పార్లమెంటరీ రాజకీయాలు వర్దిల్లాలని, పార్లమెంటు నిజాయితీకి, విజ్ఞానానికి, అంకిత భావానికి కేంద్రం కావాలని కోరుకునే వాళ్లందరికి ఇది దుర్వార్త. ప్రముఖ పార్లమెంటేరియన్, సిపిఐ నాయకుడు, మాజీ లోక్ సభ సభ్యుడు గురుదాస్ దాస్ గుప్తా చనిపోయారు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఈ మేరకు ఈదేశం పేదదయింది.
ఆయన గొప్ప ట్రేడ్ యూనియన్ లీడర్. ఎఐటియుసి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పార్లమెంటులో గొప్ప ప్రసంగాలు చేసిన నాయకులలో ఆయన ఒకరు. .పార్టీలేవయినా సరే ఆతరం నుంచి ఒకరొకరే వెళ్లిపోతున్నారు. ఇపుడు గురుదాస్ గుప్తా చనిపోవడం తీరని లోటు.
పార్లమెంటు వార్తలు రాసిన జర్నలిస్టులందరికి గురుదాస్ గుప్తా బాగా తెలిసి ఉంటాడు. ఆయన చాలా సాధారణ జీవితం గడుపే వారు. తెలుగు రాష్ట్రాలలో ఎంపిల లైఫ్ సైల్ చూసిన వాళ్లకు గురుదాస్ దాస్ గుప్తాలాంటి పార్లమెంటులో నిజంగా ఉన్నారా అని నమ్మలేని పరిస్థితి వస్తుంది.
పార్లమెంటులో ఆయన పాల పాకెట్ కొనుక్కుని దానిని చేతిలో పెట్టుకుని తానుండే విపి హౌస్ కు నడచుకుపోయేవాడు. ఒక సారి పార్లమెంటులో ఎంటరయ్యాక ఎంపిలు భూమ్మీ నడవడం మర్చిపోతారు.
రాజీ లేని కమ్యూనిస్టు అయినా చాలా విశాల దృక్పథంతో ఉండేవారు. ఆయనంటే అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయికి కూడా అభిమానం. కమ్యూనిస్టు లక బద్ధ శత్రువయిన మమతా బెనర్జీ కూడా గురుదాస్ దాస్ గుప్పతాకు స్నేహితురాలే.
చాలా సాదా సీదా జీవనం గడిపడానికి ఆయన అలవాటు పడ్డారు. ఎపుడూ ఒకటి రెండు చొక్కాల్లోనే కనిపించే వారు. మొత్తంగా ఆయన మూడు సార్లు రాజ్యసభకు, రెండు సార్లు లోక్ సభకు ఎన్నికయినా, ఆయనలో గర్వం కనిపించదు. అందరితో ఒకలాగే మాట్లాడేవారు.
గురుదాస్ దాస్ గుప్తా చాలా కాలంగా మూత్ర పిండాల, గుండెజబ్బుతో బాధపడ్తు ఉన్నారు.
1985లో రాజ్యసభకు ఎన్నికకావడంతో ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లోకి వచ్చారు. 2001లో ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి గా ఎంపికయ్యారు. పశ్చిమబెంగాల్ లోని పన్ స్కూరా నియోజకవర్గం నుంచి 2004లో లోక్ సభ ఎన్నికయ్యారు. 2009లో కూడా ఘటల్ నియోజకవర్గం నుంచి 15 వ లోక్ సభకు ఎన్నికయ్యారు. 2G స్పెక్ట్రమ్ కుంభకోణం మీద వేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలోఆయన సభ్యుడు.
నిస్సంకోచంగా మాట్లాడుతూ ఈ కుంభకోణం గురించి ప్రధాని మన్మోహన్ సింగ్ కు తెలుసని చెప్పడమేకాదు, దానికి సంబంధించిన క్యాబినెట్ సెక్రెటరీ నోట్ ను కూడా ఆయన వెల్లడించారు. స్పెక్ట్రమ్ ధర పెంచాలని క్యాబినెట్ సెక్రెటరీ ప్రధాని కి లేఖ రాసినపుడు కుంభకోణం గురించి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలియదని బుకాయించడం సరికాదని చెప్పి సంచలనం సృష్టించారు.
1936 నవంబర్ 3న ఇపుడు బంగ్లాదేశ్ లో ఉన్న బరిసాల్ ఆయన జన్మించారు. కలకత్తా యూనివర్శటీలో ఎంకామ్ చదివారు.
లక్ష్మినారాయణ సంతాపం
కామ్రేడ్ గురుదాస్ దాస్ గుప్తాకు జోహార్!
ఉత్తమ పార్లమెంటేరియన్, భారత కమ్యూనిస్టు పార్టీ మరియు ఎఐటియుసి ప్రముఖ నేత కా.గురుదాస్ దాస్ గుప్తా మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని ప్రముఖ సామాజికాంశాల విశ్లేషకుడు టి లక్ష్మినారాయణ అన్నారు.
‘కా.గురుదాస్ దాస్ గుప్తా మరణంతో దేశం ఒక విలక్షణమైన, నిజాయితీ, నిరాడంబరుడైన నేతను కోల్పోయింది. ప్రజల పక్షాన నిర్భీతిగా పార్లమెంటులో దశాబ్ధాల పాటు గళమెత్తిన కంచు కంఠం శాశ్వతంగా మూగబోయింది.
కా.గురుదాస్ దాస్ గుప్తా మరణం ప్రగతిశీల, లౌకిక, ప్రజాస్వామ్య ఉద్యమాలకు, శ్రామికోద్యమాలకు తీరని లోటు,’ అని లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.