సామాజిక గమనాన్ని అద్దంలో చూపిన కథకుడు వహీద్ ఖాన్. వర్తమాన అంశాల పట్ల ఒక బాధ్యత గల సామాజిక కార్యకర్తగా సానుకూల ధోరణిని నింపే ప్రయత్నం చేశారాయన. 2017 మే మాసంలో తొలి పుస్తకం ‘చారాణా’తో కథకుడిగా పరిచయమయ్యారు.
సామాన్య జీవితాల్లో తొంగి చూసే ఆవేదన, ఆపేక్షలను కథల్లో రంగరించారు. జీవితంలో అంతా కోల్పోయామని దిగులు చెందేవారికి వహీద్ ఖాన్ కథలు టానిక్ లా పని చేస్తాయి. స్వతహాగా నాగర్ కర్నూల్ లో ఉపాధ్యాయులు అయిన వహీద్ ఖాన్ తనలో దాగి ఉన్న మానవీయతను కథల్లో కురిపించారు. అందుకే ఆ కథలు చదివాక కూడా వెంటాడుతుంటాయి. సమాజంలో మన వంతు పాత్రేమిటో ఈ కథలు చెప్పకనే చెబుతాయి.
చారాణా: ముస్లింల సామాజిక జీవనాన్ని చిత్రించిన కథ ఇది. పావలాకు ఒక బన్ను అమ్ముకునే బాలుడి పరిస్థితిని వివరిస్తుందీ కథ. బాలుడి పేరు అమీర్. అతడిని అందరూ పిలిచే పేరు చారాణా. పుస్తకానికి కూడా ఇదే టైటిల్ పెట్టారు.
ప్రసూతి ఆసుపత్రిలో చాయ్ వాలాల వద్ద చాయ్ ఎలా కొనుక్కుంటారో, అమీర్ వద్ద ఒక పావలా ఇచ్చి బన్ తీసుకుంటారు రోగులతో పాటు వచ్చిన సహాయకులు. ఏడెనిమిదేళ్ళ క్రితం అదే ఆసుపత్రిలో పుట్టిన అమీర్ కు పుట్టెడు దారిద్ర్యం. తండ్రి లేడు. ఉన్న తల్లి క్యాన్సర్ తో చనిపోతుంది. అమీర్ పరిస్థితి అగమ్యగోచరం.
అటువంటి సమయంలో అనాథగా దిగులు చెందిన అమీర్ కు బుచ్చమ్మ తారసపడుతుంది అదే ఆసుపత్రిలో. వరుస కాన్పుల్లో ముగ్గురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన బుచ్చమ్మకు నాలుగో కాన్పులోనూ ఆడపిల్ల పుట్టేసరికి అయినవారందరూ అక్కడే తెగతెంపులు చేసుకుని, ఆ బాలింతరాలిని అనాథలా వదిలేస్తారు. ఇద్దరూ అనాథలు. అమీర్ కొడుకు అయ్యాడు. బుచ్చమ్మ అమ్మ అయింది. అప్పుడే పుట్టిన పాపకు లక్ష్మి అని పేరు పెట్టుకుని కొత్త జీవితానికి నాంది పలుకుతారు.
పూర్తి సామాజిక స్పృహతో రాసిన కథ ఇది. కులం, మతం, వర్గ వైషమ్యాలను చెరిపేసి ఒకరికొకరు మాత్రమే మిగులుతారనే సందేశం ఇచ్చిన కథ. కథ చదువుతున్నంతసేపూ ఏ ఒక్కరిపై కోపతాపాలు కలగవు. బతుకు గమనంలో ఉత్పన్నమైన ఒక సమస్యకు ఒక సానుకూలమైన పరిష్కారం.
మరో సమకాలీన కథ ‘సూపర్ మదర్ రియాలిటీ షో’:
సామాన్యుల జీవితాల్లో భూతంలా చొరబడిందని మేధావులు ఆవేదన వ్యక్తం చేసే మాధ్యమం టీవీ. దీనివలన కుటుంబ వ్యవస్థ ఏ విధంగా ఛిన్నా భిన్నమవుతుందో కళ్ళకు కట్టిన కథ సూపర్ మదర్ రియాలిటీ షో. ఇందులో రచయిత చూపిన రియాలిటీ షో కోచింగ్ సెంటర్ ఊహాత్మకమైనా సత్యదూరమేమీ కాదు.
చారాణా పుస్తకంలో ఇంకా సమాధానం, ముక్కు పుడక, బొందమ్మ, సోమ్లి, ఆరని గొంతుక, ద వాల్ రైటర్, కదలిన రైలేదీ తదితర కథలు ఉన్నాయి. ప్రతి కథ వివిధ పత్రికలలో ప్రచురితమై పలు పురస్కారాలను అందుకుని ఉండడం విశేషం. సామాన్యుల ఊహలకు దగ్గరగా, వాస్తవికతను వేలి కొసల్లో నిలుపుకుని అతి సున్నితంగా రాసిన కథలివి.
ఇంత చక్కటి పుస్తకానికి డాక్టర్ వేదగిరి రాంబాబు కథానికా పురస్కారం లభించడం ముదావహం. భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, సింహ ప్రసాద్ సాహిత్య సమితి నిర్వహణలో ఈరోజు డాక్టర్ వేదగిరి రాంబాబు పురస్కారాల ప్రదానోత్సవం జరుగబోతోంది. రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో అవార్డు అందుకోబోతున్న వహీద్ ఖాన్ కు శుభాకాంక్షలు 💐
సామాజిక చైతన్యం కలిగించే మరిన్ని కథా సంకలనాలతో మరిన్ని పురస్కారాలు ఆయన అందుకోవాలని మనసారా కోరుకుంటున్నాను.