గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జిహెచ్ ఎంసి ) వాళ్లు నగరం నుంచి పావురాలను తరిమేసే పని చేపడుతున్నారు. ప్రపంచమంతా చాలా నగరాలలో ఈ పని మొదలయింది. అయితే, ఇదంతసులభం కాదు. దీనికి ముందు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్. పావురాలు జనావాసాలలో తిష్టవేసేందుకు చాలా కారణాలున్నాయి. వాటిని పరిష్కరించినపుడే పావురాలు మరోదారి చూసుకుంటాయి.
ఇపుడు, 21వ శతాబ్దంలో, పావురాల వల్ల జబ్బులొస్తాయని,పావురాల వల్ల హానిజరుగుతుందని తెలిసి,వాటిని నగరాలనుంచి తరిమేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నా పూర్వం మనిషి-పావురం చాలా అన్యోన్యంగా కలసి జీవించాయి.నాగరికతలో ఈ దశ ముగిసినట్లనిపిస్తూ ఉంది.
జిహెచ్ఎం సి అధికారులు తొలి విడత 500 పావురాలను పట్టుకుని శ్రీశైలం అడవుల్లో వదిలేశారు. ఇక ముందేమవుతుందో తెలుసుకునే లోపు పావురాల గురించిన కొన్ని ఆసక్తి కరమయిన విషయాలను తెలుసుకుందాం.
1. పావురాలు మనిషిని ఒక నేస్తంగా నమ్మి 5,000 సంవత్సరాలయింది. మనిషి- పావురం చరిత్ర చాలా సుదీర్ఘమయింది. నాగరికతలో భాగమయింది. పావురం మనిషికి చేసిన సేవ అంత ఇంతాకాదు.ఇంత సుదీర్ఘ కాలంలో వీరిద్దరి అనుబంధం మత ప్రాముఖ్యం కూడా తీసుకుంది.
తెల్లటి పావురాన్ని శాంతికపోతం అని పిల్చుకున్నాం. నెహ్రూభుజం మీద శాంతి కపోతం ఉంటుంది. హిందువులు,ముస్లింలు, శిక్కులు పావురానికి చాలా ప్రాముఖ్యం ఇస్తారు.అందుకే పావురాల గుంపులకు ప్రత్యేకంగా బస్తాల బస్తాల గింజలేస్తారు. ఇది హైదరాబాద్ లో సర్వత్రా కనబడుతుంది.
బైబిల్ లో ప్రకారం క్రీస్తు బాప్తిస్మం పొందిన ప్రదేశంలో పావురం దైవ శక్తి రూపంలో వచ్చి వాలిందని చెబుతారు. అందుకే క్రిష్టియన్ అర్ట్ లో పావురం కనిపిస్తుంది.
గురు గోవింద్ సింగ్ పావురాల మిత్రుడని శిక్కులకు పావురాలకు ఆహారం వేస్తారు. పావురాలకు ఆహారం వేస్తే తదుపరి జన్మలో ఆకలి సమస్య ఉండదని శిక్కుల విశ్వాసం.
మనిషి చనిపోయాక ఆత్మ పావురమై ఎగిరిపోతుందని కొన్ని మతాల విశ్వాసం.
శివుడు పార్వతి, కపోతేశ్వరుడు,కపోతేశ్వరి రూపంలో అమర్ నాథ్ గుడి లో నివసించారని హిందువుల విశ్వాసం.
ప్రవక్త మహమ్మద్ తో సమానంగా ఇస్లామ్ పావురాన్ని చూస్తుంది. పావురాలను బెదిరించి తరిమేయాల్సిందే కాని,చంపడాన్ని ఇస్లాం నిషేధించింది.
ఈ మత విశ్వాసాల ప్రకారం హైదరాబాద్ లో పావురాలకు సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది. ఒకపుడు ఒక దైవశక్తిగా ఉన్నపావురం ఇపుడు కాలాన్ని బట్టి అవసరాలను బట్టి జీవన శైలిని బట్టి విలనైపోతున్నది. తరిమేయాల్సి వస్తున్నది.
Like this story? Share it with a friend!
2. ప్రపంచయుద్ధాలలో పావురాలు కొన్ని వేల మంది సైనికులను కాపాడాయి. షెర్ అమి (Cher Ami) అనే మాటకి ఫ్రెంచ్ లో డియర్ ఫ్రెండ్ అని అర్థం. ఇది మొదటి ప్రపంచంలో యుద్ధంలో వందల మంది ఫ్రెంచ్ సైనికులను కాపాడిన పావురం పేరు. ఆ రోజులలో సైనికులు తమ వెంట పావురాలను తీసుకెళ్లేవారు.యుద్ద సమాచారన్ని సమీపంలోని కేంద్రాలకు పంపేందుకు అందుబాటులో ఉండే సాధనం పావురం మాత్రమే. ఈ పావురాన్ని శత్రువులు కాల్చి గాయపర్చినా ఇది సమాచారాన్ని మోసుకెళ్లింది. దీనికి Croix de Guerre అవార్డు కూడా వచ్చింది.
3. ఇలాడే రెండో ప్రపంచ యుద్ధంలో జి.ఐ జో (G.I Joe) అనే పావురం వందల మంది బ్రిటిష్ సైనికులను కాపాడింది. అలైడ్ సైనలు దాడిచేయాలనుకుంటున్న ఒక ఇటలీ పట్టణంలోకి ఎలైడ్ సేనలకు నాయకత్వం వహిస్తున్న బ్రిటిష్ సేనలు ప్రవేశించి తిష్టవేశాయి. దీని మీద వైమానిక దాడులు జరపాలనే పథకం ఉండింది. ఫలానా టైం లోపు స్వాదీనం కాకపోతే బాంబులు పడతాయి. అయితే ఈ పట్టణంలోకి తమ సేనలు వచ్చాయి, దాడి ఆపండి అనే సమాచారం పంపించాలి. ఎలా? ఎలెక్ట్రిక్ సమాచార వ్యవస్థ పనిచేయడం లేదు . అపుడు జో కాలికి ఒక లెటర్ పెట్టి వదిలారు. జో 20 మైళ్ల దూరాన్ని 20నిమిషాల్లో చేరుకుని అలైడ్ హెడ్ క్వార్టర్స్ కు చేరి సమాచారం అందించింది. మరొక అయిదు నిమిషాలు ఆలస్యమయి ఉంటే ఈ వూరి మీద బ్రిటిష్ సేనలే బాంబులు వేసి తమ వాళ్లనే చంపి వుండేవి. ఎందుకంటే జో చేరే సరికి విమానాలు ఎగరడానికి సిద్ధంగా ఉన్నాయి. జో ధైర్యసాహసాలకు ‘డికిన్’ మెడల్ ఇచ్చారు.
4. పావురం పెంట ఎరువా? ప్రమాదమా? ఇపుడయితే పావురాల పెంటనుంచి రోగాలొస్తున్నాయనిచెబుతున్నారు. రకరకాల బాక్టీరియా, వైరస్ లు ఈ పెంట నుంచి వ్యాపిస్తాయని భయపెడుతున్నారు. ఒకపుడు ఇదిప్రపంచంలోనే ఖరీదైన ఎరువు.16,17,18శతాబ్దాలలో పావురాల పెంట ఎరువు దిబ్బలను కాపాడుకునేందుకు యూరోప్ లో సాయుధ దళాల కాపలా పెట్టేవారు. పంటలకు అవసరమయిన పొటాష్ (సాల్ట్ పీటర్ ) ఈ ఎరువు నుంచి వచ్చేది. అంతేకాదు, గన్ పౌడర్ తయారీలో కూడా దీనినే వాడేవారు. దీనితో అదిచాలా ప్రాముఖ్యమున్న ఖరీదైన వ్యాపార సరుకయింది. అందుకే ఆరోజులో పావురాల పెంట వ్యాపారం చాలా ఖరీదైన వ్యాపారం.
5. పావురాలు ఎకపత్నీ వ్రతం పాటిస్తాయి (monogamous). ఒకపావురం అదే ఆడపావురంతో సంతానోత్పత్తి జరుపుతుంది. పావురాలు రెండోభార్యను వెదుక్కోవడం చాలా అరుదు.
6. ఇపుడు మనం చూస్తున్న పావురాలన్నీ ఒకపుడు కొండ గుట్టల్లో తిరిగిన పావురం (Columba Livia) నుంచే వచ్చాయి. ఇంగ్లీష్ పీజియన్ (Pigeon) అనే మాట pipio (young bird, పిట్ట పిల్ల) అనే లాటిన్ మాట నుంచి వచ్చింది. ఇది ఫ్రెంచ్ భాషలోకి వచ్చి Pijon గామారింది. ఇదే ఇంగ్లీష్ pigeon అయింది. ఇతర పేర్లు domestic pigeon, feral pigeon. 2004లొ బ్రిటిష్ పక్షి శాస్త్ర నిపుణులు అన్నింటికి కలిపి rock pigeon అని పేరు పెట్టారు.
7. పీజియన్ గ్రామ్, పీజియన్ ఎయిర్ మెయిల్ సర్వీస్ గురించి తెలుసుగా. న్యూజిలాండ్ ,గ్రేట్ బ్యారియర్ మధ్య 1896లో పావురాలు ఉత్తరాలందించే సర్వీస్ మొదలయింది. అపుడు SS Wairarapa అనే నౌక గ్రేట్ బ్యారియర్ సమీపంలో సముద్రంలో మునిగిపోయి 134 మంది చనిపోయారు. ఈ వార్త న్యూజిల్యాండ్ కు మూడు రోజుల దాకా చేరనేలేదు. అపుడు పీజియన్ గ్రామ్ సర్వీస్ ప్రారంభించారు. గ్రేట్ బ్యారియర్ నుంచి ఒక్కొక్క పావురం అయిదు లేఖలను తీసుకుని 125 కిమీ వేగంతో ప్రయాణించి ఆక్ లాండ్ ను 95 నిమిషాల్లో చేరుకునేది. ఆపుడు మొదట ఈ సేవలందించిన పావురం పేరు వెలాసిటి. ఈ సర్వీస్ కు ప్రత్యేక పోస్టల్ స్టాంప్ వుండేది.
8. పావురాల వ్యాపారం. రేసు గుర్రాల్లాగ రేసు పావురాలున్నాయి. వీటి విలువ లక్షల డాలర్లుంటుంది. ఆ మధ్య ఒక రేసింగ్ పావురం ధర 132,517 అమెరికన్ డాలర్లు పలికింది. మూడేళ్ల వయసున్న ఈ పావురం లాంగ్ డిస్టెన్స్ రేసుల్లో 21వేల పావురాలను ఓడించింది.
9 వార్తలు పంపడంలో కూడా పావురాలు పనిచేశాయి. రాయిటర్స్ వార్తా సంస్థ తొలినాళ్లలో వార్తలు పంపేందుకు పావురాలను వినియోగించింది. ఇది 1845 లో జర్మనీలో జరిగింది. తాజా వార్తలను, స్టాక్ ధరలను సాధ్యమయినంత తొందరగా జర్మనీలోని ఆషెన్ నగరం నుంచి బెల్జియం లోని బ్రెస్సెల్స్ కు పంపేందుకు రాయిటర్ పావురాలను వాడింది. ఈ రెండు నగరాల మధ్య టెలిగ్రాఫ్ సర్వీస్ ఉన్నా అది సరిగ్గా పనిచేసే గ్యారంటీ లేకపోవడంతో రాయిటర్స్ పావురాలను నమ్ముకుంది.
10. పావురాలను హైదరాబాద్ నుంచి తొలగించడం అంత సులభం కాదు.కారణం, హైదరాబాద్ బాగా చెత్త నగరం. మిగిలిపోయిన ఆహారాన్ని హైదరాబాద్ వాళ్లు రోడ్ల మీద చెత్త కుప్పల్లో పడేస్తారు. ఇలాంటి ఆహారం అందుబాటులో ఉన్నంత వరకు పావురాల సంఖ్యపెరిగి పోతూనే ఉంటుంది. ప్రతిపావురానికి సంవత్సరంలో రెండు సంతానం కారులుటాయి.
కొన్ని పావురాలను తొలగించినపుడు మిగతా వాటికి ఆహారం ఎక్కు వై సంతానోత్పత్తి పెరిగుతుంది. అపుడు చాలా తొందరగా వాటి సంఖ్య పెరుగుతుంది. పావురాలను నగరం నుంచి తరిమేయాంటే ముందు నగరాన్ని శుభ్రంగా ఉంచాలి.వాటికి మతవిశ్వాసాలపరంగా కూడా ఆహారం అందకుండా చూడాలి. అదిసాధ్యమా? ఇదొక దీర్ఘకాలిక క్యాంపెయిన్ గా మాత్రమే సాధ్యం.