హంద్రీ – నీవా సుజల స్రవంతి(HNSS) సామర్థ్యాన్ని పెంచి, నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికపై పూర్తి చేయాలని ప్రముఖ సాంఘిక రాజకీయ విశ్లేషకుడు టి లక్ష్మినారాయణ సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, చిత్తూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ఈ నెల 26న మదనపల్లిలో సదస్సు ఆయన ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ ఈ సూచన చేశారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలు:
1. ఆగస్టు 5వ తేదీ రాత్రికి శ్రీశైలం జలాశయం నీటి మట్టం 864 అడుగులకు చేరుకొన్న మీదట హంద్రీ – నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు 675 క్యూసెక్కుల సరఫరాతో మొదలు పెట్టి ఆగస్టు 9వ తేదీ రాత్రికి 2,025 క్యూసెక్కులకు నీటి విడుదలను పెంచారు.
2. నాటి నుంచి నేటి వరకు గడచిన 50 రోజులుగా 2,025 క్యూసెక్కుల చొప్పున నీటిని హంద్రీ – నీవాకు తరలించారు. అంటే 9 టియంసిల నీటిని మాత్రమే తరలించారు. పర్యవసానంగా అనంతపురం జిల్లా సరిహద్దు దాటి చిత్తూరు జిల్లాలోకి హంద్రీ – నీవా నీరు ఇంకా చేరలేదు.
3. ఒక వైపున కృష్ణా నది వరద నీరు సముద్రం పాలౌతున్నా హంద్రీ – నీవా ప్రధాన కాలువ ప్రస్తుత సామర్థ్యం 3,858 క్యూసెక్కుల మేరకైనా ఎందుకు తరలించలేదో ప్రభుత్వమే చెప్పాలి.
4. హంద్రీ – నీవా ప్రధాన కాలువను 5,000 క్యూసెక్కుల సామర్థ్యంతో జీడిపల్లి రిజర్వాయరు వరకు విస్తరిస్తామంటూ గత ప్రభుత్వం 2017లో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ నిర్మాణ పనులు చేపట్ట లేదు.
5. ప్రస్తుత ముఖ్యమంత్రి 6,000 క్యూసెక్కులకు విస్తరించడానికి ప్రతిపాదనలు రూపొందించమని అధికారులను ఆదేశించినట్లు వార్తలొచ్చాయి.
6. 1989లో ఈ పథకాన్ని రూపొందించిన నాడు 3,858 క్యూసెక్కుల చొప్పున 120 రోజుల్లో 40 టియంసిల తరలింపు లక్ష్యంగా నిర్ధేశించు కోవడం జరిగింది.
7. కానీ నేడు కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం రోజులు గణనీయంగా తగ్గిపోయిన పూర్వరంగంలో హంద్రీ – నీవా ప్రధాన కాలువ సామర్థ్యాన్ని 20,000 క్యూసెక్కులకు పెంచితే గానీ నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా నీటి తరలింపు సాధ్యం కాదు.
8. హంద్రీ – నీవా నిర్ధేశిత ఆయకట్టుకు, త్రాగు నీటి అవసరాలకు, పారిశ్రామికాభివృద్ధికి(కియా లాంటి పరిశ్రమలకు) నీటి సరఫరాను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే హంద్రీ – నీవా ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని 40 టియంసిల నుంచి కనీసం రెట్టింపు చేయవలసిన అవసరం ఉన్నది.
9. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అన్ని అంశాలపై దృష్టి సారించి సత్వరం కార్యాచరణకు పూనుకోవాలి.
(ఫీచర్ ఫోటో ఫైల్ ఫోటో)