(డా. కే.వి.ఆర్.రావు)
మా యూరోప్ యాత్ర లండన్ టూర్ లో ఉన్నామిపుడు.
మా టూర్ రెండో రోజున, అంటే ఆగస్ట్ 15వ తేదీన అందరం హోటెల్ లాబిలోను, బస్సులోను జండావందనం చేసి శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ముఖ్యంగా లండన్ లో మన స్వాతంత్ర్యదినం జరుపుకోవడం అందరికీ ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది.
మా టూర్ కి థామస్ కుక్ తరఫున మొత్తం పదిహేనురోజులకీ టూర్ మేనేజర్ గా అరుణ్ వచ్చాడు. దక్షిణదేశపు అన్నిభాషలూ వచ్చిన అతను ముందురోజే లండన్ ఎయిర్పోర్టులో మమ్మల్ని ఆహ్వానించి అప్పట్నుంచి చాలా కలివిడిగా ఉంటూ వెంటనే అందరికీ స్నేహితుడైపోయాడు. మొదటిరోజే బస్సులో మా టూర్ మేనేజర్ అనేక విషయాల్లో ఎలావుండాలో, ఎలావుండకూడదో, ముఖ్యంగా మొదటిసారి పాశ్చ్యాత్య దేశాలు సందర్శిస్తున్నవారికి, వివరంగా చెప్పాడు.
వాటిలో కొన్ని; అక్కడ మనసామాన్లు బస్సునుంచి హోటల్ రూముకి, రూమునుంచి బస్సుకి మనమే మోసుకోవాలి లేదా లాక్కోవాలి, రూంబాయ్స్ ఉండరు. యూరప్ అంతా బాత్రూముల్లో కుళాయిల్లోంచి మంచినీళ్లే వస్తాయి. అవే తాగాలి, సీసాల్లో అవే పట్టుకోవాలి (బాటిల్డ్ నీళ్లు చాలా ఖరీదు). బాత్రూముల్లో నేలపైన నీళ్లు పడరాదు. అవి చెక్కలతో కట్టివుంటారుకాబట్టి నేల పాడయితే పీనల్ చార్జెస్ చాలా వసూలు చేస్తారు. ప్రతిరోజూ ఉదయం కాంటినెంటల్ బ్రేక్ ఫాస్ట్ మాత్రమే ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ కి పెట్టిన తిండిపదార్థాలు, కాఫీ, నీళ్లతో సహా ఏదీ తమతో తీసుకెళ్లకూడదు. ఆహార పదార్థాలు తినగలిగినంతే పెట్టుకోవాలి, వృధా చేయకూడదు. టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి, బస్సు తప్పిపోతే స్వంత క్యాబ్ ఖర్చులతో తిరిగి పట్టుకోవాలి. రెస్ట్ రూమ్స్ అన్నిచోట్లా ఉచితం కాదు, కొన్నిచోట్ల 20 నుంచి 70 సెంట్లవరకు వసూలు చేస్తారు, కాబట్టి చిల్లర దగ్గరుంచుకోవాలి. ప్రతిచోటా క్యూలు ఖచ్చితంగా పాటించాలి. ఫూట్ పాత్ ల పైన అడ్డుగా గుమికూడి మాట్లాడ్డం, సైకిల్ దారులకు అడ్డుగా ఉండడం చేయకూడదు. చెత్తను డస్ట్ బిన్ లోమాత్రమే వేయాలి. అన్నిటికంటే పాస్ పోర్టుని జాగ్రత్తగా చూసుకోవాలి. మిగతా దేశాలమాటెట్లున్నా లండన్, ప్యారిస్, ఇటలీలోని నగరాల్లో దొంగతనాలెక్కువ, జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ మనకు తెలిసినవే ఐనా మనదేశంలో అంతగా పాటించరు కాబట్టి చెప్తున్నామన్నారు. వాళ్లు చెప్పని విషయం, ఉత్తరోత్రా మేము గమనించిన విషయం ఏమిటంటే అక్కడి హోటళ్లవాళ్లకు (వాళ్ల అనుభవరీత్యా?) గుంపుగా వచ్చే యాత్రీకులమీద అంత ఖాతరీ ఉండదనీ, మనమే సర్దుకుపోవడం మంచిదని.
మా లగ్జరి బస్సులో మా యూరప్ యాత్ర రెండోరోజు లండన్ నగర సందర్శనతో మొదలైంది. ప్రిన్స్ అల్బెర్ట్ మెమోరియల్ తో మొదలై హైడ్ పార్కు, బిగ్ బెన్, పార్లమెంటు భవనం, థేమ్స్ నది, టవర్ బ్రిడ్జి, గ్లోబ్ థియేటర్, వెస్ట్ మినిస్టర్స్ ఎబె, బకింగ్ హామ్ ప్యాలెస్, ట్రఫాల్గర్ స్క్యేర్, లార్డ్స్ మైదానం లాంటివన్నీ చూసి మధ్యాన్నానికి మేడం టస్సాడ్ మ్యూజియం దగ్గరికి వచ్చాము. టూర్ మేనేజర్ కాక మిస్టర్ ‘జాన్’ అనే ఇంగ్లిష్ గైడ్ కూడా మాబస్సులో ప్రయాణించి అన్నిటిగురించి వివరిస్తూ వచ్చారు. గైడ్లకు యాత్రీకులనుంచి ఎదురైన రకరకాల అనుభవాల దృష్ట్యా వాళ్ల పద్దతులు ఒక మూసరూపాన్ని పొందివుంటాయనుకుంటా. జాన్ స్నేహంగా ఉన్నా, ఉద్యోగధర్మంగా తను చెప్పేదేదీ మిస్ కాకుండా, మా ప్రశ్నలకు నిదానంగా తరువాత జవాబులు చెప్పారు.
అల్బెర్ట్ మెమోరియల్, ట్రఫాల్గర్ స్క్యేర్, బకింగ్ హామ్ ప్యాలెస్ ల దగ్గర బస్సుదిగి చూశాము. క్వీన్ విక్టోరియా ఈ 176 అడుగుల మెమోరియల్ ని 1872 లో తన భర్త అల్బెర్ట్ స్మృతి కోసం ఆరోజుల్లో లక్షాఇరవేల పౌండ్లు ఖర్చుపెట్టి కట్టించిందట. దీనికోసం అంత ప్రజాసొమ్ము ఖర్చు చేయాలా అని మాలో కొందరం అనుకున్నాం (అప్పటికే దశాబ్దాలుగా మనదేశం వాళ్లపాలనలో ఉంది). ఆ ప్రాంగణంలో 1844 లో నెపోలియన్ మీద ట్రఫాల్గర్ వద్ద నెల్సన్ సాధించిన విజయానికి గుర్తుగా నాలుగు సింహలవిగ్రహాల ప్లాట్ ఫాంమీద 170 అడుగుల ఎత్తైన నెల్సన్ స్థూపం నిర్మించారు, అప్పటినుంచి ఆ ప్రాంగణానికి ట్రఫాల్గర్ స్క్యేర్ అనే పేరు వచ్చిందట. ఆ స్క్యేర్ ఎదురుగా నేషనల్ గ్యాలరి అనే పెద్ద మ్యూజియం ఉంది. ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ తన ‘హాహాహూహూ’ కథలో ఈ స్క్వేర్ ని, థేమ్స్ నదిని ప్రస్తావించడం మాకు గుర్తొచ్చింది. అక్కడినుంచి వచ్చే మార్గంలో రెండు ప్రపంచయుద్ధాల్లో ప్రాణాలర్పించిన భారతీయ సైనికుల ఙ్ఞాపకచిహ్నాలకెళ్లే దారి చూపించారు. బకింహామ్ ప్యాలెస్ ముందున్న ప్రాంగణంలో కొద్దిసేపు తిరిగాము. ప్యాలెస్ లో ఆరోజు రాణిగారు లేరని, వేసవియాత్రలోవున్నారని చెప్పారు. ఉన్నప్పుడు నిర్ణీత సమయాల్లో రెండో అంతస్తు బాల్కనిలొకొచ్చి యాత్రీకులను చెయ్యూపి పలకరిస్తారట. మన పాతరాణిగారిని చూసే ‘భాగ్యం’ మాకు కలగలేదు.
మధ్యాహ్నం బెంగళూరు ఎక్స్ ప్రెస్ అనే హోటల్లో అన్నం, పప్పు, సాంబారు, రసంలాంటి దక్షిణభారత వంటకాలతో భోజనంచేశాము. మేడం టస్సాడ్ మ్యూజియం చూసిన తరువాత థేమ్స్ తీరానికి మళ్లీవెళ్లి పెద్ద క్యూలో నిలబడి ‘లండన్ ఐ’ అనే పెద్ద జైంట్ వీల్ ఎక్కి లండన్ అంతా మళ్లీ విహంగవీక్షణం చేశాము. దాంతో మా మొదటిరోజు యాత్ర ముగిసింది. ఆరోజు రాత్రి హోటల్లోనే ఇండియన్ డిన్నర్ ముగించి విశ్రాంతి తీసుకున్నాము. (ప్రపంచంలోని ముఖ్యమైన అన్ని ప్రదేశాల గురించిన విస్తృత సమాచారం ఇంటర్నెట్లో దొరుకుతుందికాబట్టి స్థలాభావంవల్ల ఈ వ్యాసావళిలో కొన్నిటిగురించి మాత్రమే వివరించడం జరిగింది).
లండన్ లో మాక్కనిపించిన విశేషాల్లో ముఖ్యమైంది లోపలి నగరానికి వెలుపలి నగరానికిగల తేడా. లోపలి నగరమంతా, అవి ఇళ్లుకావచ్చు, ఆఫీసులుకావచ్చు, దాదాపుగా ఒకేరకమైన భవననిర్మాణశైలిలో ఉన్నాయి. అక్కడి భవనాలన్నీ ప్రభుత్వం ఆధీనంలోవుండి వాటి ఆకృతి, రంగు మొదలైనవన్నీ ఎలావుండాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుందట. గైడ్ అనేక చోట్ల ఆయా ప్రదేశాల లేక భవనాల విశేషాల్ని తెలియజేశారు. ఎవోకొన్ని ల్యాండ్ మార్క్స్ తప్ప అన్నీ ఒకలాగే ఉండడంతో మనం వాటిని ఏదిఏదో గుర్తుపట్టడానికి చాలారోజులు పట్టచ్చు. వీధులు, భవనాలు, పరిసరాలు అన్నీ శుభ్రంగా ఉన్నాయి. చాలా ప్రదేశాలు రోడ్ల పక్కన చెట్లతో పచ్చగావున్నాయి.
ఒక చిన్న దేశంగావుండి దాదాపు రెండువందల సంవత్సరాలకు పైగా ప్రపంచంలోని అనేక దేశాలను ఆక్రమించుకుని పరిపాలించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి ముఖ్యపట్టణంగా, ఇప్పటికీ ప్రపంచంలోని అతిముఖ్యమైన కేంద్రాలలో ఒకటిగా ఉన్న లండన్ నగరాన్ని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించి అంతుచిక్కక ఆశ్చర్యపోతాము.
(తరువాయి మూడవభాగంలో )
మొదటి భాగం
https://trendingtelugunews.com/english/features/travelogue-europe-tour-kohinoor-diamon/