ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్ వర్కర్ల జీతాలను 100శాతం పెంచాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు.
దీనికి సంబంధించి వెంటనే జీవో జారీ చేయాలని ఆదేశించారు.
పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న పనిని ఎవరు చేయగలరు, వారి వేతనాల విషయంలో ఉదారంగా ఉండాలని అధికారులకు సూచించారు.
ఏలూరు పర్యటనలో శానిటేషన్ వర్కర్స్ తనతో సమస్యలు చెప్పుకున్నారని…. కత్తిరింపులు తర్వాత రూ.6500 మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని సీఎం అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
అన్ని జాతీయ రహదారులకు ఆనుకుని ఉన్న మద్యం దుకాణాలను తొలగించే విషయం, రాష్ట్రంలో రోడ్డు ప్రమాద తీవ్రతపై సమీక్షా సమావేశంలో చర్చకు వచ్చింది.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డవారికి సత్వర వైద్యసేవల అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు అంబులెన్స్‌ల వ్యవస్థ సన్నద్ధంగా ఉండాలని, తగిన చికిత్స అందించేలా దాన్ని తీర్చిదిద్దాలని ఆదేశించారు.
మద్యం కూడా ప్రమాదాలకు కారణం అవుతోందని కొందరు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. జాతీయ రహదారుల వెంబడి ఉన్న మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని సీఎం అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చారు .మద్యం దుకాణాల కోసం గత ప్రభుత్వం కొన్ని జాతీయ రహదారులను ఢీ నోటిఫై చేసిన విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొచ్చినప్పుడు, వాటిని తిరిగి జాతీయ రహదారుల జాబితాలో చేర్చాలని సీఎం స్పష్టం చేశారు. 2018లో 29,012 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 8,321 మంది మృతి చెందారని సీఎంకు అధికారులు నివేదించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వారు ఆస్పత్రికి వస్తే… డబ్బుల్లేక వైద్యాన్ని నిరాకరించే పరిస్ధితి ఉండకూడదని, సీఎం స్పష్టంచేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వమే కొంత మొత్తాన్ని వైద్యం కోసం ఇచ్చేలా ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమానికి విధి, విధానాలు ఖరారు చేయాలన్నారు.
మాతా శిశు సంరణక్షపై సుదీర్ఘ చర్చ… మాతా, శిశు మరణాల నివారణకోసం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. దీనికోసం తయారుచేసిన సమగ్ర ప్రణాళికను అధికారులు వివరించారు. 100 ప్రసూతి కేంద్రాలను అధికారులు ప్రతిపాదించగా, నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 నియోజకవర్గాల్లో ప్రసూతి కేంద్రాలను అభివృద్దిచేయాలని, గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం అన్నారు. ఈమేరకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. సమావేశంలో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఇతర అధికారులు హాజరయ్యారు.