తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొట్టమొదటి రాష్ట్ర వ్యాపిత బంద్ విజయవంతమయింది. బంద్ లో అన్ని వర్గాలపాల్గొనడం తెలంగాణ ఉద్యమంనాటి రోజులను గుర్తుచేశాయని చాలా మంది వ్యాఖ్యానించారు.
నగరంలోని ఉస్మానియా యూనివర్శిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఓయూ విద్యార్థులు చేపట్టిన నిరసన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. రోడ్లపై టైర్లు కాల్చి ఆందోళన చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి స్టూడెంట్స్ ను చెదరగొట్టారు. ఇలాంటి ఉద్యమ కాలంలో దాదాపు జరిగేది.
సిటిలోని అబిడ్స్ దగ్గర జరిగిన ఆందోళనల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్సీ రాంచందర్ రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి, మోహన్ రెడ్డి తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నా సీఎం కేసీఆర్ లో చలనం లేదని వారు విమర్శించారు. కార్మికుల సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని లక్ష్మణ్అ న్నారు. బీజేపీ ర్యాలీని అఢ్డుకుని పోలీసులు నేతలను అరెస్ట్ చేశారు.
ఇక, జేబీఎస్ దగ్గర బాాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్మికులకు మద్దతుగా వచ్చిన తెలంగాణ జనసమితి నాయకుడు కోదండరాం, టిడిపి నేతులు ఎల్.రమణ, రావుల, బిజెపి నేత మోత్కుపల్లిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
రాష్ట్ర బంద్ పిలుపు ఇవ్వడంతో హైదరాబాద్ లోని రోడ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లు కూడా ధైర్యంచేసి విధులకు రాలేదు.
దీంతో పాటు ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు, ఆటోలు ఆర్టీసి కార్మికులకు మద్దతుగా బంద్ లో పాల్గొన్నారు. దీనితో రోడ్లపై ఎక్కడా ట్రాఫిక్ కనిపించ లేదు. క్యాబ్ డ్రైవర్ల బంద్ తో ఎయిర్ పోర్టు నుంచి రాకపోకలు నిలిచిపోయాయి.
బంద్ ప్రభావం హైదరాబాద్ లో బాాగాకనిపించింది. రోడ్లు దాదాపు ఖాళీగా కనిపిస్తున్నాయి.
బంద్ సంపూర్ణం:అశ్వత్థామ రెడ్డి
బంద్ సంపూర్ణంగా జరిగిందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి ప్రకటించారు. బంద్ కు మద్దతిచ్చిన అన్ని వర్గాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాస్వామ్యయుతంగా ఆందోళనలు చేస్తున్న వారిని అక్రమంగా అరెస్ట్ చేయటాన్ని ఆయన ఖండించారు.
అరెస్ట్ చేసే క్రమంలో భౌతిక దాడులకు పాల్పడటం సరికాదని , అరెస్ట్ చేసిన వారందరినీ భేషరతుగా విడుదల చేయాలని అయన డిమాండ్ చేశారు.
సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు.