తెలుగు నాట పెళ్లిళ్ల పాట గా మారిన ‘సీతారాముల కల్యాణం చూతము రారండి‘ పాటలోని నటి గీతాంజలి కన్ను మూశారు.
గుండె పోటుతో ఆమె నిన్న రాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చనిపోయారు.
ఆమె జన్మస్థలం రాజమండ్రి. తల్లితండ్రులు శ్యామలమ్మ, శ్రీరామమూర్తి. ఆమెకు ఒక అక్క ఉన్నారు. ఆమె పేరు స్వర్ణ ఆమెకూడా కొన్నిచిత్రాలలో నటించారు.
ఆమె అసలు పేరు మణి. లక్మీకాంత్ ప్యారేలాల్ చిత్రం పరస్ మణిలో లో నటించిన తర్వాత ఆమె పేరు గీతాంజలిగా మారింది. చిత్రం టైటిల్ మణి అన మాట ఉన్నందున, ఆమె పేరులో మణి ఉండటం బాగుండదని గీతాంజలిగా మార్చారు.
నాటి ప్రముఖ నటుడు , హీరో రామకృష్ణ భార్య. ఆమె సుమారు 400 సినిమాలలో నటించారు. హీరోయిన్ గా, కామెడీ ఆర్టిస్టుగా,క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు, కన్నడ, తమిళం, హిందీ చిత్రాలలో నటించారు. ఆమె తలిచిత్రం రాణి రత్న ప్రభ. ఆమె వెంపటి చిన సత్యం దగ్గిర భరత నాట్యం నేర్చుకుంటున్నపుడు ఇందులో నటించే అవకాశం దొరికింది. దీనితో రాణి రత్న ప్రభంలో ఆమె పాత్ర భరత నాట్యానికే పరిమితమయింది.
తర్వాత ఎన్టీ రామారావు తో దర్శకత్వం వహించిన సీతారామకల్యాణం (1961)చిత్రంలో సీత పాత్రతో ఆమె పూర్తి స్థాయి నటి అయ్యారు.
దక్షిణాదికి చెందిన ప్రఖాతనటులు ఎన్టీర్ ఎఎన్ ఆర్, శివాజీ గణేశన్, రాజకుమార్ వంటి వారితో ఆమె నటించారు. డాక్టర్ చక్రవరి (1963) కూడా ఆమె నటించారు.
ఇటీవల ఆమె పెళ్లైన కొత్తలో ( 2006), చందమామ కథలు (2016)లో కూడా నటించారు.బాబూబాయ్ మిస్ట్రి దర్శకత్వంలో వచ్చిన హిందీ చిత్రం పరస్ మణి లో కూడా ఆమె నటించారు. ఆమె టివి సీరియల్స్ కూడా నటించారు.
నన్ను సినిమాల్లో చేర్పించాలని నాన్నగారికి కోరిక ఉండేది. ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య దర్శకుడు వెంపటి సత్యం గారి దగ్గర నేను భరత నాట్యం నేర్చుకునేదాన్ని. అదే సమయంలో దర్శకులు బి.ఎ.సుబ్బారావుగారు ‘రాణీరత్నప్రభ’ చిత్రం నిర్మిస్తున్నారు. ఆ చిత్రంకోసం నాట్యకళాకారులు కావాలని సుబ్బారావుగారు అడగటంతో, మా గురువు వెంపటి సత్యం గారు నాతో సహా నలుగురిని పంపించారు. మా నలుగురిచేతా బిట్లు బిట్లుగా డ్యాన్స్ చేయించారు. ఇందులో నాది భరత నాట్యం పాత్ర.
హీరోయిన్‌గా తొలి చిత్రం
‘రాణీరత్నప్రభ’ చిత్రంలో రామారావుగారు కథానాయకుడు. అంజలీదేవి గారు కథానాయిక. ఈ సినిమాలో నా భరతనాట్యం చిత్రీకరణ కోసం మా నాన్నగారు నా వెంట సహాయంగా వచ్చారు. నా నృత్య ప్రదర్శన షాట్ల చిత్రీకరణ పూర్తయింది. అప్పుడే ఎన్.టి.రామారావుగారు నన్ను చూశారు. అప్పటికప్పుడే. రామారావుగారు, కమలాకర కామేశ్వరరావుగారు నాన్నగారిని పిలిపించి ఆయన్ను సంప్రదించారు. ‘సీతారామ కల్యాణం’ చిత్రంలో సీత పాత్ర కోసం అన్వేషిస్తున్నారు. ఆ పాత్రకు మీ అమ్మాయి అయితే సరిగ్గా సరిపోతుంది, ఒప్పుకుంటారా?’ అని వారుఇద్దరూ నాన్నగారిని అడిగారు. వెంటనే ఆయన అంగీకరించారు. ఆ విధంగా నాకు ‘సీతారామ కల్యాణం’ చిత్రంలో అవకాశం వచ్చింది. రాముడి పాత్రలో హరనాథ్‌గారు, రామారావుగారు రావణాసురుడుగా, కాంతారావుగారు నారదుడుగా నటించారు. నటిగా ఇది నాకు రెండవ చిత్రం. హీరోయిన్‌గా మొదటి చిత్రం. ఆ విధంగా డాన్స్ నా జీవితాన్ని మలుపు తిప్పింది.
నేటికీ వాడవాడలా అదేపాట
‘సీతారామ కల్యాణం’ చిత్రం ఎంతో విజయవంతం అయింది. అంతేకాకుండా, ఆ చిత్రంలోని ‘‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండీ….’’ అనే పాట నాటికీ నేటికీ కూడా వాడవాడలా వినిపిస్తూనే ఉండటం ఎంతో గొప్ప విశేషం. అంత హిట్ పాట నాకు మంచి గుర్తింపు రావడానికీ, నా కెరీర్‌కూ ఎంతగానో దోహదం చేసింది. ఆ చిత్రం తర్వాత ఇతర నిర్మాణ సంస్థల నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. ఐతే రామారావుగారి యన్.ఏ.టి సంస్థతో ఒప్పందం ఉన్న కారణంగా నేను ఎవరికీ కాల్‌షీట్స్ ఇవ్వలేకపోయాను. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, మా అక్క య్యకు కూడా సినిమాల్లో నటించాలని ఎంతో కుతూహలం ఉండేది. అందుకే సినిమా రంగంలో మొదట రెండు సంవత్సరాలూ నా పేరు, మా అక్క పేరు కలిపి నన్ను స్వర్ణమణి అని కూడా పిలిచేవారు.
ఈ చిత్రంలో నాది సీత పాత్ర. మా అక్కది శూర్పణఖ పాత్ర. అయితే తర్వాత అక్క భీష్మ, మరో రెండు మూడు చిత్రాల్లో నటించాక పెళ్ళి చేసుకుని వెళ్ళిపోయింది. నేను మాత్రం ఒప్పందం ఉండటం వల్ల ఆ సంస్థలోనే ఉంటూ, సీతారామ కల్యాణంతో పాటు ‘గులేబకావళి కథ’ చిత్రంలో కూడా నటించాను. రెండేళ్ళ తర్వాత ఇతర నిర్మాణ సంస్థల చిత్రాల్లో కూడా నటించడం ప్రారంభించాను.
ఎన్టీఆరే నా మొదటి గురువు
నా మొదటి గురువు రామారావుగారే. డైలాగులు ఎలా చెప్పాలి? ఎలా నటించాలి? హావ భావాలు ఎలా ప్రదర్శించాలి? వంటి అనేక విషయాలు ఎన్.ఎ.టి సంస్థ లోనే నేర్చుకున్నాను. రామా రావుగారి ఫ్యామిలీతో మేమంతా చాలా సన్నిహితంగా, ఒకే కుటుంబంలా ఉండేవాళ్ళం. వాళ్ళ సంస్థలో ఎక్కువ నటించేదాన్ని. నన్ను సినిమా పరిశ్రమలోకి తీసుకువచ్చింది బి.ఎ.సుబ్బారావుగారైతే, నన్ను హీరోయిన్‌గా చిత్రపరిశ్రమకు పరిచయం చేసి, ప్రోత్సహించింది ఎన్.టి.రామారావుగారే.
ఇల్లాలు చిత్రం
ఇక ఎల్.వి.ప్రసాద్‌గారి చిత్రం ‘ఇల్లాలు’లో నాది కథానాయిక పాత్ర. ఈ చిత్రంలో కథానాయకుడుగా అక్కినేని నాగేశ్వరరావుగారిని అనుకున్నారు గానీ, వారు బిజీ షెడ్యూలులో ఉండటంతో మరో కొత్తబ్బాయితో నటింపజేశారు. ఆయన పేరు కూడా నాగేశ్వరరావే. అందులో నాది ద్విపాత్రాభినయం. ఒకటి సాఫ్ట్ పాత్ర, మరొకటి ఆడరౌడీ పాత్ర. ఈ చిత్రంలో రెండు రకాల పాత్రలను అద్భుతంగా నటించడం, సినిమా పెద్ద హిట్ కావడం, నా నటన సూపర్‌గా ఉందని అందరూ మెచ్చుకోవడంతో నాకు ఈ చిత్రం ద్వారా పరిశ్రమలో ఇంకా మంచి పేరు వచ్చింది. ఒకేసారి ఏడెనిమిది చిత్రాలకు ఆఫర్స్ వచ్చాయి.
అక్కినేని గారితో…
అక్కినేని నాగేశ్వరరావుగారితో నా మొదటి సినిమా ‘డాక్టర్ చక్రవర్తి’ నాది అక్కినేని చెల్లెలు పాత్ర. ఆ తర్వాత పద్మనాభంగారి చిత్రం ‘పొట్టి ప్లీడర్’, తిలక్ గారి దర్శకత్వంలో ‘పంతాలు-పట్టింపులు’లో హీరోయిన్‌గా నటించాను. ‘దేవత’ చిత్రంలో రామారావుగారికి చెల్లెలుగా నటించాను. దాంతో పుల్లయ్యగారు ‘మురళీకృష్ణ’ చిత్రంలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో నాది ఓ వెరైటీ పాత్ర. డిప్రెషన్‌లో ఉండే మెంటల్లీ రిటార్టెడ్ పాత్ర. అక్కినేని, జమున గార్ల కాంబినేషన్‌లో నేను కూడా ఎంతో బాగా నటించాను. ఈ చిత్రంలో పాటలన్నీ హిట్. సినిమా సూపర్ హిట్. దాంతో అది నా కెరీర్‌కు ఒక మలుపుగా ఉపయోగపడింది.
గీతాంజలిగా పేరు మార్పు
‘పారస్‌మణి’ అనే హిందీ చిత్రంలో నేను హీరోయిన్‌గా నటించాను. ఈ చిత్రానికి దర్శకులు బాబూభాయ్ మిస్ర్తీ. చిత్రంపేరు పారస్ మణి. అందులో నా పేరు మణి. నా అసలు పేరు కూడా మణి కావడం కూడా వారికి నచ్చలేదో.. ఏమో… నాకు గీతాంజలి అని పేరు పెడితే ఎలా ఉంటుంది? అని ఆయన అడిగారు. ఎందుకో నేను ‘మీ ఇష్టం అండీ’ అనేశాను. అంతే. అప్పుడే అగ్రిమెంట్‌లో గీతాంజలి అని రాశారు. ఇక అప్పటి నుండి నేను చిత్ర పరిశ్రమలో గీతాంజలిగానే చలామణీ అవుతూ వచ్చాను.
అదేవిధంగా చంద్రకాంత్‌భాయ్ దర్శకత్వంలో ‘బలరామకృష్ణ’ అనే హిందీ పౌరాణిక చిత్రంలో రుక్మిణీ పాత్రలో నటించాను. ఇది నా రెండవ హిందీ చిత్రం. ఇందులో ధారాసింగ్ బలరాముడు. సావిత్రి ధారాసింగ్ భార్యగా నటించింది. కృష్ణుడుగా షాహమోడక్ నటించారు. ఇందులో నేను సావిత్రి, అక్కాచెల్లెళ్ళుగా నటించాం. షూటింగ్‌లో మేం ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళం. జైపూర్ తదితర ప్రాంతాలన్నీ తిరిగి చూశాం. ఈ చిత్రం విడుదలయ్యాక బంపర్ కలెక్షన్లు సాధించింది.
హాస్య పాత్రలు
నేను కథానాయికగా రాణిస్తున్న మంచి తరుణంలో ఎన్.టి.రామారావుగారి ‘దేవత’ చిత్రంలో నటించమని అడిగారు. అందులో నాది హాస్య పాత్ర. నేను ఏ పాత్ర అయినా బాగా చేస్తాననే ఉద్దేశంతో వాళ్ళు నన్ను సంప్రదించారు. కానీ అక్కడ మాత్రం నా స్టెప్ కొంచెం రాంగ్‌గానే పడిందని చెప్పాలి. ఆ పాత్ర చేయాలని చాలా రిక్వెస్ట్ చేశారు. ‘ఈ గీతాంజలి వ్యాంప్‌గా చేస్తుంది, హీరోయిన్‌గా చేస్తుంది, ఇక హాస్య పాత్రల్లో కూడా చేయగలదనే విషయాన్ని నిరూపించుకో, అనేది సవాల్‌గా నాకు ఎదురు కావడంతో ఆ పాత్రకు అంగీకరించాను. ఇలా దేవత చిత్రం హిట్ కాగా అందులో నా పాత్ర బంపర్ హిట్ అయింది. ఈ చిత్రం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది.
ఈ చిత్రంలో నేను, పద్మనాభం గారు నటించిన ‘మా ఊరు మదరాసు నా పేరు రాందాసు/మా ఊరు బొంబాయి నా పేరు రాధాబాయి’ అనే పాట ప్రేక్షకుల నాలుకలపై ముద్రపడిపోయింది. ఆ విధంగా హాస్య పాత్రల్లోకి చొరబడ్డాను.
చలంగారి చిత్రం ‘సంబరాల రాంబాబు’లో కూడా హాస్య పాత్ర పోషించాను. ‘పొరుగింటి మీనాక్షమ్మను చూశారా, వాళ్ళ ఆయన చేసే ముద్దూ ముచ్చటా విన్నారా…’’ అనే పాట తెలుగు రాష్ట్రంలో ఎంతో పాపులర్ అయింది. దాంతో నన్ను మంచి హాస్య నటిగా ప్రేక్షకులు గుర్తించారు. ఇలా హాస్య పాత్రల్లో కూడా నేను రాణించడం ప్రారంభించాను. నేను ఎక్కువ పద్మనాభంగారి పక్కనే హాస్య పాత్రల్లో నటించాను. కొన్ని చిత్రాల్లో నగేష్‌తో నటించాను. ఇతర నటులతో నటించలేదు.
హీరోయిన్‌గా..
ఇప్పటివరకు హిందీ, తెలుగు, తమిళ భాషల్లో దాదాపు 300 చిత్రాల పైచిలుకు నటించాను. వీటిల్లో హాస్యం, వ్యాంప్, హీరోయిన్ అన్ని పాత్రలూ ఉన్నాయి. రణభేరి, రాజయోగం, పంతాలు పట్టింపులు, తోటలోపిల్ల కోటలో రాణి, రైతేరాజు, హంతకులొస్తున్నారు జాగ్రత్త’. ప్రస్తుతం విజయచందర్ పక్కన రంగనాథ్‌గారు, నేను, గిరిబాబుగారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేస్తున్నాం.
నాకు నచ్చిన నా చిత్రాలు
నేను నటించిన చిత్రాలు అన్నీ ఆల్మోస్ట్ హిట్ చిత్రాలే. ఇల్లాలు, పంతాలు-పట్టింపులు, అబ్బాయి గారు-అమ్మాయిగారు, మర్యాద రామన్న, అవే కళ్ళు, పొట్టిప్లీడర్, దేవత, సంబరాల రాంబాబు, తోడూనీడా, లోగుట్టు పెరుమాళ్ళకెరుక, హంతకు లొస్తున్నారు జాగ్రత్త, హిందీలో సూపర్‌హిట్ చిత్రం ‘బలరామకృష్ణ’, బాబుభాయ్‌మిస్ర్తీ చిత్రం ‘పారస్‌మణి’. దీనికి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం సమకూర్చారు.
క్యారెక్టర్ నటిగా, సీరియల్స్‌లో
ముఖ్యంగా నేను మా బాబు శ్రీనివాస్ కోసం హైదరాబాద్ వచ్చాను. భూమా, రంగుల కలలు, కోయిల, ఆకాష్ (ఇందులో ముగ్గురు హీరోల్లో మా అబ్బాయి ఒకడు) వాడు హీరోగా నటించిన చిత్రాలు. ఎలాగూ హైదరాబాద్ వచ్చాను కదా అని డైరెక్టర్లు అడగడంతో అటు సినిమాలు, ఇటు సీరియల్స్ కూడా ఒప్పుకున్నాను. కోటగారి కాంబినేషన్‌లో ‘పెళ్ళైన కొత్తలో’, ‘ఆలయం’, ముత్యాల సుబ్బయ్య గారి ‘యకరం యాభై కోట్లు’, ‘నేరము-శిక్ష’ ఈ మధ్యలో వచ్చిన ‘గోపి, గోపికా, గోదావరి, ఢమరుకం, గ్రీకువీరుడు చిత్రాల్లో నటించాను. అదేవిధంగా సీరియల్స్ తీసేవారు కూడా అడగడంతో నటించేందుకు అంగీకరించాను.
నచ్చిన చిత్రం, నచ్చిన హీరో
షావుకారు జానకి గారు బాలచందర్ దర్శకత్వంలో ‘ఎదురు నిశ్చల్’ అనే తమిళ చిత్రం నిర్మించారు. అది తమిళంలో బాగా హిట్ కావడంతో తెలుగులో ‘సంబరాల రాంబాబు’ అనే చిత్రం కూడా నిర్మించారు. ఈ చిత్రంలో చలం గారితో నేను నటించాను. ఇందులో నాదొక బ్రాహ్మణ యువతి పాత్ర. ఈ చిత్రంతో పాటు, ఇందులోని పాటలు కూడా హిట్ కావడంతో ప్రేక్షకులందరి దృష్టిలో ‘గీతాంజలి’ హాస్యనటిగా నిలిచిపోయింది. అందుకే ఈ చిత్రం నాకు బాగా నచ్చింది. కాగా వెండితెరపై కథానాయిక లలో నాకు నచ్చిన నటి శ్రీదేవి.
మరువలేని సంఘటన
నా సినీ జీవితంలో మరువలేని సంఘటన నా పేరు మార్పే. బాబూభాయ్ మిస్ర్తీ గారు గీతాంజలి అని నామకరణం చేసి ఆర్టిస్టుగా నాకు జీవం పోశారు. ఇలా ప్రేక్షకుల హృదయాల్లో గీతాంజలి పేరుతో చిరస్థానం సంపాదించుకోవడం మరువలేనిది. సినీ జీవితంలో ఒడిదుడుకులు సహజం. వాటిని ఎదుర్కొనే నటించాను. ముఖ్యంగా ఈ విషయంలో నా తండ్రిగారు నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. భగవంతుడి ఆశీ స్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు కూడా నాకు ఎంతగానో తోడ్పడ్డాయి.
ఎవరి మైండ్‌సెట్ వారికుండాలి
నా నట జీవితంలో నేను ఎంతో సంతోషంతో, సంతృప్తితో ఉన్నాను. మంచి చిత్రాల్లో, విజయవంతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాను. ఈ తరం నటీమణులు కూడా వారి స్థాయిలో వారు మైండ్ సెట్ నిర్మించుకుని ప్రేక్షకుల అభిమానం సంపాదించి వారి హృదయాల్లో చిరస్థానం పొందేందుకు కృషి చేయాలనేది నా ఆకాంక్ష.
ప్రస్తుత హాస్యం
హాస్యం విషయంలో, ఆనాటి సినిమాల్లో రేలంగి, పద్మనాభం, నగేష్, రాజబాబు వంటి హాస్య నటుల్ని నేను ఎక్కువగా లైక్ చేసేదాన్ని. ఇప్పుడు ముఖ్యంగా హాస్యాన్ని అందించే నటులందరూ హాస్య నటులే. బ్రహ్మానందం, వేణు, అలీ వంటివాళ్ళంతా చక్కటి ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందిస్తున్నారు.
నేటి చిత్రాలు నేచురాలిటీకి భిన్నం
ఆనాటి చిత్రాలకు, ఈనాటి చిత్రాలకు తేడా ఏమిటి అంటే ఏమని చెబుతాం? ఆనాటి గుమ్మడి, ఎస్వీ రంగారావు, రామారావు, నాగేశ్వరరావులు ఈనాడు ఉన్నారా? ఈనాటి చిత్రాలు నేచురాలిటీకి భిన్నంగా ఉంటున్నాయి. ఆనాటి రేలంగి, రమణారెడ్డి, పద్మనాభం, రాజబాబు, నగేష్‌ల హాస్యం చూస్తే ఇప్పటికీ గుర్తుంటుంది. ఈనాటి హాస్యం గురించి ప్రేక్షకులే తీర్పు చెబుతారు. ఏదిఏమైనా ఆనాటి పరిస్థితులను, ఈనాటి పరిస్థితులను కంపేర్ చేయడం మాత్రం కుదరదు. కాల పరిస్థితుల్ని బట్టి మార్పులు వస్తున్నాయి.
కుటుంబం
1974 ఆగస్టు 15వ తేదీన నటుడు రామకృష్ణగారితో నా వివాహం జరిగింది. మా నాన్నగారు రామకృష్ణగారిలోని గుణగణాలన్నింటినీ చూసి ముచ్చటపడి మా ఇద్దరికీ వివాహం చేశారు. అబ్బాయి మంచి అందగాడు, వెరీ డీసెంట్ బిహేవియర్ అని రామకృష్ణగారి గురించి నాన్నగారు నాకు చెప్పి పెళ్ళికి ఒప్పించారు. అయితే ప్రేక్షకులు మాది ప్రేమ వివాహం అనుకున్నారు. కానీ అలాంటిదేం కాదు. మాది ఎరేంజ్‌డ్ మ్యారేజ్. రామకృష్ణగారివన్నీ విజయవంతమైన చిత్రాలే. వాటిల్లో రణభేరి, పూజ, నోము, యశోదకృష్ణ, నా పేరే భగవాన్…ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే, మంచిరోజు, పెళ్ళిరోజు, తోటలోపిల్లా కోటలోరాణి, రాజయోగం, రణభేరి చిత్రాల్లో నేనూ, రామకృష్ణగారు కలిసి నటించాం.
వారు దివంగతులు కావడం నా దురదృష్టం. మా అబ్బాయి పేరు శ్రీనివాస్. నా మనవడి పేరు శాయి సజాయ్, మనవరాలు శయోన్. (మురుగన్ పేరు. అంటే సుబ్రహ్మణ్యస్వామి పేరన్నమాట)