తెలంగాణ ప్రభుత్వంలో విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక స్థానం
విశ్వ బ్రాహ్మణ మను మయ మహాసభలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
విశ్వ బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రవీంద్రభారతిలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ మను మయ మహాసభకు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సదర్బంగా ఆయన మాట్లాడుతూ… విశ్వ బ్రాహ్మణుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, వారి సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కోట్లాది రూపాయల నిధులు ఖర్చు చేస్తూ చేతి వృత్తుల వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.
విశ్వ బ్రాహ్మణులను అర్చకులుగా గౌరవిస్తూ… ధూప దీప నైవేద్యం పథకంలో అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వమేనని అన్నారు. వివిధ ఆలయాల్లో అర్చకత్వం చేస్తున్న విశ్వ బ్రాహ్మణులకు ధూప దీప పథకం ద్వారా ప్రతి నెల రూ.6 వేల గౌరవ వేతనం అందజేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ బ్రాహ్మణులకు చెందిన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయాల నిర్మాణాలకు ప్రభుత్వం కామన్ గుడ్ ఫండ్ ద్వారా రూ.1.81 కోట్లను మంజూరు చేసిందన్నారు.
కలప ఆధారిత పరిశ్రమల (సామిల్) సమస్యలను విశ్వ బ్రాహ్మణులు మంత్రి దృష్టికి తెచ్చారు. సామిల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని మంత్రిని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామినిచ్చారు. కలప ఆధారిత పరిశ్రమల కార్మికులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి… పరిష్కార మార్గాలను చూద్దామన్నారు.