చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ ల మధ్య జరుగుతున్న రెండో శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడులో చెన్నై సమీపంలోని మహాబలిపురాన్ని వేదిక గా ఎంపిక చేసిందెవరు?
సాధారణంగా ఇలాంటి సమావేశాలు ఢిల్లీ బయట జరగవు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో జరుగుతూ ఉంటాయి. దీనికి భిన్నంగా ఎక్కడో దక్షిణ భారతదేశంలో సముద్రం ఒడ్డునఉన్న చిన్న పల్లెటూరులో జరగడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే, ఈ స్థలాన్ని ఎంపిక చేయడం, భారతదేశం అంగీకరించడంం వెనక ఆసక్తి కరమయిన కథనం ఉందని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది.
మోదీ- షీ ల సమావేశానికి మహాబలిపురం అనువైన ప్రదేశమని సూచించింది ఇండియా కాదు, చైనా. రెన్నెళ్ల కిందట ఈ నిర్ణయం జరిగింది. ఈ స్థలాన్ని ఎంపిక చేసి ఇపుడు చైనా విదేశాంగ సహాయ మంత్రి లువో జావో హుయ్ (Luo Zhaohui). ఆయన గతంలో భారత దేశంలో చైనా రాయబారిగా ఉన్నారు. ఆయన గొప్ప స్కాలర్ కూడా. చైనా ఇండియా చారిత్రక సంబంధాలకు మహాబలిపురం సాక్షి అని, ఈ రెండు దేశాలను ఒకపుడు బాగా కలిపి ఉంచింది అపుడు పెద్ద రేవుగా ఉన్న మహాబలిపురమేనని ఆయనకు తెలుసు. నాటి చైనా చక్రవర్తికి, ఈ ప్రాంతాన్ని ఆరోజుల్లో పాలిస్తూ వచ్చిన పల్లవ రాజుకు మధ్య కూడా ఒక ఒప్పందం జరిగింది. అది కూడా ఇక్కడే జరిగింది.దానికి తోడు గతంలో చౌఎన్ లై ప్రధాని ఉన్నపుడు ఈ పట్టణాన్ని సందర్శించారు. హిందీ చీనీ బాయ్ బాయ్ నినాదం పుట్టిందిక్కడేనని, ఆ రోజు ఈ నినాదంతో చెన్నై వీధులు మారుమ్రోగాయి. అందువల్ల ఈ స్నేహం కొనసాగింపుగా ఇపుడు మళ్లీ మహాబలిపురాన్నే ఎంపిక చేశారు.
తమిళనాడులోని మహాబలిపురం పేరును చైనా ప్రస్తావించగానే మొదట సంతోషించింది ప్రధానిమోదీ ప్రభుత్వమే. ఎందుకంటే, తమిళనాడు, తమిళ ప్రజలను ఏదో విధంగా తన వైపునకు తిప్పుకోవాలని ప్రధాని చూస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో బిజెపి ఇక్కడ ఘోర పరాజయం పాలయింది. మోదీ హవా పనిచేయలేదు. దీనిక తోడు హిందీ వ్యతిరేకత ఇక్కడ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మధ్య మోదీ తమిళ నాడు వ్యూహం మార్చారు.
మొన్నా మధ్య ఐక్యరాజ్యసమితి సర్వ సభ్య సమావేశంలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్లినపుడు ఆయన తమిళ నాడు, భాషను, వంటలను ప్రశంసించారు. పదిరోజుల కిందట తమిళనాడు వచ్చినపుడు తమిళ భాష ప్రపంచంలోనే పురాతన మైందని కొనియాడారు. ఇపుడు ఒక చారిత్రక ప్రాముఖ్యం ఉన్న శిఖరాగ్ర సమావేశానికి వేదికగా తమిళనాడు చేశారు. మహాబలిపురం పేరును అంతర్జాతీయ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ప్రయత్నం చేస్తున్నారు.
ఎందుకంటే, మోదీ – షీ ల మహాబలిపురం సమావేశం ‘మహాబలిపురం సమిట్ సమావేశం’ రికార్డుకెక్కుతుంది. ఇక్కడ వారిద్దరు స్టేట్ మెంట్ విడుదల చేస్తే మహాబలిపురం డిక్లరేషన్ అవుతంది. దీనితో తమిళుల కోపం కొంత చల్లారవచ్చని బిజెెపి ఆశిస్తున్నది. #GobackModi అనే హ్యష్ ట్యాగ్ వైరలయిన చోట ఇపుడు #WelcomeModi హ్యాష్ ట్యాగ్ వచ్చింది. దీనికితోడు డిఎంకె అధినేత స్లాలిన్ మహాబలిపురం శిఖరాగ్రసమావేశాన్ని ప్రసంసించారు. దీనికి తమిళనాడు పట్టణాన్ని ఎంపిక చేసేినందుకు ఆయన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పారు.