ఆర్టీసీ కార్మికుల చేస్తున్న 40 రోజులచారిత్రాత్మక సమ్మె నేపథ్యంలో ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కార్మికుల డిమాండ్ మీద ప్రజలేమనుకుంటున్నారో తెలుసుకునేందుకు ఒక సర్వే నిర్వహించారు. ఈ ప్రజా బ్యాలెట్ లో ఆర్టీసీని ప్రభుత్వంలో కొనసాగించాలన్న 90 శాతం ప్రజలు అభిప్రాయం వెలిబుచ్చారు. అంటే ఆర్టీసి కార్మికుల సమ్మెకు ప్రజలలో ఎంత మద్దతు ఉ అర్థమవుతుంది.
ప్రజాభిప్రాయ సేకరణ వివరాలు-
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఇటీవల రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో బ్యాలెట్ పత్రాల ద్వారా వివిధ వర్గాల అభిప్రాయాన్ని సేకరించారు.
దాదాపు 1750 మంది తమ అభిప్రాయాలను బ్యాలెట్ పత్రంలో పేర్కొంటూ బాక్సు లో వేశారు. పత్రంలో రెండే రెండు ప్రశ్నలున్నాయి. అవి. 1.ఆర్టీసీనీ ప్రభుత్వం లో విలీనం చేయాలి, 2.ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలి.
ప్రజాభి ప్రాయం వెలిబుచ్చుతూ 90 శాతం ప్రజలు మొదటి అభిప్రాయం పై ఓటు వేయగా కేవలం ఐదు శాతం రెండో అభిప్రాయం పై ఓటు వేశారు.
మరో ఐదు శాతం మంది వేసిన ఓట్లు చెల్లలేదు.
ఈ ప్రజా బ్యాలెట్ లో కొందరు సీఎం ను ప్రాసిక్యూట్ చేయాలని, సీఎం డౌన్ డౌన్ అనే రాతలను బ్యాలెట్ పేపర్ వెనుక రాశారు.
మరికొందరు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రకరకాల కామెంట్స్ రాశారు.
బ్యాలెట్ లెక్కింపు కార్యక్రమంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (TWJF) రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, కార్యదర్శి ఎవీఎన్ రావు, హెచ్ యూజే అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా బ్యాలెట్ నిర్వహించిన ప్రదేశాలు,నిర్వహణ విధానం తదితర విషయాలను ఎమ్మెల్సీ నర్సిరెడ్డి వివరించారు.