల, బెజ్జూర్ లలోని జూనియర్ కాలేజీలలో మధ్నాహ్న భోజనం ప్రారంభమయింది.
(ఈ స్టోరీ నచ్చితే ఫేస్ బుక్ లైక్ కొట్టండి, మీ మిత్రులకు షేర్ చేయండి)
చాలా శుచిగా శుభ్రంగా ఉండే భోజనంతో ప్రారంభమయింది. అయిదేళ్లయినా ఇది వన్నె తగ్గకుండా కొనసాగుతూ వస్తున్నది మొన్న నవబంర్ మొదటి సోమవారం నుంచి 2019 మధ్యాహ్నం భోజనం ప్రారంభమయంది.
గాంధీ జయంతి రోజున ఆసుపత్రులలో రోగులకు రెండుపళ్పుపంచి ఫోటో దిగి పండగ చేసుకునేలా కాదు, నిజంగా హృదయపూర్వకంగా, విద్యార్జుల ఆరోగ్యాన్ని, శారీరక అవసరాలను దృష్టిలో పెట్టుకుని భోజనం అందివ్వాలనే ఉన్నతాశయంతో ఈ పథకం మొదలయింది. ఎమ్మెల్యే కోణప్ప ఈ కార్యక్రమాన్ని ఇంట్లో పెళ్లి సందడిలాగా చేస్తున్నారు.
నియోజకవర్గంలోని అయిదు జూనియర్ కాలేజీలలోని 2550 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సాగుతూ ఉంది. ఎలాంటి తొందర తొక్కిసలాట లేకుండా క్రమశిక్షణతో గంటలో మొత్తం కార్యక్రమం పూర్తవుతుంది.
ఇంట్లో జరిగే కార్యక్రమంలో ఉండే కుటుబ సభ్యుల భాగస్వామ్యంలా ఈ కార్యక్రమం మొదలయింది. ఇది ప్రారంభ సంబురం ఆరంభశూరత్వం కాదు. రోజూ అలాగే ఉంటుంది.
అయిదు కాలేజీలో రెండింటికి కాగజ్ నగర్ లోని ఎమ్మెల్యే ఇంటిలోనే కుంటుంబ సభ్యులు, ఇతర వంటవాళ్లు వంటలు చేసి కాలేజీలకు పంపిస్తారు.
మిగతా కాలేజీలు కాగజ్ కు దూరంగా ఉంటున్నందున అక్కడే వంట చేస్తారు. అన్నికాలేజీలకు క్వాలిటీ భొజనం ఇవ్వాలన్నది నియమం.ఈ విషయంలో రాజీ లేదు. భోజనంలో అన్నం, పప్పు, చట్ట్నీ, తాళింపు, మజ్జిగ అరటి పండు ఉంటాయి.ఏవీ డైల్యూట్ కావు. ఏదో ఒక సాకుతో ఏదీ తగ్గదు.
విద్యార్థులందరికి ఈ ఏడాది కూడా కొత్త స్టీల్ ప్లేట్స్ అందించారు.
“మధ్యాహ్న భోజనం చాలా బాగుంటుంది. ఇది అమలులోకి వచ్చింతర్వాత, ఇంటి దగ్గిర లంచ్ బాక్స్ తెచ్చుకోవాలనే ఆదుర్దాపోయింది. చాలా సార్లు వంట చేయడం కుదరక అలాగేవస్తుంటాం. ఇపుడు పరీక్షలు దగ్గిర పడుతున్నాయి కాబట్టి చదువు వత్తిడి పెరిగింది. ఈ టైం ఈ భోజనం అందుబాటులోకి రావడం అదృష్టం,” అని దహేగాం జూనియర్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న ఆరేక సువర్ణ trendingtelugunews.com కు చెప్పింది.
చాలా మంది ఇక్కడ చదువుకునే పిల్లలు దూరంగా ఊర్లనుంచి వస్తారు. వాళ్లకి భోజనం తయారుచేసే క్యారియర్ కట్టించడం అనేది పల్లెటూర్లలో సాధ్యం కాదు. అందుకే ఏదో ఉన్నది తినేసి పొద్దునే కాలేజీకి వస్తుంటారు. వాళ్లకి ఈ కార్యక్రమం చాలా బాగుందని ఆమెచెప్పారు. మీకు మధ్యాహ్న భోజనం ఉపయోగమేనా అని అడిగినపుడు చాలా ఉపయోగం అని చెప్పింది సువర్ణ. ‘ నేను ఈ వూరి నుంచే వస్తాను.మాయింట్లో కూడా కాలేజీ టేం భోజనం తయారు కావడవ కష్టం. రోజూ పొద్దున లంచ్ టెన్షన్ ఇంట్లోఉండేది నాకూఉండేడి. ఇపుడది లేదుసార్,’ అని సువర్ణ చెప్పింది.
మధ్యాహ్న భోజనం లేని రోజుల్లో భోజనానికి ఇంటికి వెళ్లి కొన్నిసార్లు తిరిగి వచ్చే వాళ్లు కాదు. ఇపుడాసమస్యే పరిష్కారమయింది అని మరొక విద్యార్థి చెప్పాడు.
కోణప్పకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?
అయిదేళ్ల కిందట ఒక రోజు ఆయన ఎమ్మెల్యేగా ఒక మధ్యాహ్నం స్కూలులో జరిగిన ఒక సభలో పాల్గొనాల్సి వచ్చింది. సభ నడుస్తున్నపుడు విద్యార్థుల్లో కలకలం మొదయింది.
ఎందుకని విచారిస్తే, ఒక విద్యార్థి ఆకలితో సొమ్మసిల్లి పడిపోయాడు. అతను చాలా దూరం నుంచి కాలేజీకి వస్తాడు. మధ్యాహ్నం భోజనం చేయలేదు. నీరసం వచ్చింది. ఇది చూశాక నియోజకవర్గంలోని జూనియర్ కాలేజీలన్నింటి విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉందేమో నని ఆందోళన కలిగింది. ఆలస్యం చేయకుండా ఆయన ఆ యేడాదే ఈ మధ్యాహ్నభోజనంఅందివ్వాలనుకున్నారు. వనరుల గురించి ఆలోచించకుండా అత్యవసరంగా ఆయేడాదే ఈ పథకం ప్రారంభమయిది. మొదట అయిదారువందల మంది విద్యార్థులతో మొదలయిన ఈ కార్యక్రమం ఈ ఏడాది 2550 మందికి చేరుకుందని కోణప్ప చెప్పారు.
విద్యా సంవత్సరం ఉత్తార్ధంలోనే ఎందుకు భోజనం పెడుతున్నారన్నపుడు ఏడాది పొడవునా మధ్నాహ్నం భోజనం అందిస్తే బాగుంటుంది, ఆర్థిక వనరుల సమస్య ఉందని ఎమ్మెల్యే కోణప్ప చెప్పారు.
ఈకారణంగా, బాగా అలోచించి నవంబర్ – మార్చి సమయాన్ని ఎంపిక చేశామని ఆయన అన్నారు.
‘నవంబర్ -మార్చిల మధ్యే సిలబస్ బోధించడం ఎక్కువవుతుంది, విద్యార్థుల మీద చదువు వత్తిడి పెరుగుతుంది. పరీక్షల ప్రిపరేషన్ మొదలవుతుంది.అందువల్ల ఆ సమయంలోవారికి శుచిగా, శుభ్రంగా, పోషకవిలువలతో కూడిన భోజనం అందివ్వాలని నిర్ణయించాం,’ అని కోణప్ప చెప్పారు.
కాగజర్ నగర్ లో 860 మంది, సిర్పూర్ టవున్ లో 330 మంది, కౌటాల లో 960 మంది, దహేగావ్ లో 230 మంది,బెజ్జూర్ లో 400 మంది విద్యార్థులున్నారు.
తొందర్లో స్కిల్ డెవెలప్ మెంట్
“వీళ్లకి మధ్యాహ్న భోజనం అందివ్వడ వెనక చాలా అధ్యయనం కూడా ఉంది. దీనిని మెరుగు పరిచేందుకు చాలమంది అనుభవజ్ఞుల నుంచి సలహాలను కూడా తీసుకుంటున్నాం. ఒరిస్సా కళింగ ఇన్ స్టిట్యూట్ వాళ్లు ఇలాంటి పథక మే అమలు చేస్తున్నారు. అక్కడికి వెళ్లి వాళ్లను అనుభవాలను తెలుసుకోవడం జరిగింది.మధ్యాహ్నం భోజనం తర్వాత ఇక పిల్లలకు కొన్ని రకాల నైపుణ్యాలు (Skills) అందించే విషయం అలోచిస్తున్నాను. దీనికి కళింగ సంస్థల వాళ్లు సహకరిస్తామన్నారు. ఇలా ఎవరైనా ముందుకు వస్తే వాళ్ల సాయం తీసుకుని ఈ అయిదు కాలేజీలను ఉత్తమ కాలేజీలు తీర్చిదిద్దాలనుకుంటున్నాం,” అని కోణప్ప చెప్పారు.