ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా రాయలసీమకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ని నియమించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేశారు. ఆయన 1978 నుండి 2014 వరకు వివిధ హోదాలలో అనేక పత్రికలలో పనిచేసైన సీనియర్ జర్నలిస్ట్. ఆయన తన ఉద్యోగ కాలంలో మచ్చ లేకుండా నిబద్దతతో విధులు నిర్వహించడంలోనూ, తోటి జర్నలిస్టులకు రక్షణ కల్పించడంలోనూ తనదైన శైలిలో పనిచేసి విజయం సాధించారు. తాను పుట్టిన జిల్లా సమస్యలతో పాటు కరువుకు కన్నతల్లిగా ఉన్న రాయలసీమ ప్రాంత సమస్యలపై స్పందించి సీమ ఉద్యమం లో ఆయన ఎంతో చురుకైన పాత్ర పోషించారు.
కడప జిల్లా సింహాద్రిపురం మండలం కోవరగుట్టపల్లెలో 1955 లో శ్రీమతి సావిత్రమ్మ, ద్వారకనాథ రెడ్డి దంపతులకు శ్రీనాథ్ రెడ్డి జన్మించారు. మద్రాస్ ట్రిప్లికేన్ లో ఉన్న హిందూహైస్కూల్ లో ప్రాధమిక విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, రామకృష్ణ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. ఎస్.వి. ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ, ఎస్.వి. యూనివర్సిటీ కాలేజీలో మాస్టర్స్ చదివారు. చదువు పూర్థి అయిన వెంటనే 1978లో ఇండియన్ ఎక్సప్రెస్ గ్రూపుకు చెందిన “ఆంధ్రప్రభ” లో సబ్ ఎడిటర్ గా చేరారు. టీడీపీ నాయకుడు మాజీ మంత్రి ధర్మవరం నాగిరెడ్డి చెల్లెలు సుధారాణితో 1980లో వివాహమైంది. ఆయనకు ఇరువురు కుమార్తెలు.
కడప జిల్లాలో వర్గ పోరాటాలు, ముఠా కక్షలు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో 1981లో ఆంధ్రప్రభ స్టాఫ్ రిపోర్టర్ గా చేరారు. 1981 నుండి 2005 వరకు కడపలో ఆంధ్రప్రభ జిల్లా విలేఖరి గాను, 2005 నుండి 2008 వరకు తిరుపతి కేంద్రంగా రాయలసీమ బ్యూరో చీఫ్ గా, 2008 నుండి కొంతకాలం హైదరాబాద్ కేంద్రంగా పొలిటికల్ బ్యూరో చీఫ్ గా పనిచేశారు. 2010 నుండి2014 వరకుసాక్షిలో పొలిటికల్ సెల్ చీఫ్ గా పనిచేశారు. అలాగే 1995-96లో కడప కేంద్రంగా “బిబిసి విలేకరి”గా కూడా పని చేశారు.
యూనియన్ లీడర్ గా….
కడప జిల్లా రాజకీయాలలో హేమా హేమీలైన కందుల ఓబుల రెడ్డి(కడప), వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి(పులివెందుల), డాక్టర్ ఎంవి రమణారెడ్డి(ప్రొద్దటూరు), రాజగోపాల్ రెడ్డి ( లక్కిరెడ్డిపల్లె), బద్వేల్ వీరారెడ్డి (బద్వేల్), గుండ్లకుంట శివారెడ్డి (జమ్ములమడుగు), పాలకొండ్రాయుడు(రాయచోటి) లాంటి వారు నాయకులుగా ఉండి తమదైన శైలిలో వర్గాలను పెంచి పోషిస్తూ, ముఠాకక్షలు పతాక స్థాయిలో ఉన్న సమయంలో శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రప్రభ దినపత్రిక కడప జిల్లా విలేకరిగా చేరారు. అనేక రకాల రాజకీయ ఒత్తిడులను ఎదుర్కొని విలేఖరులకు రక్షణ కల్పించడంతో పాటు, అప్పటికి నామ మాత్రంగా ఉన్న జర్నలిస్ట్ సంఘాన్నిబలోపేతం చేసి సుమారు 25 సంవత్సరాల పాటు జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడుగా పని చేసారు. ఆయన రాష్ట్ర జర్నలిస్ట్ సంఘం కార్యదర్శిగా కూడా పనిచేసారు. ఆయన తన ఉద్యోగ సమయంలో వృత్తి పరంగాను, విలేఖరులకు రక్షణ కల్పించడంలోనూ విజయం సాధించి జిల్లాపై తనదైన ముద్రవేశారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా…..
టీడీపీతో ప్రభంజనం సృష్టించి ముఖ్యమంత్రిగా పదవిచేపట్టిన ఎన్.టి.రామారావు తన కడప పర్యటనలో విలేఖరుల పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో ఆయన పర్యటనను బహిష్కరించి (ఈనాడుతో సహా అన్నిపత్రికలలో) వార్త రాయకుండా నిరోధించడంతో పాటు అప్పటి ప్రతిపక్ష నేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి తో “మీట్ ది ప్రెస్” కార్యక్రమాన్ని నిర్వహించి ఆ వార్త మాత్రమే ప్రచురించడం యూనియన్ నాయకుడుగా ఆయన సాధించిన విజయానికి నిదర్శనం.
అలాగే ఉదయం జిల్లా విలేఖరిగా పని చేస్తున్న “పాశం జగన్నాధం నాయుడు” పైన, ఉదయం కార్యాలయం పైన దాడి చేసి విధ్వంసం చేసిన అప్పటి కడప మునిసిపల్ చేర్మెన్ కిరణ్ పాషా అరాచకాలకు అడ్డుకట్ట వేసి ఆయనపై కఠిన చర్యలు చేపట్టేలా చేసారు.
యూనియన్ నాయకుడుగా ఆయన విలేఖరులకు అనేక రక్షణాత్మక కార్యక్రమాలు చేపట్టారు. ఇకపోతే వృత్తిపరంగా ప్రజావ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన రాజకీయ నాయకులను వ్యతిరేకించడంలో ఆయన ముందు నిలిచేవారు. పులివెందులకు చిత్రావతి నీటిని సరఫరా చేయడానికి నీటి తీరువా పెట్టాలని ప్రతిపాదించిన అప్పటి టీడీపీ ఎంపీ డి.ఎన్. రెడ్డి ని( శ్రీనాథ్ సమీప బంధువు) తీవ్రంగా వ్యతిరేకించి అతి తీవ్ర పదజాలంతో వార్తలు రాసి రైతులను ఆదుకోగలిగారు. ఇలాంటి ఉదంతాలు ఆయన ఉద్యోగ జీవితంలో కోకొల్లలు.
రాయలసీమ ఉద్యమంలో చురుకైన పాత్ర
విలేఖరిగాను, వ్యక్తిగానూ శ్రీనాథ్, మరో సీనియర్ విలేఖరి దుర్గాప్రసాద్ తో కలసి రాయలసీమ ఉద్యమంలో చాలా చురుకైన పాత్ర పోషించారు. 1984 లో రాయలసీమ ఉద్యమం మొదలైనప్పటి నుండి శ్రీనాథ్ చురుకుగా పాల్గొని అప్పటి యువ నాయకుడు డాక్టర్ ఎం.వి మైసూరా రెడ్డి, కార్మిక నాయకుడు సి. హెచ్. చంద్ర శేఖర్ రెడ్డి, సీనియర్ సోషలిస్టు నాయకుడు మాసీమ రాజగోపాల్ రెడ్డి లాంటి నాయకులను సమన్వయము చేయడంలో తనవంతు పాత్ర పోషించారు. ఇప్పటి కమలాపురం శాసనసభ్యుడు, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిని “రాయలసీమ యువ పోరాట సమితి” అధ్యక్షుడుగా చేసి, సీమ ఉద్యమంలో చురుకుగా పాల్గొనేలా చేయడంలో శ్రీనాథ్ కీలకంగా వ్యవహరించారు. రాయలసీమ నీటి పథకాలపై సమగ్ర అవగాహన ఉన్న విలేఖరులలో శ్రీనాథ్ దే ప్రధమ స్థానమని చెప్పకతప్పదు.
భారీ బంధు బలగం
శ్రీనాథ్ రెడ్డికి కాంగ్రెస్, టీడీపీ పార్టీలలో భారీ బంధు బలగం ఉంది. కాంగ్రెస్, టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి, ఆయనకు చిన్నాన్న కాగా, శాసనమండలి మాజీ డిప్యూటీ స్పీకర్ సతీష్ రెడ్డి తమ్ముడు కాగా, మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి మామ. అలాగే టీడీపీ నాయకుడు, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి, ధర్మవరం నాగిరెడ్డి స్వయంగా బావమరిది. అయినా ఆయన బంధుత్వాలకు తలొగ్గకుండా, ప్రలోభాలకులోను కాకుండా ఎలాంటి మచ్చ లేకుండా సుదీర్ఘ కాలం విలేఖరి వృత్తి నిర్వహించి, తోటి విలేఖరులకు రక్షణ కవచంలా నిలచిన శ్రీనాథ్ రెడ్డిని ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం పట్ల విలేఖరులతో పాటు, పలువురు సీనియర్ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తనదైన శైలిలో విలేఖరుల సంక్షేమానికి కృషి చేయడంతో పాటు, వృత్తి విలువలను పెంచడానికి కృషి చేస్తారని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు.