రాష్ట్రావతరణ దినోత్సవాలు, స్వాత్రంత్య్ర దినాలు ఉద్వే గ పూరితమయినవి. వాటి గురించి తెలియకపోయినా దేశభక్తిని రగిలించే సందర్భాలవి. అలాంటి వాటి తారీఖులకు చాాలా ప్రాముఖ్యం ఉంటుంది. ఏదో ఒక తేదీ అనుకోని వాటిని నిర్ణయించరు. వాటి వెనక చరిత్ర ఉంటుంది. అదే పౌరుల నడవడిని నిర్ణయిస్తుంది. మొన్న నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రావతరణ దినోత్సవం జరిపింది. దానికి ఆంధ్రప్రదేశ్ కు సంబంధం ఏమిటో ఎవరికి అర్థం కావడం లేదు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, ఆయన అంతేవాసులు నవంబర్ 1వ తేదీనుండి 3 రోజుల పాటు ఆంద్రరాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించడం ఏలినవారి అవగాహనా రాహిత్యానికి నిదర్శనంగా పలువురు వాపోతున్నారు.
ఈ నిర్ణయం జగన్ మోహన్ రెడ్డికి ఆయన సలహాదారులిచ్చిన “ అద్భుతమైన చచ్చు- పుచ్చుసలహాగా ” పలువురు అభివర్ణిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన పోరాటం, అందులో ముఖ్యమైన ఘట్టాలు చోటుచేసుకున్న తేదీలను మరచి ఏ మాత్రం ప్రాధాన్యత లేని తేదీని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నిర్ణయించడం శోచనీయమని పలువురు వాపోతున్నారు. ఈ నిర్ణయం చరిత్ర తెలిసిన వారితో పాటు అనేక మంది సాధారణ ప్రజలను కూడా తీవ్ర అసంతృప్తికి గురిచేసిందని చెప్పక తప్పదు.
ఆంద్ర రాష్ట్ర ఏర్పాటులో కీలక ఘట్టాలు.
మద్రాస్ ప్రావిన్స్ లో ఉండి తీవ్ర వివక్షకు గురౌతున్న తెలుగు ప్రజలు తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలని స్వాతంత్ర్యానికి పూర్వమే పోరాటం ప్రారంభించారు. అప్పటికి మద్రాస్ రాష్ట్రంలో తెలుగు ప్రాంతాలైన కోస్తా ఆంద్ర, రాయలసీమ ఉండేవి. మడ్రాస్ నుండి విడిపోయి ప్రత్యేక తెలుగు రాష్ట్రంగా ఏర్పడాలన్న అంశంపై ఈరెండు ప్రాంత నాయకుల మధ్య తీవ్రమైన అభిప్రాయభేదాలుండేవి. మద్రాస్ నుండి విడిపోయి కోస్తా ప్రాంతంతో కలవడానికి రాయలసీమ నాయకులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రెండు ప్రాంతాల పెద్దలు చర్చించి “శ్రీభాగ్” 1937 అక్టోబర్ 16న ఒడంబడిక కుదుర్చుకున్నారు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఊపందుకున్నది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినా తెలుగు ప్రజల స్వప్నం తీరకపోవడంతో పొట్టిశ్రీరాములు 1952 అక్టోబర్ 16 న ఆమరణ నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15 రాత్రి అసువులు బాసారు. స్పందించిన నెహ్రు డిసెంబర్ 19న రాష్ట్ర ఏర్పాటుపై సముఖత వ్యక్తం చేసి, డిసెంబర్ 29న పార్లమెంటులో ఆంద్ర రాష్ట్రంపై ప్రకటన చేశారు. అన్ని రాజకీయ, చట్ట బద్దమైన ప్రక్రియ పూర్తి చేసి 1953 అక్టోబర్ 1 న ఆంద్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల వల్ల 1956 నవంబర్ 1న తెలంగాణా కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన విషయం విదితమే.
తెలంగాణా వేర్పాటు ఉద్యమం వల్ల 2014 జూన్ 2 న రాష్ట్రం రెండుగా చీలి ఆంధ్రప్రదేశ్ పేరు నిలుపుకున్న పూర్వపు ఆంద్ర రాష్ట్రం ఏర్పడింది.
నవంబర్ 1 ని రాష్ట్ర అవతరణ దినోత్సవం గా ఏలిన వారు ఏ ప్రాతిపదికన ఎంపిక చేశారో?
ఆంద్ర రాష్ట్రం ఏర్పాటుకు ఇంత చరిత్ర ఉన్న నేపథ్యంలో ఏ మాత్రం ప్రాధాన్యత లేని నవంబర్ 1 ని రాష్ట్ర అవతరణ దినంగా ఏ ప్రాతిపదికన ఏలినవారు నిర్వహించారో? సాధారణ జనానికి కానీ, చరిత్ర కారులకు కానీ అర్తం కావడం లేదు. అపర మేధావులైన జగన్ మోహన్ రెడ్డి సలహాదారులు ఇలాంటి సలహా ఎందుకిచ్చారో కూడా ఎవరికీ అర్తం కావడం లేదు.
ఇప్పుడున్న అవశేష ఆంద్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్ణయించాలంటే “ఈ రాష్ట్రం ఏర్పాటుకు కీలకమైన శ్రీభాగ్ ఒడంబడిక కుదిరిన అక్టోబర్ 16న నిర్వహించడం ఒక మార్గం. అలా కాక పోతే ఈ రాష్ట్రం ఏర్పాటుకు ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష ప్రారంభించిన అక్టోబర్ 16న కానీ, తనువు చాలించిన డిసెంబర్ 15న కానీ నిర్వహించడం అత్యంత సముచితం.
అదీ కాక పొతే ప్రధాని నెహ్రు రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిన డిసెంబర్ 29న కానీ, రాష్ట్రం ఏర్పాటైన అక్టోబర్ 1న కానీ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపడం సమంజసం.
పొరపాటున ఇదీ కాదనుకుంటే 2014లో రాష్ట్రం రెండుగా చీలిన జూన్ 2న అయినా జరిపి ఉండవచ్చు.
ఇన్ని చారిత్రిక అంశాలను పక్కన పెట్టి ఎపుడో రెండు ప్రాంతాలను కలిపిన నవంబర్ 1 న విభక్త రాష్ట్ర అవతరణ దినోత్సవం మూడు రోజులపాటు జరపడంలో ఔచిత్యమెంతో ఏలినవారు, వారి ముఖ్య సలహాదారులు సెలవివ్వాలి.
రాజధాని విషయంలో కమిటీని వేసి ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుట్టిన వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర అవతరణ పైన కూడా ప్రజాభిప్రాయ సేకరణ జరిపి రాష్ట్ర అవతరణ దినోత్సవం పై నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని పలువురు అభిప్రాయ పడ్డారు.
“ఇది ముఖ్యమంత్రి మదిలో పుట్టిన ఆలోచన ఐతే ఇంట చెత్త ఆలోచన ఆయన ఇప్పటి వరకు ఆయన చేయలేదని చెప్పవచ్చు. ఒకవేళ ఇది ఆయన సలహాదారులు ఇచ్చిన ఆలోచన ఐతే ఇంతకంటే చచ్చు-పుచ్చు ఆలోచన మరొకటి ఉండదని చెప్పక తప్పదు.” ప్రభుత్వ పెద్దలు ఇప్పటికైనా జరిగిన పొరపాటును సర్దుకొని ప్రజాభిప్రాయ సేకరణ జరిపి రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్ణయించాలని పలువురు సూచించారు.