మహాత్మా గాంధీ150వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ ఈ రోజున రాజ్ భవన్ లో కాశీ హిందూ విశ్వవిద్యాలయం ఆచార్యులు బూదాటి వెంకటేశ్వర్లు రాసిన గాంధీ శతక వ్యాఖ్యానం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఈ శతకాన్ని 1924లో మంగిపూడి వేంకటశర్మ రచించారు. ప్రసిద్ధ సాహిత్య పత్రిక భారతి ఈ శతక పద్యాలతోనే ప్రారంభం అయింది.
గాంధీజీ జాతిపితగా పూర్తిగా గుర్తింపు పొందక ముందే జాతీయోద్యమ కవి అయిన మంగిపూడి వేంకటశర్మ గాంధీని ఒక బుద్ధునిగా, జీసస్ గా సంభావించి రాయడం ఈ శతకం లోని విశేషం.
గాంధీజీ ఆత్మకథ పుస్తక రూపంగా వెలువడక ముందే గాంధీజీ చరిత్రను ప్రశంసిస్తూ పద్యరూపంలో రాయడం ఈ శతకంలో మరో విశిష్టత. ఇటువంటి శతకాన్ని ఆచార్య బుదాటి మళ్ళీ వెలుగులోకి తేవడం అభినందనీయమని ఆంద్రప్రదేశ్ గవర్నర్ ప్రశంసించారు.
ఈతరానికి గాంధీజీ భావజాలానికి గాంధీజీ వారసుల్ని తయారు చేయవలసిన బాధ్యత ఆచార్యులకు, అధ్యాపకులకు ఉన్నదని ఉద్భోదించారు.
ఈ కార్యక్రమంలో డా. వై. కామేశ్వరి, డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, డా. యం.శివ ప్రవీణ్, డా.మురళీ కృష్ణ, కె.సుబ్బారావు, వై. జగ్గారావు, పి.దాసు, పి.అప్పారావు, ఆర్.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.