అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక కీలకమయిన నిర్ణయం ప్రకటించారు. ఇకనుంచి స్కూళ్లో టీచర్ల ఖాళీలను ప్రతి ఏడాది జనవరిలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ లో టీచర్ల నియామకాల మీద గత ప్రభుత్వాలు ఎపుడూ శద్ధ చూపలేదు. అదే విధంగా స్కూలు విద్యను మెరుగుపరచడం మీద కూడా నికరమయిన చర్యలెపుడూ తీసుకోలేదు. స్కూలు విద్య మెరుగుపడాలంటే టీచర్ల నియామకాలు అవసరమని గుర్తించడమే కాదు, వాటిని రెగ్యులర్ గా జరపాలని జగన్ నిర్ణయించడం ప్రభుత్వం పాఠశాలకు పిల్లలను పంపే తల్లితండ్రులకే కాదు, ఉపాద్యాయ శిక్షణ పొందిన నిరుద్యోగులకూ శభవార్తే.
అంతేకాదు, ఏ శాఖ నియామకాల పరీక్ష పెట్టాలన్నా అది జనవరిలో జరగాలని ఆయన అన్నారు. ఈ రోజు ఆయన ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల అభివృద్ధి గురించి అధికారులతో సమీక్షించారు. ఆయన సూచన తప్పక అమలవుతుందని ఆశిద్దాం.
ఈ సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ టీచర్లకు ఇచ్చే శిక్షణ ఇవ్వడం పై కూడా ప్రత్యేక దృష్టిపెట్టాలని జగన్ నొక్కి చెప్పారు.
నాడు– నేడు కింద 44,512 పాఠశాలలను బాగుచేయాలని మొదటి విడతలో 15410 స్కూళ్లలో అభివృద్ధి చేయాలని ఆయన చెప్పారు.
ముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే…
ఏ స్కూల్ తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తికావాలి. పాఠశాలల అభివృద్ధి కోసం చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలి, దాంట్లో రాజీపడవద్దు. మార్చి 14, 2020 నాటికి నాడు–నేడు కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తియాలి. బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలి. స్కూళ్లను అభివృద్ధిచేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలి. స్కూళ్ల బాగుకోసం క్యాంపెయిన్ చేపట్టాలి. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా చూడాలి.
ఇంగ్లీష్ మీడియం
వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన సాగి తీరాలి. దాని తర్వాత 9, 10 తరగతులకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన విస్తరింపచేయాలి. 70వేలమంది టీచర్లకు ఇంగ్లిషు బోధనలో శిక్షణ ఇవ్వాలి. డైట్స్లో ఇంగ్లిషు బోధనపై శిక్షణ ఇచ్చేలా, డైట్స్ను బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలి. పర్యావరణం, క్లైమేట్ ఛేంజ్, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ఉంచాలి.
పుస్తకాలు, యూనిఫారమ్స్, షూ, స్కూలు బ్యాగు ఇవన్నీకూడా వచ్చే ఏడాది స్కూల్లో చేరిన రోజే ఇచ్చి తీరాలి. ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళిక ఉండాలి.
ప్రయివేటు కాలేజీలు దారికి రావాలి
ప్రయివేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవమని, కాకపోతే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా? లేదా? అన్నది చూస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలో కూడా సరైన సదుపాయాలు ఉండాలి. అలా ఉన్నప్పుడు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు. కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా సంస్థ అయినా ఉండడం సరికాదు. ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుంది, ప్రయివేటు సంస్థలు చేయాల్సిన పనులు వాళ్లు చేయాలి.
ప్రతి మండలానికీ జూనియర్ కాలేజీ ఉండాలి.
ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్ టూ వరకూ పెంచాలి. జూనియర్ కాలేజీ స్థాయికి వీటిని తీసుకు వెళ్లాలి. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగుచేయడంపై ప్రణాళిక వేయాలి.