రాహుల్ చౌరే బ్రిలియంట్ స్టూడెంట్. చదువుకునే ఆర్థిక స్తోమత్తు లేదు.
అందుకే రెగ్యులర్ కాలేజీకి వెళ్లేలేదు. ప్రయివేటుగా చదువుకున్నాడు. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ గ్రాజుయేషన్ పూర్తి చేశాడు.
మాస్టర్స్ కోసం విదేశాలకు వెళ్లాలనుకున్నాడు. ఆయన ఆకెడమిక్ రికార్డు చూసి స్కాంట్లండ్ లోని ఎబర్డీన్ విశ్వవిద్యాలయం వాళ్లు ఆయనకు క్లినికల్ సైకాలజీలో అడ్మిషన్ ఇచ్చారు.
ఫెలోషిప్ కూడా ఇచ్చారు.
అయన ఇపుడు స్కాట్లండ్ వెళ్లాలి. చేతిలో చిల్లి గవ్వలేదు. ఆయన తండ్రి బీర్ షాపులో గుమాస్తా. తల్లిలేదు. స్టాట్లండ్ వెళ్లేందుకు విమానం టికెట్లకే కాదు, వీసా ఫీజుకు డబ్బుల్లేవు.
అంతేకాదు, ఆయన స్కాలర్ షిప్ మంజూరయ్యేంతవరకు అక్కడ ఖర్చులకు డబ్బు కావాలి. ఇదీ ఆయనకు ఎదురయిన సమస్య.
ఈ సమస్య మెల్లిగా ఆ నోటా ఈ నోటా పడి నాగపూర్ పట్టణంలోని బేసా ఏరియాలో కొంతమంది సహృదయులకు చెవిన పడింది.
ఏమయినా సరే రాహుల్ ను విదేశాలకుపంపాలనుకున్నారు. ఇంతదాకా వచ్చిన కుర్రవాడి చదువు ఆగేందుకు వీల్లేదని అనుకున్నారు.
వెంటనే అంతా సమావేశమయి, వాళ్లకు తెలిసినవాళ్లందరినుంచి చిన్నచిన్న మొత్తాలు పోగేయాలనుకున్నారు.
టైమ్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం ఒక ప్రయివేటు కంపెనీలో పని చేసే ఉమాకాంత్ కాంబ్లే అనే వ్యక్తి రాహుల్ కు కావలసిన డబ్బును పొగు చేసే బాధ్యత భుజానేసుకున్నాడు. తెలిసిన వాళ్లందరికి సమాచారం అందించారు.
అంతే డబ్బులు రావడం మొదలయింది. కిశోర్ మంకర్ అనే ఫారెస్టు ఆఫీసర్ కూడా ముందుకొచ్చాడు.
అదే విధంగా ఒక స్వయం సహాయక బృందం మహిళలు కూడా ముందుకు వచ్చారు.
చంద్రాపూర్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ కూడా ఒక చెయ్యేశారు.
వెయ్యి నుంచి రు, 25,000 దాకా డబ్బు అందించిన వాళ్లున్నారు.
అయినాసరే, ఇదిచాలదు.
కోర్సెస్, కౌన్సెలర్స్ అండ్ కెరీర్స్ అనే సంస్థ నడిపే హేమంత్ సూటే ముందుకు వచ్చి మొత్తం వీసా ఖర్చు భరిస్తానని హామీ ఇచ్చాడు.
విజయ్ గవాండే అనే రిటైర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాహుల్ తరఫున తాను రు 76 వేలు లోన్ తీసుకుంటానని చెప్పాడు.
స్టేట్ గవర్నమెంట్ నుంచి రాహుల్ ఎస్ సి, ఎస్టి స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేశాడు. ఈ డబ్బు మంజూరుకాగానే విరాళమిచ్చిన వారందరికి డబ్బు వావసు ఇస్తామని ఈ డబ్బు సేకరణలో కీలకపాత్ర వహిస్తున్న కాంబ్లే చెప్పాడు. ఇదొక కొత్త ప్రయోగం.
దీని వల్ల సమాజ రుణం తీర్చుకునే కల్చర్ మొదలవుతుందని ఆయన చెప్పారు.
ఇలా ఈ రుణం తీర్చడం వల్ల ఒకకొత్త పద్దతి మొదలువుతందని, అపుడు ఇలాంటి విద్యార్థులకు సాయం చేసేందుకు చాలా మంది ముందుకు వస్తారని కాంబ్లే ఆశిస్తున్నాడు.
కాంబ్లేకి రాహుల్ గురించి ఒక స్నేహితుడి కూతురి ద్వారా తెలిసింది. ఆమె ద్వారానే రాహుల్ కాంబ్లేని కలిసి మొత్తం పరిస్థితి గమనించాడు.
రాహుల్ అకెడిమిక్ రికార్డు , స్కాంట్లండ్ యూనివర్శిటీ లెటర్ చూశాక వెంటనే రంగంలోకి దిగాల్సివచ్చింది.
అప్పటికి రాహుల్ వెళ్లేందుకు తగినంత టైం కూడా లేదు.ఏది ఏమయినా రాహుల్ ఫ్లైట్ మిస్ కాకుండా చూడాలనుకున్నానని, అయితే ప్రజల నుంచి మంచిస్పందన రావడంతో తన పనిసులువయిందని కాంబ్లే చెప్పాడు.