తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతున్నాడు. నిన్న ఆయన హిమాలయ ఆధ్యాత్మిక యాత్రకు బయలు దేరారు. పది రోజులాయన హిమాలయాల్లో గడుపుతారు. వెళ్లే ముందు కళానిధి మారన్ సన్ పిక్చర్స్ తరఫున ఒక సినిమా చేసేందుకు సంతకం చేశారు.
ఇంతవరకు మురుగదాస్ ‘దర్బార్ ’ చిత్రంతో బిజీగా ఉన్నాడు.
ఇపుడేమో హిమాలయాలకు వెళ్తున్నారు. ఇక వచ్చాక మళ్లీ సినిమాల్లో మునిగిపోతారు. ఇక రాజకీయాల్లో పనిచేసేదెపుడు? ఇంతకీ ఆయన రాజకీయాల పట్ల సీరియస్ గా ఉన్నారా అనే అనుమానం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
డిసెంబర్ 32, 2017 న రజినినోట సెన్సేషనల్ ప్రకటన వెలువడింది. ఆ రోజు వేలాది మంది అభిమానులనుద్దేశించి ప్రసంగిస్తూ రాజకీయ పొలికేక వేశారు. ‘ఇదొక యుద్దం, నిజంగా ఇదొక యుద్ధం. యుద్ధానికి సన్నద్దం కండి,’ అని వాళ్లకు పిలుపు ఇచ్చారు.
జయలలిత, కరుణానిధి చనిపోయాక, తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దిక్కలేని కొరత తీర్చేందుకు ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వూహించారు.
తమిళనాడు రాజకీయాలను పాతబడిన ద్రవిడ రాజకీయాలనుంచి పక్కకు మళ్లించి కొత్త రాజకీయ చాప్టర్‌ను రజినీకాంత్ ప్రారంభిస్తారని పత్రికా పండితులంతా రాశారు,విశ్లేషించారు.
నిజానికి అప్పటినుంచి ఇప్పటి దాకా ఆయన మళ్లీ రాజకీయాల గురించి మాట్లాడిందేలేదు. సినిమాల మీద సినిమాలు తీస్తున్నారు. ఇంతవరకు నాలుగు సినిమాల్లో నటించారు. అయిదోది ఇపుడు సంతకం చేశారు.
తమిళనాడు అసెంబ్లి ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. 20 నెలల్లో అక్కడ ఎన్నికలొస్తాయి. ఎన్నికల్లో 234 స్థానాల్లో తన పార్టీ పోటీ చేస్తుందన్న గర్జించిన వ్యక్తి ఆ దిశలో ఇంతవరకు ఒక స్టెప్ వేయలేదు.
2017లో ఉన్న ఉత్సాహంలో ఆయన తన అభిమాన సంఘాన్ని రజినీ మక్కల్ మండ్రమ్ (RMM) గా మార్చారు. అదే పార్టీ పేరుకూడా అవుతుందనుకున్నారు.
ఈ సంస్థకు ఆఫీస్ బేరర్లను నియమించారు. అన్ని స్థాయిలో బాధ్యులను కూడా నియమించారు. అధికారికంగా రాజకీయ పార్టీని ప్రకటించేందుకు అవసరమయిన గ్రౌండ్ వర్క్ 90 శాతం పూర్తయిందని ప్రకటించారు.అదే చివరి ప్రకటన. ఈ మధ్యలో 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమొచ్చింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసేదిగాని, ఎవరికైనా మద్దతునిచ్చేది కాని లేదని ఆర్ ఎం ఎం ప్రకటించింది.
అయితే, ఆయన పార్టీని ప్రకటిస్తారో తెలియదు గాని సినిమాలకు మాత్రం సంతకాలు తెగచేస్తూన్నారు.
అభిమానుల నుంచి వత్తిడి వస్తూండటంతో ఆయన సర్కిల్స్ నుంచి మార్చి 2020లో పార్టీని ప్రకటిస్తారనే వార్తలు లీ కయ్యాయి.
ఆయన యుద్ధం పిలుపు ఇచ్చినప్పటినుంచి నాలుగు సినిమాలలో నటించారు. అవి, కాలా(2017), 2.0(2019), పేటా (2019), దర్బార్ (2019 పూర్తయింది). దర్బార్ 2020జనవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఇపుడు సన్ పిక్చర్స్ తో ఒక చిత్రానికి సంతకాలు చేశారు.
సినిమాలేమో రిలీజవుతున్నాయ్, అతి ముఖ్యమయిన RMM రిలీజ్ డేటే రావడం లేదు.
ఇపుడాయన ఏకంగా డిఎంకె వర్గానికి చెందిన సన్ పిక్చర్స్ తో చిత్రానికి ఒప్పుకోవడంతో ఆయన రాజకీయ పార్టీ మీద సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎఐడిఎంకె, డిఎంకె వర్గాలు కూడా రజనీకాంత్ రాజకీయ పార్టీ ఏర్పాటు మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయ్.
2021లో అసెంబ్లీ ఎన్నికలు పెట్టుకుని పార్టీ గురించి ఆలోచించకుండా సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటు ఉండటంలో అర్థమేమిటి? అని వారంటున్నారు. ముందాయన్ని పార్టీ పేరు ప్రకటించమనండి తర్వాత చూద్దాం, అని వారు ఎద్దేవా చేస్తున్నారు.