(బి వి మూర్తి)
ఎలిమెంటరీ స్కూల్లో ఆగస్టు 15న జెండా ఎగరేయడం అయిపోయాక జనగణమన పాడుతున్నప్పుడు మా పిల్లోళ్ల కళ్లన్నీ ఆ మూలనున్న గంపల వైపే దొంగగా చూస్తుండేవి. ఆ గంపల్లోనే తర్వాత పంచిపెట్టే పప్పు బెల్లాలు ఉండేది. పేరుకు పప్పు బెల్లాలు కానీ అందులో పప్పులు తక్కువ, బెల్లం ముక్కలు మరీ తక్కువ. బొరుగులు మాత్రం ఎక్కువ. దౌడ నిండా బొరుగులు నింపుకొని నముల్తుంటే అక్కడక్కడా ఒక్కో పప్పు గింజా, ఒక్కో బెల్లం ముక్కా పంటి కిందికొస్తే ఎంత బావుండేదో. పప్పులు, బెల్లం ధర ఎక్కువ కాబట్టి వాటిని చాలా తక్కువగా బొరుగుల్లో కలుపుతారని పిల్లలం మాలో మేము చెప్పుకొనే వాళ్లం.
జెండా పండగకు రెండు మూడు రోజుల ముందు నుంచే మా ఆలోచనలన్నీ పప్పుబెల్లాల గురించే. మిగతా రోజుల్లో అప్పుడప్పుడూ మాత్రమే బడికి వచ్చే బడి దొంగలు (బడికి రాకుండా ఎగ్గొట్టే వాళ్లను బడి దొంగ అంటారు) కూడా జెండా పండగ రోజు మాత్రం తప్పకుండా హాజరయ్యేవాళ్లు.
పప్పుబెల్లాల కోసం అంత ఇదిగా కాచుకుని ఉంటామా, తీరా జనగణమన పాడేటప్పుడు మా ఉత్సాహం అంతా ఇంతా కాదు. అన్ని క్లాసుల పిల్లలు ఒక్కచోట చేరి చేతులు కట్టుకుని జనగణమన పాడాలి. చివరి చరణం వచ్చే సరికి స్వరం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది. జయహే జయహే జయహే జయజయజయ జయహే అని అందరూ గొంతు చించుకుని గాట్టిగా అరచి పాడుతుంటే అయ్యవార్లందరూ ముసిముసిగా నవ్వుతూ మురిపెంగా చూసేవాళ్లు మా వైపు.
అయ్యవార్లు పిడికిళ్లతోనో, దోసిళ్లతోనో పప్పుబెల్లాలు పంచుతుంటే అంగీ ని పైకెత్తి జోలె మాదిరి చేసి వేయించుకునే వాళ్లం. ఒక్కోసారి అంగీకి కింది గుండీలు ఊడిపోయి ఉంటే బొరుగులు ఆ సందులో నుంచి కారిపోతాయన్నమాట. పప్పుబెల్లాలు పంచే సమయంలో ఇటువంటి సమస్య లొస్తే అంగీ కుట్టిన టైలరు సాయిబును తిట్టుకునే వాళ్లం.
ఒక్కోసారి బడిలో పిల్లలందరికీ ఒకే చోట ఒకే అయ్యవారు పప్పు బెల్లాలు పంచేవాడు. పిల్లలందరూ వరసగా అంగీలు పైకెత్తుకుని ఆయన దగ్గరకు పోయి పెట్టించుకోవాలి. ఇంకోసారేమో పిల్లలను ఎవరి క్లాసులకు వాళ్లను వెళ్లిపొమ్మని చెప్పి పప్పు బెల్లాల గంప తెచ్చి ఒక్కో క్లాసులో ఒక్కో అయ్యవారు పంచి పెట్టేవాడు. అప్పుడు మన క్లాసుకు వచ్చే సారు మంచోడైతే మనకు దండిగా పప్పు బెల్లాలు వస్తాయన్న మాట.
చిన్న పిల్లలం కాబట్టి మన అంగీలు చిన్నవి కదా, అందుకని అయ్యవారు అరచేత్తో ముంచి వేసినా జోలె నిండిపోయేది. అప్పుడు అంగీ రెండు కొసలు కలిసే చోట భద్రంగా పట్టుకుని ఒలికి పోకుండా రెండు నిక్కరు జేబుల్లోకి పప్పు బెల్లాలు నింపుకొని ఇంకా మిగిలిన వాటిని అప్పుడే తినెయ్యాలి.
నేను నంద్యాలలో గుడిపాటి గడ్డ స్కూల్లో నాలుగో తరగతి వరకు చదువుకున్నాను. మా స్కూలు నుంచి కొంచం ముందుకు పోతే ఆ సందు కాళికమ్మ గుడి దగ్గర మెయిన్ రోడ్డుకు కలిసేది. ఈ సందులోనే మా స్కూలుకు దగ్గర్లో ఓ ముసలమ్మ ఇంట్లో పాకం పప్పు అమ్మేవాళ్లు. రెండు పైసలకైతే కొంచం, ఐదు పైసలకైతే చేతినిండా పాకం పప్పు వచ్చేది. బెల్లం పాకంలోకి పప్పులు పోసి దాన్ని చేస్తారంట. ఇది బలే ఉంటుంది. నాకు చాలా ఇష్టం. చిన్న పిల్లలం కాబట్టి మన దగ్గర డబ్బులుండవు కదా. అందువల్ల మన ఫ్రెండ్సులలో ఎవరైనా షావుకార్ల పిల్లలు పాకం పప్పు కొనుక్కున్నప్పుడు మనకు కూడా కొంచం ఇచ్చేవాళ్లు.
ఒకసారి ఇట్లా మా ఫ్రెండ్సులలో ఒకడు పాకం పప్పు ఇచ్చినప్పుడు నిక్కరు జేబులో వేసుకుని కొంచం కొంచంగా తింటూ పూర్తిగా ముగించేసి, చేతులు గట్టిగా దులిపేసుకుని ఇంటికి పోయినాను. అయితే నిక్కరు జేబుకు చీమలు పట్టడంతో మన పాకం పప్పు బండారం బైట పడిపోయింది. అట్లా ఎవరెవరో ఇప్పిస్తే తినడం మంచి అలవాటు కాదని ఇంట్లో వాళ్లు తిట్టినారు. పాకం పప్పు తింటున్నప్పుడు కొంచం తిట్లు కూడా తినక తప్పదు కదా అని అనుకున్నాను. పైగా మత్తు చాక్లెట్లు తినిడానికిచ్చి చిన్న పిల్లలను పట్టుకొని పోయే వాళ్ల గురించి మా ఊళ్లో చెప్పుకొనే వాళ్లు. అందుకనే ఇంట్లో వాళ్లు అట్లా చెప్పి ఉంటార్లే అనుకునే వాణ్ని.
నంద్యాలలో ఉన్నప్పుడు స్కూలు పిల్లలం అప్పుడప్పుడు రేగొడలు కూడా పంచుకుని తినేవాళ్లం. రేగిపండ్లను విత్తనాలతో సహా దంచి కొంచం కారం, ఉప్పు కలిపి అరచేతి సైజులో పల్చటి చక్రాల మాదిరి చేసి ఎండపెడితే రేగొడలు తయారవుతాయన్న మాట. ఐదు పైసలకు మూడు రేగొడలు అమ్మేవాళ్లు. ఎవరైనా ఆడఫ్రెండ్సులు మనకి అప్పుడప్పుడు చిన్న ముక్క రేగొడ ఇచ్చేవాళ్లు. ఇది తియ్య తియ్యగా కారం కారంగా బావుంటుంది. రేగొడలో పిచ్చలను మింగకూడదు. బాగా చప్పరించి ఉమ్మెయ్యాలి.
కానీ నాకు రేగొడల కంటే రేగిపండ్లే ఇష్టం. బుట్టలలో పెట్టుకుని ఇంటి దగ్గరకు అమ్మడానికి వస్తే మా అమ్మ చారెడు నూకలు పోసి కొనుక్కునేది. ఇంట్లో వాళ్లకందరికీ భాగాలు పెట్టి పంచితే చిన్న పిల్లవాణ్ని కాబట్టి నాకు రెండు పండ్లు ఎక్కువ ఇవ్వాల్సిందేనని పేచీ పెట్టి జేబులోకి వేయించుకునే వాణ్ని. పూర్తిగా పండి నొక్కులు పడిన వాటికంటే దోరమాగి పసుపు ఎరుపు కలగలిసిన దోరపండ్లంటేనే నాకు ఎక్కువ ఇష్టం.
నంద్యాలలో చెరువు కట్టమీద ఒక చివరన మూలమఠంలో శివాలయం ఉండేది. ఒక సారి కార్తీక మాసం చివరి సోమవారం రోజున మా ఇంటి వాళ్లం, చుట్టుపక్కల ఇళ్లవాళ్లం కలిసి వనభోజనాలకు పోయినాము. ఇంకా ఎక్కడెక్కడి వాళ్లో చాలా మంది వచ్చినారు. మూలమఠంలో గుడి చుట్టూ చాలా రకాల చెట్లు పెద్ద పెద్జవి ఉండినాయి.
పెద్దవాళ్లు వంటలు చేస్తూ మాట్లాడుకుంటుంటే కొందరు పెద్దపిల్లలు సీమ చింత చెట్టుకు వేలాడుతున్న సీమ చింతకాయ గుత్తులను రాళ్లతో కొట్టి కాయలు సంపాదించాలని ప్రయత్నిస్తుండినారు. నేను కూడా వాళ్ల దగ్గరకు పోయి నిలబడినాను.
ముగ్గురు నలుగురు ఒకరి తర్వాత ఒకరు రాయిని ముద్దు పెట్టుకుని రయ్ మని విసిరితే అది గుత్తికి కొంచం పక్కనుంచి వయ్ మని వెళ్లిపోతున్నది. వాళ్లతో పాటు నేనూ అయ్యో అని బాధ పడినాను. ఇట్లా నలభై యాభై రాళ్లు కొట్టినా పైనా కిందా పక్కకూ పోతున్నాయే తప్ప ఒక్కటీ గుత్తికి తగలడం లేదు. ఒక్కో రాయీ మిస్సయ్యే కొద్దీ వాళ్లకు పంతం పెరిగిపోతున్నది. చివరకు ఆ పెద్దపిల్లల్లో చిన్నవాడు కొట్టిన దెబ్బ గుత్తికి మధ్యన తగిలి సీమచింతకాయలు జలజలా రాలినాయి. నాతో సహా అందరికీ ఎంత సంతోషమో. తర్వాత తర్వాత అంచులు చాకు మాదిరి చూపుగా ఉన్న రాళ్లను ఏరుకుని సూటిగా చూసి కొడుతుంటే అందరికీ కాయలు పడినాయి. అంతసేపు వాళ్లతో ఉన్నందుకు నాకు కూడా రెండు మూడు కాయలు ఇచ్చినారు.
నేను సీమ చింతకాయలు చూడటం, తినడం అదే మొదటి సారి. ఆ కాయలను వలచడం, తినడం నాకు రాదు. వాళ్లను చూసే నేర్చుకున్నాను. ఇవి కూడా చింతకాయల మాదిరే ఉన్నాయి కానీ రౌండు తిరిగి ఉంటాయి. ఆకుపచ్చ రంగులో అక్కడక్కడా తెల్లని, ఎర్రని మచ్చలున్న ఈ కాయలను చిక్కుడు కాయల మాదిరి వలిచి పిచ్చల చుట్టూ ఉన్న గుజ్జును మాత్రం తిని పిచ్చలను పడెయ్యాలి. గుజ్జు కొంచెం చప్పగా కొంచం తియ్యగా ఉంటుంది
(బివి మూర్తి, సీనియర్ జర్నలిస్టు. బెంగుళూరు)