ముఖ్యమంత్రి , ప్రతిపక్షనేత ఇద్దరూ రాయలసీమ వారే. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ ప్రాంత నీటి సమస్యను పరిస్కరించాలని ప్రయత్నం చేస్తున్నారు. సానుకూల పరిస్థితులు ఉన్నా చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు , రాజకీయ పార్టీల నేతలు నీటి సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉండటం వల్ల వరదల సమయంలో కూడా జిల్లాకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపద్యంలో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆరాటపడుతున్న సమీప నెల్లూరు జిల్లా మంత్రుల ప్రయత్నాలు చూసి చిత్తూరు జిల్లా నాయకులు మేల్కోవాలి.
ఆగస్టులో ప్రారంభమైన వరద 90 రోజులగా కొనసాగుతున్నది. శ్రీశైలం నుంచి 1200 టీఎంసీల నీరు క్రిందకు విడుదల చేసారు. 90 రోజులుగా శ్రీశైలం నిండుగా ఉన్నది. కానీ 115 టీఎంసీల నీటి నిల్వ ప్రాజెక్టులు ఉన్న రాయలసీమలో నింపింది కేవలం 50 టీఎంసీలు మాత్రమే.
చిత్తూరు జిల్లా పరిస్థితి మరీ దారుణం. చిత్తూరు జిల్లాకు నీరు విడుదల చేసే ప్రాజెక్టులలో గాలేరు నగరి ఒకటి. దీని పరిధిలో తిరుపతి , నగరి , శ్రీకాళహస్తి , సత్యవేడు నియోజకవర్గలు ముఖ్యంగా తిరుమల పుణ్యక్షేత్రం కూడా ఉన్నది.
గాలేరు నగరి ఆలస్యం కావడంతో అందుకు ప్రత్యామ్నాయముగా సోమశిల నుంచి కండలేరు ద్వారా త్రాగునీరు అందించే ఆలోచన గత ప్రభుత్వం చేసింది. కండలేరు నుంచి చెన్నై నగరానికి త్రాగునీరు సరఫరా చేస్తున్నారు.
రాయలసీమలో వరదలు వచ్చిన సమయంలో కుందు , చెయ్యేరు ఉపనదులు భారీగా నీటిని తీసుకువస్థాయి ఈ మధ్య నెల్లూరు జిల్లాలో వర్షాలు లేకపోయినా కడప , కర్నూలు జిల్లాలలో కురిసిన వర్షాలకు కుందుకు భారీ వరద వచ్చింది. రోజుకు 60 వేల క్కుసెక్వ్యూల ప్రవాహం సోమశిలకు చేరింది. నేడు కూడా పరిమిత స్థాయిలో ప్రవాహం ఉంది. పలితం 78 టీఎంసీల నీరు సోమశిలకు చేరింది. సోమశిల నిండిన తర్వాత సముద్రంలోకి నీరు విడుదల చేయాల్సిన పరిస్థితి.
చిత్తూరు జిల్లా అవసరాల కోసం ఉపయోగించే కండలేరుకు నీరు సోమశిల నుంచి విడుదల చేయాలి. అందుకు ఉన్న కాల్వ సామర్థ్యం రోజుకు 10 వేల క్కుసెక్వ్యూలు మాత్రమే.
కుందు నదికి వరదలు వచ్చిన సమయంలో కూడా సోమశిల నుంచి కండలేరుకు నీరు విడుదల పూర్తి స్థాయిలో జరగలేదు. పలితం నేడు కండలేరులో ఉన్న నీరు కేవలం 30 టీఎంసీలు. అందులో 15 టీఎంసీలు చెన్నై నగరానికి , 4.5 టీఎంసీలు డెడ్ స్టోరేజ్. మిగిలిన నీరు నెల్లూరు జిల్లాలోని మిగిలిన ప్రాంతాలకు పోను చిత్తూరు జిల్లాకు వచ్చేది ఎంత.
నెల్లూరు జిల్లా నేతల ముందుచూపు – చలనం లేని చిత్తూరు జిల్లా నేతలు.
సోమశిల ఉన్నది నెల్లూరు జిల్లాలో అయినా దాని క్యాచ్ మెంట్ ఏరియా ( నీరు లభించే ప్రాంతం) మాత్రం రాయలసీమ. కుందు , చెయ్యేరు , తలకొన , కొన్ని సమయాల్లో పోతిరెడ్డిపాడు నుంచి కూడా. సోమశిల నుంచి నెల్లూరు డెల్టా అవసరాలకు ఒక కెనాల్ ఉంటే కండలేరుకు వరద కాల్వ ఉన్నది. వరదలు కొన్నిరోజులు మాత్రమే ఉంటుంది. తక్కువ సమయంలో ఎక్కువ నీటిని సరఫరా చేసేందుకు వీలుగా కండలేరు కాల్వ సామర్ధ్యాన్ని 10 వేల క్కుసెక్వ్యూల నుంచి 44 వేల క్కుసెక్వ్యూలకు పెంచడం అవసరం. ఎప్పటినుంచో ఈ సమస్య ఉన్నా అడుగు ముందుకు పడటం లేదు.
అనేక సందర్భాలలో కుందు నీరు వస్తుండటంతో నెల్లూరు జిల్లా నేతలు మరింత నీటిని ఆత్మకూరు , ఉదయగిరి ప్రాంతాలకు తీసుకుని వెళ్ళడానికి అనుగుణంగా సోమశిల హైలెవల్ కెనాల్ పేజ్ 1 , 2 పనులను ముమ్మరం చేయడంతోబాటు కాల్వ సామర్ధ్యాన్ని కూడా పెంచి వరదల సమయంలో త్వరితగతిన నిటిని డ్రా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 78 టీఎంసీలను సోమశిలలో నింపుకుని హైలెవల్ కెనాల్ ద్వారా నీటిని అదనంగా సరఫరా చేసుకుంటే కండలేరుకు నీరు అందడం అనుమానమే. నేడు పెద్ద స్థాయిలో వరద వచ్చింది.
ఇపుడే ఇలా ఉంటే పరిమిత స్థాయిలో వరద ఉంటే కండలేరుకు నీరు పరిమిత స్థాయిలోనే వస్తుంది. ఆ నీటిని చెన్నై నగరానికి విడుదల చేస్తే చిత్తూరు జిల్లాకు నిరు అందని ద్రాక్షగా మిగులుతుంది.
నెల్లూరు జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్ , గౌతమ్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు వారి జిల్లా కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కాని చిత్తూరు జిల్లాలోని తిరుపతి , నగరి , శ్రీకాళహస్తి , సత్యవేడు ప్రాంత ప్రయోజనాలతో ముడిపడిన కండలేరు నీటి సరఫరా గురించి అధికార , ప్రతిపక్ష పార్టీలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదనపు నీటిని సరఫరా చేసేందుకు సన్నాహాలు చేస్తున్న నెల్లూరు నేతలను చూచి అయినా చిత్తూరు జిల్లా నేతలు మేల్కోవాలి.
వరద నీటిని త్వరితగతిన రాయలసీమ ప్రాజెక్టులకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆలోచిస్తున్న సానుకూల పరిస్థితిని ఆసరాగా చేసుకుని సోమశిల – కండలేరు వరదకాల్వ సామర్థ్యం 10 వేల క్కుసెక్వ్యూల నుంచి 44 వేల క్కుసెక్వ్యూలకు పెంచడం , రాయలసీమలోని కుందు నీరు సోమశిలకు ప్రధాన క్యాచ్ మెంట్ ఏరియా కనుక సీమలో అంతర్భాగం అయిన చిత్తూరు జిల్లాకు 10 టీఎంసీల నీటిని కేటాయించాలి. అలాంటి ప్రతిపాదనలతో చిత్తూరు జిల్లా నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తీసుకుపోవాలి. అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు వత్తిడి తేవాలి.