మిమిక్రీ చేసే వేణుమాధవ్ సినిమాల్లోకి ఎలా వచ్చాడో తెలుసా?

ఈ తెల్లవారు జామున అనారోగ్యంతో మరణించిన ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్ (39) మిమిక్రీ కళాకారుడిగా జీవితం ప్రారంభించినా ఆయనను సినిమాల్లోకి తీసుకెళ్లింది హైదరాబాద్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయమే.
ఆయనను తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి నడిపించింది మాత్రం అనాటి టిడిపి టిడిపి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు.
అక్కడ ఆయన ఎన్టీఆర్ ప్రశంసలందుకుని టిడిపి కార్యాలయంలో మకాం వేశారు.
ఇదెలా జరిగిందంటే…
ఆ రోజుల్లో ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చదువు వెలుగు ఉద్యమంలో వేణుమాధవ్ చురకుగా పాల్గొనేవారు. ఈ సమయంలో నల్గొండ జిల్లాలోని వందలాది గ్రామాల్ల పర్యటించి దీనికి సంబంధించి పలు కార్యక్రమాలు నిర్వహించారు. మాట్లాడే బొమ్మ (టాకింగ్ డాల్ ) పేరుతో చదువు వెలుగు ఉద్యమంలో ప్రదర్శనలు ఇచ్చారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో 1989-90 కాలం నాటి మాట ఇది. అప్పటి జిల్లా కలెక్టర్ ఎన్ కె నరసింహారావు చదువు వెలుగు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక, ఆంద్రప్రజానాట్యమండలికి చెందిన కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రదర్శనలు ఇచ్చేవారు.
చదువు ఆవశ్యకతను తెలిపుతూ ప్రదర్శనలు ఇచ్చే వారు. ఇదే క్యాంపెయిన్ లో మాట్లాడే బొమ్మతో వేణుమాధవ్ ప్రదర్శనలు ఇచ్చారు. మంచి హస్యచతురడయిన వేణుమాధవ్ కు ఈ ప్రదర్శనలతో ప్రజల్లో బాగా పేరొచ్చింది.
ఇదే క్యాంపెయిన్ లో ఆంధ్రప్రజానాట్యమండలికి చెందిన అంజన్న నేతృత్వంలో అనేక మంది కళాకారులు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించేవారు.
చదువు ఆవశ్యకతను తెలుపుతూ వీధినాటికలు ప్రదర్శించేవారు. అంజన్న నాయకత్వంలో పల్లెసుద్దులు, మన చరిత్ర, కురుక్షేత్రం, ఆగిపోని నాటిక అనే పేరుతో నాటికలు ప్రదర్శించారు.ఈ నాటికల్లో కూడా వేణుమాధవ్ నటించారు.
మన చరిత్ర అనే నాటికలో వేణుమాధవ్ కానిస్టేబుల్ పాత్ర పోషించేవాడు. ఇందులో వేణుమాధవ్ నటనకు బాగా పేరొచ్చింది. అందరిని ఆకట్టుకొంది. ఇలా వేణుమాధవ్ ఈ ప్రదర్శనల కోసం జనం ఎగబడేవారు.
అయితే, బతుకు తెరువుకు ఇది చాలదుగా.
అప్పటి కోదాడ ఎమ్మెల్యే చందర్ రావు ద్వారా వేణుమాధవ్ హైద్రాబాద్ కు చేరుకొని టీడీపీ కార్యాలయంలో కొంత కాలం పనిచేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి ప్రవేశించాడు. ఆనాడు హోం మంత్రిగా ఉన్న మాధవరెడ్డి సహకారంతో సినీ రంగ ప్రవేశం చేసినట్టుగా చెబుతారు.
జిల్లాలో వేణుమాధవ్ ఇస్తున్నప్రోగ్రామ్స్ ను చూసిన మాధవరెడ్డి మహానాడులో ఒక ప్రదర్శన ఇవ్వాలని చెప్పి అవకాశమిచ్చారు. దీనిని చంద్రబాబు నాయుడు చూసి మరొక మహానాడులో ప్రోగ్రాం ఇచ్చే అవకాశమిచ్చారు.
ఈ మహానాడులో ఎన్టీరామారావు చివర మాట్లాడాల్సి ఉంది. ఎన్టీరామారావు మాట్లాడటానికి కొద్ది నిమిషాలు టైం అవసరంకావడంతో చంద్రబాబు నాయుడు వేణుమాధవ్ ను స్టేజ్ మీదకు పిలిచారు.
ఈ లోపురామారావు వచ్చారు. వేణుమాధవ్ ప్రోగ్రామ్ చూసి మెచ్చుకున్నారు. అంతేకాదు, తెలుగుదేశం పార్టీతో పనిచేయాలని చెబుతూ హిమయత్ నగర్ టిడిపి కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా నియమించారు.
అది కూడా చాలా కీలకమయిన పోస్టు. ఎన్టీరామారావుకు కాల్స్ వస్తే వాటిని ఆయన కనెక్ట చేయాలి. జీతం ఆరొందలే. ఇది వేణు మాధవ్ ను కొంత నిరుత్సాహపరిచింది.
కొద్ది రోజుల తర్వాత రచయిత దివాకర్ బాబు సన్మాన కార్యక్రమంలో మిమిక్రీ చేసే అవకాశం వేణుమాధవ్ కు వచ్చింది.అక్కడ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి కూడా ఉన్నారు. ఆయన వేణు మాధవ్ టాలెంట్ చూసి సంప్రదాయం సినిమాలోఅవకాశమిచ్చారిన వేణుమాధవ్ స్వయంగా చెప్పారు.