(బివి మూర్తి)
బెంగుళూరు: మైసూరు దసరా ఉత్సవాలకు పతాక సన్నివేశం జంబూ సవారీ. అంటే జమ్మి చెట్టు వరకు ఊరేగింపు. మైసూరులో చాముండీ కొండపై వెలసిన మహారాజుల ఇష్టదైవం చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని రాజభవనం నుంచి అయిదు కిలోమీటర్ల దూరంలోని బన్ని మంటపం దాకా ఊరేగింపుగా తీసుకు వెళ్తారు. శమీ వృక్షాన్ని తెలుగులో జమ్మి చెట్టని కన్నడంలో జంబూ వృక్ష అని పిలుస్తారు. జంబూ వృక్షం దాకా జరిగే ఊరేగింపు అయినందున అది జంబూ సవారీ అయింది. జంబూ వృక్షానికే కన్నడంలో మరో పేరు బన్ని మర. బన్ని మర ఉన్న మంటపం బన్ని మంటప.
జంబూ సవారీ గురించి తెలియని వారెవరూ ఉండరు గానీ అంతకంటే కొద్దిగా ముందు, జంబూ సవారీకి చాముండేశ్వరీ అమ్మవారి ఆమోదముద్ర కోరుతూ సమర్పించుకునే రక్తతర్పణం గురించి చాలా కొద్దిమందికే తెలిసే అవకాశం ఉంది.
అమ్మవారి ఊరేగింపునకు సర్వం సిద్ధమయ్యాక మైసూరు రాజప్రాసాదంలోని సవారి తొట్టిలో వజ్రముష్ఠి యుద్ధ విద్యా ప్రదర్శన జరుగుతుంది. కన్నడంలో వజ్రముష్ఠి కళగ అని పిలిచే ఈ పోటీలో రెండు జంటల మల్లయోధులు (జెట్టీలు) తలపడతారు. కుడిచేతి పిడికిలికి వజ్రం అనే ఆయుధాన్ని బిగించుకుని ఒకరి మీది కొకరు కలబడతారు. ఏనుగు దంతం లేదా దున్నపోతు కొమ్ముతో ఐదారు పదునైన ముళ్లు పైకి పొడుచుకుని వచ్చేలా వజ్రాన్ని ప్రత్యేకంగా తయారు చేస్తారు. చేతి వేళ్లకు దీన్ని తొడగడానికి వీలుగా కింది భాగంలో రంధ్రాలుంటాయి. రంధ్రంలోకి చేతి వేళ్లను దూర్చడమో, లేదా రంధ్రంలోకి గట్టిదారం దూర్చి వజ్రాన్ని వేళ్లకు బిగించడమో చేస్తారు. ఇంగ్లీషులో knuckle-duster గా వ్యవహరించే వజ్రముష్ఠి వంటి మారణాయుధాలను మన తెలుగు సినిమాల్లో హీరోలూ విలన్లూ ఇష్టారాజ్యంగా వాడుతుండటం మనం చూస్తుంటాం.
చాముండీ మాత ఎదుట ప్రత్యర్థుల ఘాతాల నుంచి తప్పించుకుంటూ ఒకర్నొకరు దెబ్బ తీసేలా సాగే రెండు జంటల జెట్టీల ద్వంద్వయుద్ధంలో ఒకటి రెండు నిమిషాలలోపే ఎవరో ఒకరికి వొంటి మీద వజ్రం దిగి రక్తం కారుతుంది. ఆ మరుక్షణమే రెఫరీలు యుద్ధాన్ని ఆపేస్తారు. దెబ్బ తిన్న జెట్టీ వొంటి మీద నుంచి కారే రక్తం నేల మీద చుక్క పడగానే రాజప్రాసాదం నుంచి మైసూరు మహారాజా వారు దిగి వచ్చి, జెట్టీలను సన్మానించి, చాముండేశ్వరీ దేవి హారతి స్వీకరించి జంబూ సవారీ ఊరేగింపును లాంఛనంగా ప్రారంభిస్తారు.
జెట్టీ కులస్థుల హక్కు
వజ్రముష్ఠి కళగలో పాల్గొని రక్తం చిందించడం జెట్టీ కులస్థుల సాంప్రదాయిక హక్కు. హొయసల రాజులు మైసూరును ఏలిన కాలంలో 11వ శతాబ్దంలో గుజరాత్ ప్రాంతం నుంచి జెట్టీలు వలస వచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. కుస్తీ, వజ్రముష్టి, మల్లయుద్ధం వంటి యుద్ధ విద్యల్లో ఆరితేరిన జెట్టీలు తొలుత విజయనగరానికి (హంపీ), హైదరలీ, టిప్పు సుల్తాన్, వడయార్ వంశస్థులు యుద్ద విద్యలకిస్తున్న ప్రోత్సాహం కారణంగా తర్వాత మైసూరు ప్రాంతానికి వలస వచ్చినట్టు కూడా చారిత్రకాధారాలున్నాయి. ఇప్పటికీ మైసూరు, చామరాజనగర, చన్నపట్టణ, బెంగుళూరు ప్రాంతాల్లో అక్కడక్కడా జెట్టీ కులస్థులున్నారు. వీళ్లలో నుంచే ప్రతి ఏడాదీ దసరా వజ్రముష్ఠి కళగలో పాల్గొనడానికై నలుగురు జెట్టీలను ప్రత్యేక కమిటీ ఎంపిక చేస్తుంది. వొంటి మీద కేవలం చెడ్డీలు ధరించి, పిలక మాత్రం ఉంచుకుని తలను గుండు గొరిగించుకుని, నుదుట, భుజాల మీద పెద్ద పెద్ద నామాలు పెట్టుకున్న జెట్టీలు గోదాలోకి దిగి ప్రత్యర్థి తల మీద కొట్టడానికి ప్రయత్నిస్తూ అరుస్తూ తలపడతారు.
పదహారాణాల తెలంగాణ ‘బాపూజీ’ ఎవరో తెలుసా?
సుసంపన్నమైన మైసూరు సాంస్కృతిక వైభవానికి మూలపురుషుడుగా భావించే 22వ రాజు ముమ్మడి కృష్ణరాజ వడయార్ కాలంలో (1799-1868) ప్రఖ్యాతుడైన రామ జట్టప్ప అనే వస్తాదు వజ్రముష్ఠి కళగకు ఆద్యుడనీ, రాజు ప్రోత్సాహంతో ఆ యుద్ధ విద్యను ప్రాచుర్యంలోకి తెచ్చాడని మైసూరు సంస్థానం చారిత్రక పత్రాల్లో పేర్కొన్నారు. ఆనాడు జనం నోళ్లలో నానిన “ ఆకాశక్కె ఏణి ఇల్ల, రామజట్టప్పంగె కుస్తీలి సాటి ఇల్ల (ఆకాశానికి నిచ్చెన లేదు. రామ జట్టప్పకు కుస్తీలో సాటి లేదు)’’ అనే నినాదం రామ జట్టప్ప కున్న పేరు ప్రఖ్యాతులకు, కుస్తీకి ఉన్న జనాదరణకు అద్దం పడుతున్నది.
అంగరంగ వైభోగం
మైసూరు మహారాజ వంశం వడయార్ల పరిపాలన ఆరంభ కాలం నుంచి అనూచానంగా కొనసాగుతున్న సాంస్కృతిక సంప్రదాయాలను, అలనాటి పాలనా వైభవాన్ని కళ్లకు కట్టేలా అంగరంగవైభోగంగా సాగే జంబూ సవారీని కళ్లారా చూసి ఆనందించాలే తప్ప వర్ణించడానికి మాటలు చాలవు. పది రోజుల ఉత్సవాల్లో వారి వారి అభిరుచిని బట్టి ఎవరెవరికి ఏం కావాలో అన్నీ ఉంటాయి. సంగీతం, కవిత్వం, చిత్రలేఖనాది లలితకళలకు ప్రత్యేకమైన వేదికలు, అత్యున్నత స్థాయి గోష్టులు, చర్చలు, ఇతర ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. కన్నడ నట సార్వభౌమ రాజ్ కుమార్ పాటలు మొదలుకొని పాశ్చాత్య సంగీతంలోని తాజా గొంతుకల దాకా యువదసరా వేదికలపై ప్రతిధ్వనిస్తాయి. వ్యవసాయరంగంలో కర్ణాటక సాధించిన, యావద్భారత దేశం సాధించిన ప్రగతిని రైతర దసరా ప్రతిఫలిస్తుంది. మహిళలు, పిల్లల కార్యక్రమాలూ, ఆహారమేళా, క్రీడోత్సవాలు, కుస్తీ పోటీలు, వగైరాల కోసం దాదాపు మూడు నెలల ముందు నుంచి అవిశ్రాంతంగా కృషి చేసే 16 సబ్ కమిటీలు అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ ఉత్సవాలు సాంతం సజావుగా పూర్తయ్యేలా జాగ్రత్త వహిస్తాయి.
రేప్ కేసులో స్వామి చిన్మయానంద్ అరెస్టు, ఇంతకీ ఎవరీ స్వామి చిన్మయానంద్ ?
క్రీడాకారులకైనా కళాకారులకైనా మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనడమే గొప్ప గౌరవం. ఇక బహుమతి గెల్చుకుంటే అదో వెల కట్టలేని గొప్ప యోగ్యతాపత్రం. అంలకరించిన ఏనుగులు, గుర్రాలు, ఒంటెల దళాలు, రాష్ట్రం, దేశం వివిధరంగాల్లో సాధించిన ప్రగతిని, సమకాలిక సామాజిక సందేశాలను ప్రతిఫలించే ప్రత్యేక శకటాలు, చిత్రవిచిత్రాకృతుల జానపద కళా, వాద్య, సంగీత బృందాలతో సర్వాలంకృతమై, సర్వవర్ణసంభరితంగా సాగే మైసూరు దసరా ఊరేగింపు జగత్ప్రసిద్ధం. ప్రపంచాన దాని కదే సాటి.
విస్తృత ఏర్పాట్లు
ఈ సారి సెప్టెంబర్ 29 నుంచి ఆరంభమయ్యే మైసూరు దసరా ఉత్సవాలు అక్టోబర్ 8న జంబూ సవారీతో పూర్తవుతాయి. దేశం నలుమూలల నుంచి దసరా ఉత్సవాల కోసం తరలి వచ్చే పర్యాటకుల కోసం కెఎస్ ఆర్ టీసీ, కర్ణాటక పర్యాటక శాఖ, మైసూరు నగరపాలక సంస్థ విస్తృతంగా ఏర్పాట్లు చేశాయి. మైసూరు నగరంలోనూ, పరిసరాల్లోని పర్యాటక ప్రాంతాల సందర్శనకై ఆన్ లైన్ టూరిస్టు ఏజెన్సీలు కూడా వివిధ ప్యాకేజీలను విక్రయిస్తున్నాయి. నగరం, పరిసరాల్లోని దాదాపు పది విభిన్న కేంద్రాల్లో దసరా ఉత్సవాల ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి. వరుణ లేక్ లో జరిగే వాటర్ స్పోర్ట్స్, మ్యూజియం గ్రౌండ్స్ లో జరిగే హెరిటేజ్ దసరా, మానస గంగోత్రి ఆరుబయలు రంగస్థలంలో జరిగే యువ సంభ్రమ, నిషాద్ బాగ్, కుప్పన్న పార్క్ లో జరిగే పుష్పప్రదర్శన, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ గ్రౌండ్ లో జరిగే ఆహారమేళా, దేవరాజ్ అర్స్ మల్టీపర్పస్ స్టేడియంలో జరిగే కుస్తీపోటీలు ప్రధాన ఆకర్షణలు.