( విచిత్రమే అయినా తెలంగాణలో ఒక గొప్ప సంప్రదాయం ఉంది. కోపమొచ్చినా, అలిగినా, సంతోషమయినా,విషాదమయినా పాటలతో, పద్యాలతో స్పందిస్తారు. పేరు మోసిన కవులే కాదు, వూరు పేరు లేేని వాళ్లుకూడా పాట కట్టి పాడతారు. ఆడతారు. చదువొచ్చినోళ్ల లాగనే అక్షరమ్ముక్క తేెలియని వాళ్లు పాట కడతారు. తెలంగాణ ఉద్యమాలు తెచ్చినంత సాహిత్యం భారతదేశంలో ఏ ఉద్యమమూ తీసుకువచ్చి ఉండదేమో అనిపిస్తుంది. ఇపుడు నిన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ఆర్టీసి వాళ్ల మీద చేసిన వ్యాఖ్యలకు ఒక ప్రజా కవి ఇలాస్పందించాడు.)
చిల్లర సంఘాలు…కాదు దొరా..!!
పక్కటెముకలు విరిగేలా పని చేసినా
పట్టెడన్నం దొరకదేమని అడిగింది సంఘం.
మట్టిని మింగుతున్న భూస్వాముల
ముట్టెలను పగలగొట్టింది సంఘం.
యంత్రమై యంత్రాలను నడిపినా
బతుకంతా అతుకులెందుకని అడిగింది సంఘం.
సంపద కట్టిన పెట్టుబడుల
కొంపల్లో భూకంపమైయింది సంఘం.
దినమంతా ఒళ్లు మరిచి పని చేసినప్పుడు
ఎనిమిది గంటల గంటను మోగించమంది సంఘం.
మీసం మెలి తిప్పి బుసలు కొట్టే
యజమానుల కోరలు పీకింది సంఘం.
మట్టి చేతులు దొర కోసం వెట్టి చేసినప్పుడు
తట్టి లేపి తల పైకెత్తమంది సంఘం.
తనువంతా పొగరెక్కిని
గడీల రెక్కలు విరిచింది సంఘం.
కొల్లగొట్టిన సంపద గళ్లబట్టి
లెక్కల సంగతి తేల్చింది సంఘం.
తెగ బలిసిన కొడుకుల గుంజి కొట్టి
మేసిన బొక్కలను కక్కించింది సంఘం.
వేళ్ల మధ్య బలపమయింది
సంఘం….పెదవుల వెంట పదమయింది.
చేతిలోన ఆయుధమయింది
సంఘం…..మెదడులోన చైతనమయింది!
చిల్లర సంఘం…..కాదు దొరా!!
చెమట చుక్కల సత్యం సంఘం
శ్రమజీవుల హక్కుల పత్రం సంఘం
వసంతాన్ని ఆహ్వానించే సమరం సంఘం
వెలుతుర్ని మోసుకొచ్చే శిఖరం సంఘం !!
( చిల్లర కార్మిక సంఘాలు అంటూ……. ముఖ్యమంత్రి కెసీఆర్ చేసిన వ్యాఖ్యలపై)
-ఓ ప్రజాకవి
(సోర్స్: సోషల్ మీడియా)