స్కూళ్లలో వాటర్ ఇంటర్వెల్ ! విద్యార్థుల చేత సమృద్దిగా మంచినీళ్లు తాగే లా చేసేందుకు ఈ ఇంటర్వెల్ ఇస్తున్నారు. ఇది కేరళలో మొదట మొదలయింది.
కేరళలో లాగా కర్నాటక స్కూళ్లలో కూడా ఇపుడు ఒక బెల్ మోగుతుంది. ఈ బెల్ రోజుకు మూడుసార్లు మోగుతుంది. ప్రతి సారి బెల్ మోగినపుడల్లా విద్యార్థలుంతా పది హేను నిమిషాలు విరామం తీసుకోవచ్చు. ఈ విరామం ఎందుకో తెలుసా… విధిగా వాళ్లు నీళ్లు తాగాలి. ఈ సమయంలో టాయ్ లెట్స్ కు కూడా వెళ్లవచ్చు. ఎన్ని నీళ్లు తాగుతారా అనేది వాళ్లఇష్టం. అంతా నీళ్లు తాగాలి.
ఇది వినడానికి వింతగా అనిపిస్తుంది. కాని ఆరోగ్యానికి చాలా అవసరం, ఇందులో ఆరోగ్యం నియమమే కాదు, మానవతా దృక్పథం కూడా ఉంది. స్కూళ్లలో బాలికలు పడే మూగవేదనకు ఇందులో సమాధానం ఉంది.
మనం ఎంత గోప్పదేశమని, చెప్పుకున్నా కొన్ని విషయాల్లో బాగా దరిద్రపు గొట్టుదేశం. నిజం వప్పుకోవలసిందే. బాలికల విద్యను ఒక పక్క ప్రోత్సహించాలనుకుంటారు. మరొకవైపు బాలికలకు పాఠశాలలు ఏమాత్రం అనుకూలంగా ఉండవు. వాళ్ల అవసరాలను గుర్తించపోవడం అమానుషం. ఇందులో బాలికల టాయిలెట్స్ ప్రధాన మయింది. స్కూళ్లకి బాలికలను రప్పించాక వాళ్లకి టాయిలెట్స్ కట్టకపోవడమనేది నేరం కాదా.
దీనితో ఏమవుతూ ఉంది? బాలికలు నీళ్లు తాగడమానేస్తున్నారు. నీళ్లు తాగితే టాయిలెట్ కు వెళ్లాల్సి వస్తుందని వాళ్లు నీళ్లు చాలా మితంగా, అవసరానికంటే చాలా తక్కువగా తీసుకుంటున్నారు. దీనితో వాళ్ల శరీరంలో డీహైడ్రే షన్ జరగుతూ ఉంది. ఫలితంగా యూరినరీ ట్రాక్ట్ ఇన్ ఫెక్షన్ వస్తూ ఉంది. దీనికోసం డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. ఫీజు చెల్లించాలి. మందులు కొనాలి. ఆనారోగ్యం పాలయితే, స్కూలు పోతుంది. ఆర్థికంగా కుటంబం మీద భారం పడుతుంది. ఒక గ్లాసెడు మంచినీళ్లు అందుబాటులో ఉంచి, శుభ్రమయిన టాయిలెట్స్ ఉంటే లక్షలాది అమ్మాయిలు ఆరోగ్యంగా ఉంటారు. బాగా చదువుకుంటారు.
ఇంత గొప్ప భారతదేశంలో చాలా స్కూళ్లలో టాయిలెట్స్ ఉండవు. ఉంటే అక్కడ వాష్ ఏర్పాటు ఉండదు. ఉన్నా ఎక్కడో దూరంగా ఉంటుంది. ఈ బాధ అందరికి అర్థమయ్యేది కాదు. చివరకు చాలామంది బాలికలు కోర్టుకు ఉత్తరాలు రాసి తమ మూగవేదనని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఇపుడు దేశంలో పరిస్థితి కొంతమెరుగు పడుతూ ఉందనియునిసెఫ్ (2018)నివేదిక చెబుతూ ఉంది.
చివరకు యునిసెఫ్ వంటి సంస్థలు మంచినీళ్ల హక్కు గురించి గట్టిగా చెప్పడంతో ఇపుడు ప్రభుత్వాలు స్కూళ్లలో పిల్లలకి మంచినీళ్లు అందుబాటులో ఉంచడం, టాయ్ లెట్స్ వసతి కల్పించడం మొదలుపెట్టాయి.
ఇక్కడ కూడా చాలా చాలా చాలా స్లో. లక్షలాది మంది బాలికల ఆరోగ్యం కంటే క్వార్టర్లు నిర్మించుకోవడం, గెస్టు హౌస్ లు నిర్మించుకోవడం మీద మన పాలకులు ఎక్కువ శ్రద్ధ చూపుతుంటారు. స్కూలుకెళ్లే పిల్లలకు మంచినీళ్లు, టాయిలెట్ అందుబాటులో ఉంచాల్సి అర్జన్సీ కన్నా మరొక ఎమర్జన్సీ ఏదీ ఉండదేమో. అయినా సరే ఇది చాలా రాష్ట్రాలలో ప్రయారిటీగా మారకపోవడం విచారం. తెలంగాణలో 15 శాతం ప్రభుత్వ పాఠశాలలో ఇంకా టాయిలెట్ వసతుల్లేవు.
ఇపుడు కేరళ ప్రభుత్వం రోజు కూడా మూడుసార్లు మంచినీళ్లు తాగేందుకు విద్యార్థులకు విరామం ఇవ్వాలని నిర్ణయించిది. కేరళ విద్యార్థులలో ముఖ్యంగా బాలికల్లో యూరినటీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఎక్కవవుతూ ఉండటం మీద డాక్టర్లు, చిన్నపిల్లలు నిపుణులు ఆందోళనవ్యక్తం చేయడంతో కేరళ ప్రభుత్వంలో ఈ నిర్ణయానికి వచ్చింది. స్కూలు పిల్లలు రోజుకు కనీసం మూడు నాలుగు లీటర్లు నీళ్లు తాగేలా చేయకపోతే ఈ సమస్య పెరుగుతుందని డాక్టర్లు చెప్పడంతో తల్లితండ్రులలో ఆందోళన మొదలయింది. దీనికి ప్రభుత్వం స్పందించింది.
ఇదే మార్గంలో ఇపుడు కర్నాటక కూడ వెళ్లుతూ ఉంది. కర్నాటక విద్యాశాఖ మంత్రి సురేష్ కుమార్ ఇలా వాటర్ ఇంటర్వెల్ అమలుకు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇది విద్యార్థలు అరోగ్యానికి అత్యవసరమని క ర్నాటక గుర్తించిందని ఆయన చెప్పారు.
కేరళలో అమలుఅవుతున్న పథకం ప్రకారం రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ మోగుతుంది. మొదటి గంట ఉదయం 10.35 కు మోగుతుంది. రెండో గంట మధ్యాహ్నం 12.00 కు మోగుతంది. తదుపరి మూడో గంట మధ్యాహ్నం 2 గంటలకు మోగుతుంది. ప్రతిగంట మోగినపుడు 15 నిమిషాల విరామం ఉంటుంది.
ఇది కేవలం నీళ్లు తాగేందుకే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఈచర్య తీసుకోవల్సిన అవసరం ఉంది.