(డా. కే.వి.ఆర్.రావు)
రచయిత ఈ మధ్య జరిపిన యూరోప్ యాత్ర విశేషాలను సీరియల్ గా అందిస్తున్నాం. ఇది మొదటి భాగం, నాంది
మన దేశం తరువాత మనకు బాగా తెలిసిన దేశాల సముదాయం యూరప్ అనుకుంటాను.
మనల్ని బ్రిటిషు వాళ్లు రెండొందలయేళ్లు పరిపాలించడంవల్ల కాబోలు హైస్కూల్లో యూరోపియన్ చరిత్రే ఎక్కువగా చదువుకున్నాం.
మనసంస్కృతిలో ఆంగ్లేయుల సంస్కృతి ఒక భాగమైపోవడమేకాక ఇప్పటికీ ఫ్రెంచ్, డచ్, పోర్చుగీసువాళ్ల ఆనవాళ్లు మనదేశంలో మిగిలి ఉండడంకూడా మరోకారణం కావచ్చు.
అంతేకాక అమెరికా తరువాత యూరప్ దేశాలకు సంబంధించిన వార్తలు నిత్యం చూస్తూనేవుంటాం. వెరసి వీటివల్ల యూరప్ దేశాలమీద ఆసక్తి, చూడాలనే కోరిక ఉండడం సహజం.
పైగా ఇటీవలికాలంలో మరింత సుఖవంతమైన టూర్ ప్యాకేజిలు అందుబాటులోకి రావడంవల్ల వెళ్లగలిగినవాళ్లకి యూరప్ యాత్రలు సులువయ్యాయి.
అయితే ప్యాకేజీల్లో ఒక చిక్కులేకపోలేదు. మనం చూడాలనుకున్నవి కాకుండా వాళ్లు చూపించినవి మాత్రమే చూడగలం. అవి జనరంజకమైన ప్రదేశాలుగా మాత్రమే ఉంటాయని వేరే చెప్పక్కరలేదు.
నిజానికి మన అభిరుచులను బట్టి మనమే స్వయంగా వెతుక్కుని ఏవైతే తప్పక చూడాలనుకుంటామో అవి చూసేవిధంగా ప్రణాళికవేసుకుని, ఇంటర్ నెట్ సహాయంతో అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్లడం ఉత్తమం. అయితే ఖరీదు పరంగా తేడావుండడమేకాక, మనకై మనమెళ్తే సరైన మార్గదర్శనం లోపించడం, భాషాసమస్యలు, లాజిస్టిక్స్, కాలహరణంలాంటి ఇబ్బందుల్లో పడి అంతదూరం వెళ్లి సరైన అనుభూతి పొందకుండా తిరిగి రావాల్సివుంటుందనే సందేహం వల్ల చాలామంది, ముఖ్యంగా మొదటిసారి వెళ్లేవాళ్లు, ప్యాకేజీలకే మొగ్గు చూపుతారు. మేమూ అలాగే మొగ్గు చూపాం.
అన్ని ప్రముఖ కంపెనీల వివిధ ప్యాకేజీలను పరిశీలించిన తరువాత మేము థామస్ కుక్ వారి 15 రోజుల 9 దేశాల గ్రాండ్ యూరప్ టూర్, సౌత్ ఇండియన్ స్పెషల్ ప్యాకేజిని ఎన్నుకున్నాము.
మూడుపూట్లా తిండి, అన్నిచోట్లా ఎంట్రి టిక్కెట్లు, టిప్పులతో సహా అన్ని ఖర్చులు కలిపిన ప్యాకేజి ఇది.
ఈప్యాకేజిలో వీలైనంతవరకు దక్షిణభారత భోజనాలుంటాయని చెప్పారు. ఆగష్టు 14 నుంచి 29 (నిజానికి సందర్శన యాత్ర 13 రోజులే, 14న చేరడం, 29 న తిరుగుప్రయాణం) వరకు మా టూర్.
అప్పటికి అక్కడ ఎండలు, వేడి కొంత తగ్గివుంటాయని చెప్పారు. సాధారణంగా ఈ దేశాల వీసాలు తెప్పించే వసతి కూడా ఈ ప్యాకేజీల్లో ఉంటుంది. ఇంగ్లాండ్ తప్ప దాదాపు అన్ని యూరప్ దేశాలకు ఒకే ‘షెంజెన్’ వీసా సరిపోతుంది.
కానీ మేము వెళ్లే దేశాల్లో ఇంగ్లాండు కూడాఉంది కాబట్టి మేము అదనంగా బ్రిటిష్ వీసా కూడా తీసుకున్నాము.
అనుకున్నట్టుగానే నేను, మా శ్రీమతి ఆగస్ట్ 13 రాత్రి ఎతిహాద్ విమానంలో హైదరాబాదులో బయలుదేరి అబుదాబిలో విమానం మారి ఆగస్ట్ 14 పొద్దున 7 గంటలకు లండన్ విమానాశ్రయంలో దిగాము.
మా ప్యాకేజిలో మొత్తం 45 మంది ఉన్నారు. అందులో 10 మంది హైదరాబాదు మిగతావారు బెంగుళూరు, చెన్నై లాంటి ఇతర ప్రదేశాల్నుంచి వచ్చి వివిధ సమయాలలో లండన్ చేరారు. మొత్తంసభ్యుల్లో సగంమందికి పైగా తెలుగువారు.
యాత్ర మొదటిరోజు (జీరో డే): లండన్ నగరప్రవేశం;
ఆ రోజు ఇంకా వివిధ ప్రదేశాల్నించి మిగతా వాళ్లు రావాల్సివుంది కాబట్టి ఆగస్ట్ 15నుంచి (రెండవరోజునుంచి) మా టూర్ మొదలౌతుంది. మేం 14న పొద్దున్నే వచ్చేశాం కాబట్టి ఆరోజున ఖాళీ అన్నమాట.