శాంతి దూతకు నోబెల్ శాంతి బహుమతి ఎందుకు రాలేదు? కారణాలివే!

ఆయన మారు పేరు శాంతి దూత. ఆయన జీవన  మార్గం అహింసా మార్గం. ప్రపంచంలోని అనేక దేశాల స్వాతంత్య్రో ద్యమాలు ఆయన అహింసా బోధనల నుంచి స్ఫూర్తి పొందాయి.
ఆయన బోధించిన శాంతి మార్గం అనేది ఒక విశ్వజనీన భావన. ఎవరు ఎక్కడైనా అహింసా మార్గాన్ని అవలంభించవచ్చు.
ఇలాంటి అహింసా మార్గాన్ని ఒక లక్ష్యసాధనకు ఎంచుకోవాలని చెప్పిన మహాత్మగాంధీకి నోబెల్ శాంతి  బహుమతి ఎందుకు రాలేదు.ఆయన పేరును ప్రతిపాదించిన అయిదు సార్లు ఎందుకు తిరస్కరించారు. దీనికి కారణమేమిటి?
ప్రపంచమంతా భావిస్తున్న దానికి భిన్నంగా స్వీడెన్ నోబెల్ కమిటీకి ఆయన శాంతి బోధకుడిగా, శాంతి దూతగా కనిపించలేదు.అదే ఆశ్చర్యం.
అందుకే నోబెల్ విధానాల మీద అనుమానాలొస్తాయి. 20వ శతాబ్దంలో, ఉవ్వెత్తున స్వాతంత్య్రోద్యమాలు సాగుతున్నపుడు నోబెల్ కమిటీ యూరోప్ అమెరికాలతో సమానంగా ఆఫ్రికా, ఆసియా దేశాల ప్రజలను, అక్కడి  జాతీయోద్యమాలను, వాటి నాయకులను చూడలేదు. వాళ్లకి తక్కువ హోదానే ఇచ్చింది.
గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ఎందుకురాలేదని ప్రశ్న వేసుకునే ముందు ఒక 1960 దాకా అమెరికా,యూరోపియన్లకు తప్ప మరొకరికి శాంతి బహుమతి ఇవ్వలేదనే విషయం గుర్తుంచుకోవాలి.
ఇందులోనే ఈ ప్రశ్నకు సమాధానం ఉంది.
ఆసియా, ఆఫ్రికా ఖండాలలోని చాలా దేశాలు ఇటీవలి దాకా ఏదో ఒక ఐరాపా దేశానికి వలస దేశాలుగానే ఉన్నాయి. అక్కడంతా ఈ వలసపాలకులకు వ్యతిరేకంగా పోరాటాలు అంటే స్వాతంత్య్ర పోరాటాలు సాగుతున్నాయి. యూరోపియన్ వలస పాలకులని తరిమేయాలని ప్రాణత్యాగాలు కూడా చేస్తున్నారు. నార్వే కూడా ఐరాపా దేశమే. ఐరాపాదేశాల పెత్తనానికి వ్యతిరేకంగా సాగుతున్న స్వాతంత్య్ర పోరాటాలను దేశద్రోహంగా,వాటికి  నాయకత్వం వహించే వాళ్లని నేరస్థులుగా చూడటమే తప్ప వాళ్లకి  విముక్తి నేతల హోద ఇవ్వకపోవడం నోబెల్ కమిటీ ధోరణిలో కనిపిస్తుంది.
 కొట్టాడుకుంటున్నవారి మధ్య మధ్యవర్తిత్వం చేసినా సరే,  అమెరికా వాళ్లకు ఐరాపావాళ్లకు శాంతి బహుమతులిచ్చారు.
అలాకాకుండా స్వాతంత్య్రం కోసం సాగుతున్న పోరాటంలోనుంచి హింసను తీసేసి ఈ పోరాటాలను అహింసా మార్గంలోకి మళ్లించి ప్రపంచానికి ఒక కొత్త దారి చూపిన  వ్యక్తి శాంతి బహుమతికి అర్హుడు కాలేదంటే అర్థం ఏమిటి?
గాంధీకి శాంతి బహుమతి ఇస్తే ప్రపంచంలో రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్నబిట్రన్ కు కోపం వస్తుందని నోబెల్ కమిటీ భయపడిందేమో అనుమానం వస్తుంది.
ఎందుకంటే గాంధీ తెల్లజాతి వాళ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేసిన కాలంలో ప్రపంచాధిపత్యమంతా బ్రిటన్ చేతిలోనే ఉంది. గాంధీని ఒక నేరస్థుడిగా భావించి నాటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం జైళ్లోకి తోసేస్తున్న రోజులవి.
అప్పటికింకా నోబెల్ కమిటీ ఇపుడున్నంత ప్రజాస్వామికంగా లేదు. ఇపుడుప్రపంచ వ్యాపితంగా బ్రిటన్ తో పాటు అన్ని రకాల వలస ప్రభుత్వాలు కూలిపోవడం,  ప్రజాస్వామ్య ప్రభుత్వాలు బలపడటం, ప్రజస్వామ్య భావాలు ప్రచారం కావడంతో నోబెల్ కమిటీ కూడా కొంతలో కొంత ఆలోచనా ధోరణి మార్చుకుంది.
ఆసియా, ఆఫ్రికా దేశాల వారికి కూడా నోబెల్ శాంతి బహుమతులివ్వడం మొదలుపెట్టింది.
నిజానికి, గాంధీజీని అయిదుసార్లు నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. 1937,1938,1939,1947, 1948 లలో ఆయన పేరును శాంతి బహుమతికి ప్రతిపాదించినా ఆయనను ఎంపిక చేయలేదు.
ఈ తప్పును నోబెల్ కమిటీ తెలుసుకునేందుకు చాలా కాలం పట్టింది. 1989లో నోబెల్ శాంతి బహుమతి దలైలామకు అందించారు. అపుడు దీనిని మహాత్మా గాంధీకి నివాళి వంటిదని కమిటీ ప్రశంసించింది చేతులు దులుపుకుంది.
కుంటిసాకులు
గాంధీజీకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ప్రతిపాదనలొచ్చినపుడల్లా కమిటి కుంటిసాకుల తో తిరస్కరించింది. అబ్బే అలాంటిదేం లేదుని కమిటీ ఇప్పటికే బుకాయిస్తుంది. గాంధీ చేసిన పోరాటాలు విశ్వజనీనమయినవి కాదు, కేవలం భారతీయులు కోసం మాత్రమే ఉద్దేశించారని అందుకే ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కి అర్హత రాలేదని కమిటీ వాదిస్తూ వచ్చింది.
1915లో గాంధీ సౌతాఫ్రికా నుంచి భారత్ తిరిగొచ్చారు. అప్పటికే ఆయన జాతి వివక్ష పోరాటానికి బాగా మద్దతు లభిస్తూ ఉంది. దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాలలో ఆయనకు స్నేహితులు తయారయ్యారు. 1930 నాటికి అమెరికా, ఐరోపాలలో ఎక్కడచూసినా ‘ఫ్రెండ్ ఆఫ్ ఇండియా’ అనే సంస్థలు వెలిశాయి.
మొదటి సారి 1937లో నార్వే లేబర్ పార్టీ పార్లమెంటు సభ్యుడు ( Ole, Colbjørnsen) గాంధీజీ పేరును నోబెల్ బహుమతికి నామినేట్ చేశారు. గాంధీజీ అహింసా మార్గంలోనే వెళ్తున్నా, ఆయన బ్రిటిష్ వ్యతిరేక విధానాలు హింసా,టెర్రర్ కు దారి తీశాయని దీనికి చౌరీ చౌరా సహాయనిరాకరణోద్యమ (1920-21) సాక్ష్యమని కమిటీ భావించింది.
గాంధీ కేవలం ఇండియన్ల కోసమే పోరాడుతున్నాడని, సౌతాఫ్రికాలో ఉన్నపుడు అక్కడి  నల్లవాళ్లు ఎంత కష్టాల్లో ఉన్నా పట్టించుకోలేదని అప్పట్లో వినిపించిన ఒక హాస్యాస్పదమయిన విమర్శను కూడా కమిటీ సీరియస్ గా తీసుకుంది.
దీనితో ఆ యేడాది నోబెల్ శాంతి బహుమతి గాంధీకి ఇవ్వలేదు.
అదే నార్వే పార్లమెంటు సభ్యుడు 1938,39 లలో కూడా గాంధీ పేరున ప్రతిపాదించారు. అవే చౌకబారు అవగాహనతో గాంధీజీ పేరును తిరస్కరించారు.
తర్వాత 1947లో గాంధీజీ పేరును ముంబాయ్ ప్రధాన మంత్రి బి.జి ఖేర్, యునైటెడ్ ప్రావిన్స్ ప్రధాని గోవింద్ వల్లబ్ పంత్, ఇండియా లెజిస్లేటివ్అసెంబ్లీ అధ్యక్షుడు మవలాంకర్ తదితరులు ప్రతిపాదించారు.
వీళ్లంతా టెలిగ్రామ్ లలో నార్వే ఫారిన్ ఆఫీస్ ద్వార ఆయన పేరును ప్రతిపాదించారు. చివరకు శాంతి బహుమతికి షార్ట్ లిస్టయిన ఆరుపేర్ల జాబితాలోకి గాంధీ పేరెక్కింది.
ఈ సారి గాంధీ మీద కొంత గౌరవం చూపినా శాంతి పురస్కారం అందించేందుకు  కమిటీ మద్దతు తెలపలేదు.
దేశవిభజన సమయంలో రక్త పాత లేకుండా ఉండి ఉంటే ఆ ఘనత గాంధీ దక్కి ఉండేదని, ఇదే కారణమన్నట్లు గాంధీ మీద రిపోర్టు రాసి కమిటీ సభ్యుడు పేర్కొన్నారు.
గాంధీజీని 1948 జనవరి 30 గాడ్సే హత్య చేశాడు. ఇది దుర్ఘటన నోబెల్ శాంతి బహుమతి కి నామినేషన్లు పంపేందుకు గడువుకు రెండు రోజుల ముందు జరిగింది. అప్పటికే గాంధీ పేరును ప్రతిపాదిస్తూ ఆరు లేఖలు అందాయి.
ఈ సారి కూడా గాంధీ పేరు షార్ట్ లిస్టయింది. ఇలా జరగడం మూడో సారి. అయినా సరే పాత కారణాలతోనే కమిటీ సలహాదారొకరు ఆయనను ఎంపిక చేసేందుకు అంగీకరించలేదు.
మరణానంతర నోబెల్ శాంతి బహుమతి
కొన్ని ప్రత్యేక పరిస్థితులలో మరణానంతర నోబెల్ శాంతి బహుమతి ఇవ్వవచ్చు. ఇలా గాంధీని గౌరవించవచ్చు.అయితే, నొబెల్ కమిటీకి ఒక చిక్చొచ్చిపడిందని కమిటి పేర్కొంది. ‘గాంధీకి మరణానంతర నోబెల్ శాంతి బహుమతి ఇవ్వవచ్చు. అయితే, గాంధీ ఏ సంస్థకు చెందిన వాడుకాదు. ఆయన ఆస్తులేవీ మిగిలించలేదు. వీలునామా లేదు. అపుడు మరి బహుమతిని ఎవరుస్వీకరించాలి?
అనేక తర్జన భర్జనల తర్వాత మరణానంతర పురస్కారం ఇవ్వలేమని కమిటీ నిర్ణయించింది. కమిటీ ఎంపిక చేసిన తర్వాత అభ్యర్థి మరణించిన పక్షంలో మాత్రమే మరణానంతరం బహుమతి ఇవ్వాలని పేర్కొంది. దీనితో గాంధీకి నోబెల్ శాంతి బహుమతి రాకుండా పోయింది. ఆనాడు గాంధీకి బహుమతి నిరాకరిస్తూ నోబెల్ కమిటీ చేసిన వాదనలు చాలా హాస్యాస్పదంగా కనిపిస్తాయి. సింపుల్ గా చెబితే, ఇందులో కలోనియల్ మైండ్ కనబడుతుంది. బ్రిటన్ ను వ్యతిరేకిస్తూచేస్తున్న స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహిస్తున్న గాంధీలో ఏదో ఒక లోపంచూపి తిరస్కరించారు.

(with inputs from The Nobel Prize)