పెద్దాపురం ‘ప్లాస్టిక్ -బియ్యం’ కథ తెలుసా మీకు? ఇదిగో ఇదే….

నిజం, పెద్దాపురంలో ప్లాస్టిక్ – బియ్యం చోద్యం  మొదలయింది.
గుర్తుందా, ఆ మధ్య ‘ప్లాస్టిక్ బియ్యం’ వచ్చేశాయ్ అని సోషల్ మీడియాలో తెగ గోల చేశారు.
ఏదో వీడియోను టింకర్ చేసి ఇదిగో ప్లాస్టిక్ బియ్యం ఇలా తయారు చేస్తున్నారని చూపించారు.
అంతేనా, ఎక్కడో ఏదో వండిన బియ్యం ముద్ద చూపి ఇదే ఇదే ప్లాస్టిక్ బియ్యం. ఇవి తింటే చస్తారని, ఇంత అన్యాయమేమిటని గోలగోల చేసేశారు.
 ఈ ప్లాస్టిక్ బియ్యం ఏకంగా చైనానుంచి వస్తున్నాయని, ఇది చైనా భారత్ మీద చేస్తున్నదాడి అని ఎవరో  చెబితే కొంతమంది, చదువుకున్నోళ్లుకూడా అందునా పెద్దపెద్దగా చదువుకున్నోళ్లు కూడా జాతీయ బాధ్యతలాగా షేర్ చేసేశారు…
ప్లాస్టిక్తో బియ్యం చేయడం సాధ్యంకాదని, ఒక వేళ ‘ప్లాస్టిక్  బియ్యం’ అని  ప్లాస్టిక్ నాడ్యూల్స్ తయారుచేసినా వాటిని బియ్యం లాగా రెండు గ్లాసుల ఎసరుపోసి అన్నంలావుడికించడం కష్టమని  వూహించకుండానే షేర్ మీద షేర్ మీద షేర్ చేసేశారు. ఆ కథ ముగిసింది.
అయితే ఇపుడు ఆంధ్రప్రదేశ్ లో నిజమయిన ‘ప్లాస్టిక్ – బియ్యం’ కథ మొదలయింది. నిజంగానే, నూటికి నూరు శాతం నిజంగానే, ఇది ‘ప్లాస్టిక్ – బియ్యం’ కథ. దీని వెనక గొప్ప సామాజిక బాధ్యత ఉంది. దీనిని షేర్ చేయండి బాధ్యతాయుతంగా.
ఇంతకీ పెద్దాపురంలో ఏంజరుగుతున్నదంటే…
పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లాలో ఒక చిన్న టౌన్ .జనాభా 50 వేల దాకా ఉంటుంది. ఈ వూర్లో ఒక డెబ్బై యేళ్ల ముసలామె రెండు రోజులు కష్టపడి వూరంతా తిరిగి  ప్లాస్టిక్ నంతా పోగేసింది.
తూకమేస్తే దాదాపు మూడుకేజీలయింది. ఈ ప్లాస్టిక్ చెత్త నుంచి ఆమె మూడు కేజీల బియ్యం సంపాదించింది.ఎలాగనేదే కథ.
సోషల్ మీడియాలో తెగ షేర్ యిన ఆ ప్లాస్టిక్ బియ్యం కాదివి. మూడు కేజీల ప్లాస్టిక్ తో ఆమె సంపాదించిన బియ్యం ఒరిజినల్ బియ్యం.
పెద్దాపురంలో కొంత మంది కుర్రవాళ్లు ఈ వింత పథకం మొదలుపెట్టారు.
దీనిపేరు ‘రైస్ ఫర్ ప్లాస్టిక్’. ఎవరైనా సరే వూర్లో ఉన్న ప్లాస్టిక్ చెత్తను పోగేసి అందిస్తే దాని తూకానికి తగ్గ బియ్యం ఇస్తామని వారు ప్రకటించారు.
అంతే, ఈ పెద్దామె ఈ పిలుపునకు స్పందించి మూడు కేజీల ప్లాస్టిక్ ను పోగేసి ఈ సంస్థకు అందించింది. వాళ్లామెకు గాంధీ జయంతి రోజున మూడు కేజీల బియ్యం అందించారు.
” Avoid Plasti-Avoid Hunger” అనిపేరుపెట్టి ప్లాస్లిక్ కు బియ్యం అందిస్తున్నారు. గాంధీ జయంతి రోజున  మొత్తం 200 కేజీల ప్లాస్టిక్ చెత్త వారి చేతి కందింది. వారు 200కేజీల బియ్యాన్ని చెత్త అందించిన వారికిచ్చారు.
ఇవి నాసిరకం బియ్యం కాదు. కిలో రు.30 బియ్యం. సన్నబియ్యం.
పిల్లల్లో కూడా Avoid Plastc అవేర్ నెస్ తీసుకువచ్చేందుకు వాళ్లకు ‘ప్లాస్టిక్ కు ఆటబొమ్మలు’  అందివ్వడం  కూడా మొదలుపెట్టారు.
నిజానికి ఈ కార్యక్రమం చేపడుతున్న వాళ్లంతా Mana Peddapuram అనే ఒక ఫేస్ బుక్ గ్రూప్ సభ్యులు. ఇందులో 24 వేల మంది సభ్యులున్నారు. ఈ గ్రూప్ కు వూర్లో 2000 మంది వాలంటీర్లుకూడా ఉన్నారు.
వీళ్ల Avoid Plastic అవగాహన పెంచేందుకు ఈ గ్రూప్ నే వాడుకున్నారు. ఒక సారి ఇండియాలో ఎంత ప్లాస్టిక్ వేస్ట్ జనరేట్ అవుతూ ఉందో చెప్పారు. రెండోసారి ఆకలి విషయంలో భారత్ కు అంతర్జాతీయంగా ఏ ర్యాంకులో ఉంది అనే విషయం చెప్పారు.
భారత్ లో ఏటా 25 లక్షల టన్నుల ప్లాస్టిక్ చెత్త ఉత్పత్తవుతూ ఉంది
. ఆకలిలో ప్రపంచంలో 103 స్థానంలో ఉంది. ఈ థీమ్ తో వాళ్లు క్యాంపెయిన్ మొదలుపెట్టారు. దీన్నుంచి వచ్చిందే, ‘ప్లాస్టిక్ చెత్త ఇవ్వండి, బియ్యం తీసుకోండి’ అనే కార్యక్రమం అని నరేష్ పెద్దిరెడ్డి చెప్పారు. ఇదంతా నరేష్ ఆలోచనే.వృత్తి రీత్యా నరేష్ డ్రై ఫ్రూట్ వ్యాపారి.
ఈ గ్రూప్ ఎవరి నుంచి డొనేషన్లు తీసుకోవడం లేదు. ‘మన పెద్దాపురం’ ఫేస్ బుక్ గ్రూప్ తరఫున ఏదైనా కార్యక్రమం రూపొందించినపుడు సభ్యులే డొనేషన్ అందిస్తారు.
Rice for Plastic కార్యక్రమం చేపట్టినపుడు సభ్యులతో పాటు స్థానిక వ్యాపారులు 25కేజీ లున్న ఒక బస్తానుంచి 10 బస్తాల దాకా విరాళంగా ఇచ్చారు.
ఇకనుంచి ఈ వారానికొక రోజు నిర్వహించాలని నిర్ణయించినట్లు నరేష్ చెప్పాడు.