ప్రతి తండ్రికి కొడుకు , కూతురు మీద ప్రేమ ఉంటుంది. ఇందులో తప్పు లేదు. అయితే, అది వెర్రితలలు వేయరాదు. సమాజానికి హాని చేయరాదు. చాలా మంది రాజకీయ నాయకులలో ఈ ప్రేమ బాగా వికారంగా ఉంటుంది. అందుకే వాళ్ళు మొదట చేసే పని కొడుకులనే తమ వారసులుగా చేయాలనుకోవడం . రాజకీయాలు కలుషితం కావడం ఇక్కడే మొదలవుతుంది. అప్పటినుంచి వాళ్ళకి తర్ఫీదు ఇవ్వడం మొదలుపెడతారు. కరప్ట్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పిస్తారు. పనికోసమో, పైరవీ కోసమో ఎవరయినా ‘సాయం’ కోరితే, ‘బాబును కల్సు’ అనడం మొదలుపెడతారు. బాబు ను కల్సు అన్నాడంటే…అంతే సంగతులు. అక్కడ వసూళ్ళున్నాయని అర్థం. ఇలాంటి ‘బాబును కల్సు’ కల్చర్ ను పవర్ లోకొచ్చి చాలా మంది రాజకీయనాయకులు బాగా ప్రాక్టీస్ చేస్తుంటారు. ఈ కల్చర్ కు కోడెల బలయ్యాడని సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రమణ్యం అంటున్నారు. మాంచి ఊపుతో రాజకీయాల్లోకి వచ్చిన… కోడెల ‘బాబును కల్సు’ కల్చర్ కు ఎలా బలయ్యారో సుబ్బు గొప్పగా చెప్పారు. ఈ ‘బాబు’ చివరకు ఎలా తయారయ్యాడో ఆయన ఇందులో బాగా రాసారు. కొడుకుల మీది వల్ల మాలిన ప్రేమ వెర్రి తలలు వేయడం చాలా అరుదుగా బయటపడుతుంటాయి. కోడెలది శాంపిల్ మాత్రమే.
కోడెల పేరు మారిస్తే ఈ విశ్లేషణ రాజకీయ నాయకులందరికి వర్తిస్తుంది. ప్రయత్నించి చూడండి.
సూర్య లో వచ్చిన ఈ వ్యాసాన్ని ప్రత్యేక అనుమతి తో ఇక్కడ ముద్రిస్తున్నాం.
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏడు పదులకు పైబడిన టిడిపి సీనియర్ నేత, పల్నాడు కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాలు వెలిగిన ధృవతార డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి చెందారన్న వార్త ప్రతి మనిషినీ దిగ్భ్రమకు గురిచేసింది. ఏ మనిషికయినా మరణం అనివార్యం. ఆయన సహజంగా మరణిస్తే అది వేరు. కానీ, వారసులు మిగిల్చిన అవమానకర భారం, అధికార పార్టీ రాజకీయ వ్యూహానికి చిక్కి ఆత్మహత్య చేసుకోవడమే బాధాకరం.
నర్సరావుపేట ఎమ్మెల్యే కాకముందు.. కోడెల గుంటూరు రోడ్లో లక్ష్మీ నర్సింగ్ హోం నిర్వహించేవారు. మంచి హస్తవాసి ఉన్న వైద్యుడిగా పేరు. పైగా వైద్య చికిత్స చేయించుకుని డబ్బులివ్వలేని పేదలకు, ఎదురు తానే కొంత డబ్బిచ్చి పంపేవారు. ఇంకా చాలామంది వైద్యం చేయించుకుని డబ్బులివ్వకపోతే, కోడెల మొహమాటం ఎరిగిన ఆయన తండ్రి సంజీవయ్య వాటిని వసూలు చేసేవారు. ఆ తర్వాత స్థానిక రాజకీయ పరిస్థితుల ప్రభావంతో కోడెల ఫుల్‌టైమ్ పొలిటీషియన్ అవతారమెత్తారు.
నిజానికి కోడెల రాజకీయాల్లోకి వచ్చి.. పల్నాడులో బలమైన పునాది ఉన్న కాసు కుటుంబాన్ని ఓడించిన చాలాకాలం వరకూ వైద్య వృత్తిని విడిచిపెట్టలేదు. అప్పట్లో జిల్లా టిడిపి ఏకైక సెక్రటరీ- రాజకీయ వ్యూహకర్త కాకుమాను పెదపేరిరెడ్డి, డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు ఆయనకు అత్యంత ఆప్తులుగా ఉండేవారు. ప్రజలు, కార్యకర్తలు ఏ పనుల కోసం వచ్చినా అన్నీ పెదపేరిరెడ్డి చూసుకునేవారు. లెటర్‌హెడ్ మీద పేరిరెడ్డి విషయం రాస్తే, కోడెల సంతకం చేసేవారు. వారి మైత్రి అంత బలంగా ఉండేది.
ఆ తర్వాత పేరిరెడ్డికి గురజాల సీటు రాకుండా కోడెల అడ్డుపడటం, హైదరాబాద్ నుంచి మాచర్లకు వచ్చిన నాటి మంత్రి మాధవరెడ్డి పేరిరెడ్డిని బుజ్జగించడం, ఆయన పార్టీ మారటం జరిగిపోయిందనుకోండి. అది వేరే విషయం. పేరిరెడ్డిపై తన చుట్టూ చేరిన వారు చెప్పిన పితూరీలను నమ్మే కోడెల ఆయనను దూరం చేసుకున్నారనేది అప్పట్లో వినిపించిన వ్యాఖ్యలు.
కోడెల ఎమ్మెల్యేగా ఉన్నా చాలాకాలం స్కూటర్‌పైనే తిరిగేవారు. వెనుక పేరిరెడ్డి కూర్చునేవారు. చివరకు సీఎం ఎన్టీఆర్‌ను కలిసేందుకు హైదరాబాద్ వెళ్లాలన్నా బస్సులోనే వెళ్లేవారు. చాలాకాలం కోడెల బదులు పేరిరెడ్డి అబిడ్స్‌లోని ఎన్టీఆర్ నివాసంలో జరిగే తెల్లవారుఝాము సమావేశాలకు హాజరయ్యేవారు. ‘పేరారెడ్డి గారు వచ్చారు కదా? ఇక సమావేశం ప్రారంభించండి’ అని ఎన్టీఆర్ చెప్పేవారు. తర్వాత కోడెల హాజరయ్యేవారు.
కోడెలకు ఫిర్యాదులు (పితూరీలు) వినడం బాగా ఇష్టంగా ఉండేది. ఆ అలవాటే ఆయనకు అత్యంత నమ్మకస్తులైన పేరిరెడ్డి, డాక్టర్ కొండపల్లిని ఆయన నుంచి వెళ్లేలా చేసింది. వారిద్దరే కాదు.. చాలామంది సీనియర్లను కోడెల అలాగే దూరం చేసుకున్నారన్నది బహిరంగమే.
తేదీ, సంవత్సరాలు అంతగా గుర్తు లేవు గానీ.. కోటప్పకొండకు వెళుతుండగా అనుకుంటా. ఆయనను హత్య చేసేందుకు ఓ కల్వర్టు కింద పీపుల్స్‌వార్ (అప్పట్లో ఇంకా అది మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందలేదు) నక్సలైట్లు బాంబులు పెట్టారన్న వార్త సంచలనం సృష్టించింది. దానితో ఆయనకు భద్రత పెంచారు. అంజూరి రాధా అప్పట్లో డిఎస్పీగా ఉన్నట్లు గుర్తు.
అప్పటికే కోడెలతో స్థానికుడిగా నాకు ఉన్న అనుబంధం, హైదరాబాద్‌లోనే వృత్తిపరంగా కొనసాగించిన సంబంధాలతోపాటు.. అంతకుముందు అదే పీపుల్స్‌వార్ అనుబంధ విద్యార్ధి సంఘమైన రాడికల్స్ స్టూడెంట్ యూనియన్‌లో పనిచేసిన అనుభవం ఉన్న నేను.. బాంబు దాడి అంశాన్ని కోడెలతో ఇష్టాగోష్టిగా ప్రస్తావించా. బహుశా అది తప్పుడు వార్త అయి ఉండవచ్చని సంవాదానికి దిగా. కోడెలకు ఎవరినైనా, తనకంటే వయసు పెద్దవారయినా సరే.. ‘ఏమ్మా’ అనడం అలవాటు. అలాగే నన్నూ ‘పోలీసులు ట్రేస్ చేశారమ్మా సుబ్బూ. ఇది వాళ్ల పనేనని తేలిందట’ అన్నారు.
కోడెల.. ఎన్టీఆర్, బాబు మంత్రివర్గాల్లో పనిచేసిన నాటి నుంచి మొన్నటి స్పీకర్ వరకూ నియోజకవర్గంలో ఎవరేమనుకుంటున్నారు? అని తనకు సన్నిహితంగా ఉండే విలేకరుల వద్ద ఆరా తీసేవారు. ఏదైనా ఘటన జరిగితే ఎలా వ్యవహరిస్తే బాగుంటుదని సలహా తీసుకునేవారు. అంటే సమాచార సేకరణలో ముందుండే వారన్న మాట.
2001 లేదా 2002లో అనుకుంటా.. నేను ఆయన విధానాలు, వ్యవహారశైలికి సంబంధించి అనేక వ్యతిరేక వార్తలు రాశా. మన ఊరు వాడైనా ఎందుకిలా రాస్తున్నాడని ఆయనకు సన్నిహితుడైన ఓ సీనియర్ విలేకరి వద్ద వాపోయారట. ఓసారి ఆసుపత్రిలో ఓ విలేకరిపై జరిగిన దాడిలో కోడెల హస్తం ఉందని పెద్ద గొడవ జరిగింది. జర్నలిస్టు సంఘ నేతలు కూడా హడావిడి చేశారు. కానీ నేను దానిపై స్వయంగా పరిశోధన చేసి, అందులో కోడెల తప్పు లేదని తెలుసుకుని, అప్పుడేం జరిగిందో ప్రత్యక్ష సాక్షుల వివరాలతో వార్తా కథనం రాశా. దానితో నా నైజం తెలుసుకుని, మళ్లీ పూర్వం మాదిరిగానే మాట్లాడారు.
ఆయన స్పీకర్ అయిప్పటి ముందు నాటి ఎన్నికల వరకూ నాయకత్వం నుంచి ఎన్నికల నిధులు తీసుకునేవారు కాదు. అలా టిడిపిలో నలుగురైదుగురు ఉండేవారనుకోండి. స్వదేశం, విదేశాల్లో ఉన్న ఆయన మిత్రులు, సొంత కులానికి చెందిన పారిశ్రామికవేత్తలు చందాలు ఇచ్చేవారు. ఆయన సహజంగా చాలా పొదుపరి. అట్టే డబ్బు పెద్దగా ఖర్చు పెట్టేవారు కాదు.
ఎన్టీఆర్, బాబు నాయకత్వంలో బాగా దూకుడుగా పనిచేసిన వ్యక్తి కోడెల. నా ఈ 26 ఏళ్ల జర్నలిస్టు జీవితంలో కోడెలకు సన్నిహితులైన జర్నలిస్టులలో ఒకడిగా ఆయనలో పిరికితనం ఎప్పుడూ చూడలేదు. చావుకు భయపడే నైజం ఆయనలో ఏనాడూ కనిపించదు. సీమ తర్వాత ఆ స్థాయి ఫ్యాక్షన్‌కు పెట్టింది పేరైన పల్నాడులో పట్టున్న ‘కాసు’ కోటకు బీటలు వారేలా పనిచేసిన ఆయన నిత్యం కాంగ్రెస్‌తో పోరాడేవారు. రాజకీయ ఎత్తు పై ఎత్తులు వేయడంలో నిష్ణాతుడు. తన సమర్థతను నాయకత్వానికి ఎప్పటికప్పుడు పలు రూపాలు, సంఘటనల ద్వారా నిరూపించుకున్నారు. అది ఎలాగో తెలుసాయనకు. ఒక సందర్భంలో నాయకత్వం తనకు ప్రాధాన్యం తగ్గించినా, కొంతకాలం మౌనం వహించి తన పనితీరు ద్వారా మళ్లీ మెయిన్‌స్ట్రీమ్‌కు వచ్చారు.
మంత్రులు, ఎమ్మెల్యేలుగా చేసిన పత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా, యరపతినేని సహా చాలామంది ఆయన స్కూలు విద్యార్ధులే. ఒకప్పుడు గుంటూరు జిల్లాలో ఆయన చెప్పిందే వేదం. అలాంటి కోడెల రాజకీయ జీవితంలో రెండు పర్యాయాల ఓటమి తర్వాత వచ్చిన సత్తెనపల్లి విజయం ఆయనలో ఆశ్చర్యకరమైన మార్పులు తెచ్చింది. చివరకు అదే ఆయన పతనానికి కారణమయింది.
కోడెల డాక్టర్ పాత్ర నుంచి పూర్తి స్థాయి రాజకీయ నేతగా రూపాంతరం చెందే వరకూ కార్యకర్తలు, ప్రజలు నేరుగా ఆయననే కలిసేవారు. వారి బాధలు విన్న తర్వాత, సంబంధిత వ్యక్తులతో ఆయనే స్వయంగా మాట్లాడేవారు. దానితో కోడెల కోసం ప్రాణాలిచ్చే వారి సంఖ్య కూడా అప్పట్లో బాగా ఉండేది. హైదరాబాద్ లోని దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, సనత్‌నగర్ వంటి ప్రాంతాల్లో కోడెల అభిమాన సంఘాలు కూడా పుట్టాయంటే ఆయన ఇమేజ్ ఏ స్థాయిలో ఉండేదో ఊహించుకోవచ్చు. అది ఒక్క రాత్రిలో వచ్చింది కాదు.
సత్తెనపల్లి ఎమ్మెల్యేగా అత్యల్ప మెజారిటీతో అంబటి రాంబాబుపై గెలిచిన తర్వాత కోడెల తీరు, తెన్నూ పూర్తిగా మారిపోయాయి. రాష్ట్ర తొలి స్పీకర్ అయిన కొత్తలో ఇంకా హైదరాబాద్‌లోనే ఉన్న అసెంబ్లీకి మీడియా సలహా సంఘం కమిటీలు వేశారు. అప్పుడు ఆయన తన ఊరు వాడన్న అభిమానంతో, నేను అడక్కపోయినా నన్ను ఆ కమిటీకి సెక్రటరీని చేశారు.
ఆ సమయంలోనే తనయుడు శివరాం మీద ఆరోపణలు రావడం ప్రారంభించాయి. నా దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను ఉదాహరణలతో ఆయన దృష్టికి తీసుకువెళ్లా. వాటిని కోడెల తేలిగ్గా కొట్టిపారేస్తూ ఇవన్నీ సహజమనేవారు. సత్తెనపల్లి వద్ద రైల్వే లైను పనుల్లో కాంట్రాక్టరును శివరాం బెదిరించారన్న వార్త చివరకు పీఎంఓ వరకూ వెళ్లింది. మీకు చెడ్డపేరు వస్తుందని చివరగా చేసిన హెచ్చరిక లాంటి సలహాపై ఆయనోసారి నాపై అసహనం కూడా ప్రదర్శించారు.
అంతకుముందు నేరుగా కార్యకర్తలతో మాట్లాడే అలవాటున్న కోడెల.. సత్తెనపల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ‘పెదబాబును కలవండ’ని చెప్పడంతో ఆయన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠ పతనం మొదలయింది. తనయుడు ప్రతి దానికీ ఒక రేటు నిర్ణయిస్తారని, చేయి తడపనిదే పని చేయరన్న అప్రతిష్ట మూట కట్టుకున్నారు. చివరకు ఆ అపఖ్యాతి ఎంతవరకూ విస్తరించిందంటే అమెరికాలో జరిగే తానా, ఆటా సభల్లోనూ ఆయన తనయుడి వ్యవహారం చర్చలకొచ్చేది. అంతవరకూ ఎందుకు? రాజకీయాలు పెద్దగా తెలియని శ్రీకాకుళం మహిళా ఎమ్మెల్యే ఒకరు అసెంబ్లీలో నన్ను ఆపి ‘మీ డాక్టర్ గారబ్బాయి చాలా ఘటికుడంట కదా’ అని ప్రశ్నించేవరకూ వెళ్లిందంటే.. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి పోగుచేసుకున్న కోడెల పరువు ఎంత వేగంగా దిగజారిందో అర్ధమవుతుంది.
నర్సరావుపేట-సత్తెనపల్లి నియోజకవర్గాలను కొడుకు-కూతురుకు అప్పగించడంతో కోడెల రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్ఠ శరవేగంగా దిగజారి, చివరకు కోడెల ఆత్మహత్యకు పాల్పడే విషాదం వరకూ తీసుకువెళ్లడం బాధాకరం. వెంకట్ అని ఓ కుర్రాడు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ నడిపే వెంకట్ అనే ఓ ఎస్టీ కుర్రాడు. అతను గతంలో నాకు నేరుగా తెలియదు. గతంలో నేను పనిచేసిన పత్రికలో పనిచేసిన కాటూరి శ్రీనివాసరావు అనే గ్రామీణ విలేకరి ద్వారా పరిచయం.
వెంకట్ అనే ఆ కుర్రాడికొచ్చిన కష్టం ఒకటి విచిత్రంగా అనిపించింది. అతని ఏజెన్సీకి సత్తెనపల్లి మున్సిపాలిటీలో ఆన్లైన్ టెండరు ద్వారా ఏజెన్సీ ఖరారయింది. కానీ అధికారులేమో పెదబాబు చెబితేనే ఇస్తామంటారు. ఈ కుర్రాడేమో నేరుగా ఈ-టెండరు వేశాడాయె. దానితో టెండరు రద్దు చేశారు.
మళ్లీ ఈ టెండరు పిలిచినా అతనికే వచ్చింది. ఈసారి కూడా రద్దు చేసిన పరిస్థితిని నాకు వివరించారు. దానితో కోడెలకు విషయం వివరిస్తే, ఆయన పెదబాబును కలవమని సలహా ఇచ్చారు. ఆ ప్రకారం గుంటూరులోని షోరూముకు వెళ్లి గంటల తరబడి వేచి ఉన్న సదరు కుర్రాడి ని లెక్కచేయకుండా పెదబాబు పంపించారట. ఆవిధంగా నా మిత్రుడి కోసం వెళ్లిన నాకు ఎదురైన ఓ పరాభవం లాంటి చిన్న అనుభవం. ఇలాంటివి మామూలేనని తర్వాత తేలిందనుకోండి. అది వేరే విషయం.
టిడిపి అధికారంలో ఉన్న సమయంలో ఉద్యోగాలిస్తామని, కాంట్రాక్టులు ఇప్పిస్తామని చెప్పి.. అనేకమంది వద్ద లక్షల్లో వసూలు చేశారంటూ కొడుకు, కూతురిపై నమోదైన దాదాపు 26 కేసులు కోడెల రాజకీయ జీవితాన్ని వెక్కిరించినట్లు చేశాయి. ఫిర్యాదుదారులలో సొంత పార్టీ వారే ఎక్కువగా ఉండటంతో కోడెల కష్టపడి పెంచుకున్న ప్రతిష్ఠ పూర్తిగా దెబ్బతింది. కోడెల తొలుత తన కుమారుడిని హెచ్చరించిన సందర్భంలో.. తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించగా, అప్పటికే రోడ్డు ప్రమాదంలో ఓ కొడుకుని పొగొట్టుకున్న కోడెల.. చివరకు కొడుకును వదిలేశారన్న వార్తలు అప్పట్లో కోడెల సన్నిహితుల వద్ద వినిపించేవి.
తాజాగా రాష్ట్ర అసెంబ్లీ విడిపోయినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చిన ఫర్నీచరును కోడెల తన నివాసానికి తరలించారని నమోదైన ఫిర్యాదుతో కోడెల పరువు ప్రతిష్ఠ పూర్తిగా దిగజారిపోయింది. దానిని సహజంగానే అధికార వైసీపీ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని, విమర్శలు సంధించడంతో అటు పార్టీ నాయకత్వం కూడా ఇబ్బందిపడాల్సి వచ్చింది.
గతంలో కోడెలపై రాజకీయ ప్రత్యర్ధులు చిన్న విమర్శ చేస్తేనే మూకుమ్మడి ఎదురుదాడి చేసే ఆయన వర్గీయులు, సహచరులు ఆ సమయంలో మీడియా ముందుకొచ్చి ఖండించే సాహసం కూడా చేయలేకపోయారు.
తాను పార్టీ ఆఫీసుకు వస్తే పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందన్న భావన కోడెల వరకూ తెలియడం, సొంత నియోజకవర్గంలో తాను పెంచి పోషించిన నేతలే కష్టాల్లో దరికి రాకపోవడంతో, బయటకు రావడమే మానేసిన కోడెల మానసిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.
గత రెండు నెలల నుంచి వైసీపీ తనను మానసికంగా, రాజకీయంగా హింసిస్తోందని కోడెల చాలామంది వద్ద వాపోయారు. తన కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తోందని, వైఎస్ జమానాలో కూడా ఇలాంటి రాజకీయాలు తాను చూడలేదని చెప్పేవారు. ఇంటా బయట ఎదురవుతున్న అవమానాలు, తన వారసుల ‘స్థాయి తక్కువ పనుల’ నిర్వాకం, అధికార పార్టీ రాజకీయ వ్యూహాలకు ఉక్కిరిబిక్కిరయిన కోడెల తన జీవితాన్ని తానే ముగించుకోవలసి రావడం విషాదం, అత్యంత బాధాకరం!
కోడెల జీవితం ఈవిధంగా విషాదాంతం కావడానికి దారితీసిన పరిస్థితులు నేటి చివరి తరం నేతలయిన తండ్రులకు ఓ హెచ్చరిక. కొడుకులు, కూతుళ్లను తాము జీవించి ఉండగానే ఉన్నత పదవుల్లో చూడాలన్న ఆశను.. వారసులు చిదిమేసి, చివరకు తండ్రులనే బందీలను చేసినందుకు వేదన అనుభవంచి, ఆత్మహత్యలకు పాల్పడే దౌర్భాగ్యానికి సొంతంగా బాటలు వేసుకోవడం అవసరమా? అన్నది తండ్రులు తేల్చుకోవాలి. రాజాకాశి అని నా మిత్రుడు ఎప్పుడూ చెబుతుంటాడు. ప్రతి తండ్రీ ధృతరాష్ర్టుడేనని! చివరి తరం నేతలు ధృతరాష్ర్టులు కాకూడదన్నదే కోడెల ఆత్మహత్య సందేశం!!