తెలంగాణ , ఆంధ్రరాష్ట్ర కలయకకు చిహ్నమైన నవంబరు 1 ని విభజన తర్వాత కూడా జరుపుకోవడంలో అర్థం లేదు.
నవంబరు 1 న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సామాజికమాధ్యమాలలో ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనందున ఒక నిర్ణయానికి రాలేకపోయినా వస్తున్న వార్తలకు ప్రాధాన్యత లేకపోలేదు. కారణం అక్టోబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరపకపోవడం వల్ల నవంబరు 1 న జరిపే అవకాశం ఉంది అన్న వార్తలకు సహజంగానే ప్రాధాన్యత సంతరించుకుంది.
చరిత్రలో ఏమి జరిగింది…
1953 కి పూర్వం తెలంగాణ ఒక రాష్ట్రంగా ప్రస్తుతం ఉన్న ఆంద్రప్రదేశ్ తమిళనాడులో కలిసి ఉన్నది. కోస్తా , రాయలసీమ పెద్దల అంగీకారంతో శ్రీభాగ్ ఒప్పందం షరతుతో తమిళనాడు నుంచి తెలుగురాష్ట్రంగా విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్న సమయంలో పొట్టిశ్రీరాములు ఆత్మార్పణతో 1953 అక్టోబరు 1న తొలి భాషప్రయోక్త రాష్ట్రంగా ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రూపంలో నాడు ఆంధ్రరాష్ట్రం అవతరించింది. అటుపిమ్మట ఆంధ్రరాష్ట్రం , తెలంగాణ కలిపి పెద్దమనుషుల అవగాహన మేరకు విశాలాంధ్రగా 1956 నవంబరు 1 ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు జరిగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో నవంబరు 1 కి ప్రాధాన్యత లేదు
2014 న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. సహాజంగానే తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2 ను తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. విభజనను వ్యతిరేకించిన ప్రాంతం , చారిత్రకంగా 1953 రాష్ట్ర ఏర్పాటు జరిగిన ప్రాంత కావడం వల్ల జూన్ 2 ని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోలేము. అదే సమయంలో తెలంగాణ , ఆంధ్రరాష్ట్రం కలయకకు చిహ్నంగా ఉన్న నవంబరు 1 కి రాష్ట్ర విభజన , తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారణంగా ప్రాధాన్యత కోల్పోయింది. అదే సందర్భంలో 1953 అక్టోబరు 1న ఏర్పడిన పూర్వ ఆంధ్ర రాష్ట్ర రూపంలో శ్రీభాగా ఒప్పం అవగాహన , పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగం చేసిన ఫలితంగా ఏర్పడిన ప్రస్తుత ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నందున చారిత్రకంగా అక్టోబర్ 1 న ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగడం సముచితంగా ఉంటుంది.
రాయలసీమ అంశాలు చర్చకు వస్తుందన్న కారణమే అక్టోబరు 1 న అవతరణకు ఆటంకం అయితే సమైక్యతకు అర్థం లేదు…
చారిత్రకంగా చూచినా , నైతికంగా ఆలోచించినా తెలంగాణ , ఆంధ్ర రాష్ట్ర కలయకకు చిహ్నం జరుపుకునే నవంబరు 1 కి విభజన తర్వాత ప్రాధాన్యత లేదు. పూర్వ ఆంధ్ర రాష్ట్ర రూపంలో ఆంద్రప్రదేశ్ ఉన్న రాష్ట్రానికి చిహ్నంగా ఉన్న అక్టోబర్ 1 ని జరపకపోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకున్నా పాలకులు ముందుకు రాకపోవడానికి రాయలసీమ అంశాలు చర్చకు రావడమే ఆటంకంగా ఉన్నాయా ? అన్న అనుమానం కలగక మానదు. నాడు చెన్నై నుంచి కోస్తా ప్రాంతంతో విడిపోవడానికి రాయలసీమ ప్రజలు ఆసక్తి చూపలేదు. రాయలసీమ ప్రజలకు కోస్తా పెద్దలు ఇచ్చిన హామీ పత్రమే శ్రీభాగ్. నేడు అక్టోబర్ 1ని అవతరణ దినోత్సవం జరుపుకుంటే రాజధాని , కృష్ణా నది నీటి లభ్యతలో ప్రధమ ప్రాధాన్యత రాయలసీమకు ఇవ్వాలని అందుకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేయాలన్న విషయాలు చర్చకు రావడం , 65 సంవత్సరాలుగా అమలుకు నోచుకోని కారణంగా రాయలసీమ వెనుకబాటు ప్రజల ముందుకు వస్తుంది. అది ఇష్టం లేకనే అక్టోబర్ 1 ని అవతరణ దినోత్సవంగా జరపడానికి ఆశక్తి చూపడంలేదు అన్న అనుమానం కలగకుండా ఉండదు. పరస్పర అంగీకారంతో కలిసిన రెండు ప్రాంతాల మధ్య కుదిరిన అవగాహన ఉల్లంగించడం , చివరకు ఆ అంశాలను చర్చకు కూడా రాకూడదన్న ఆలోచనలు మారనంతకాలం సమైక్య భావన కేవలం మెడిపండులాంటిదే.