రైతు దేశంలో రైతుకి విలువ లేకుండా పోయింది. రైతు జీవితం ఖరీదు సినిమా టికెట్ కంటే చులకన అయిపోయింది. యూరియా కోసం క్యూలైన్ లో నిలబడి రైతు చనిపోవడం యాదృచ్ఛికం. సినిమా టికెట్ కోసం క్యూ లైన్ లో నిలబడి చనిపోతే సినిమా తీసినవాడిని అంటామా? మీటింగ్ కి వెళ్లి చనిపోతే మీటింగ్ నిర్వహించినవాడిని అంటామా? ఒక రైతు నాలుగు రోజులు ఎరువుల కోసం 4 రోజులు క్యూ లైన్లో నిలబడి చనిపోతే… సాక్షాత్తూ వ్యవసాయ మంత్రిగారు చేసిన వ్యాఖ్యలు ఇవి. ఆయన చేసిన వ్యాఖ్యలు రైతులకే కాదు రైతు పండించే మెతుకులు తింటున్న ప్రతివాడికి చిర్రెత్తుకొచ్చేలా ఉన్నాయి. ఈ వ్యవహారంపై పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.
రెండు బస్తాల యూరియా కోసం దుబ్బాక కు చెందిన రైతు ఎరువుల కేంద్రం వద్ద నాలుగు రోజులు పడిగాపులు కాసాడు. కానీ ప్రయోజనం లేకుండా పోయింది. క్యూలైన్ లోనే సొమ్మసిల్లిపడిపోయాడు. మరికొంతసేపటికే ప్రాణాలు వదిలాడు. ఈ విషయంపై హైదరాబాద్ అగ్రిటెక్ సదస్సులో స్పందించిన వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందరికి ఆగ్రహం తెప్పించేవిగా ఉన్నాయి.
యూరియా క్యూలైన్లను సినిమా టికెట్ల క్యూలైన్లతో పోల్చారు. రైతుల బాధ ఆ పెద్దమనిషికి పెద్దగా పట్టినట్టు లేదు. రైతు మృతి యాదృచ్చికం అంటూ చాలా లైట్ గా తేల్చేసారు. ఆయన మృతితో నాకేంటి సంబంధం? వ్యవసాయశాఖ తప్పేమి లేదని ఇండైరెక్ట్ గా చెప్పేసారు. దీనిపై అన్నదాతలు గుర్రుగా ఉన్నారు.
ఆ మంత్రి గారు తనకున్న పాలనాపరమైన గొప్పతనం, అపార అనుభవంతో యూరియా సరఫరాను కూడా బ్లాక్ బస్టర్ సినిమా అంత గొప్పగా తయారు చేశారు. మరి సినిమా టికెట్ల వేటలో అభిమాని చనిపోతే ఆ హీరో కానీ, సినిమా యూనిట్ కానీ అయ్యో పాపం అని స్పందించి ఎంతో కొంత సానుభూతి చూపి, కొంత సాయం చేస్తారు. కానీ ప్రజల చేత ఎన్నికై, ప్రజల కోసం పాలన సాగిస్తానని ప్రతిజ్ఞ చేసిన మంత్రి గారు అధికారం దక్కిన వెంటనే నహుషుడుగా మారాడనుకుంటా. నహుషుడి గురించి చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా అంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజెన్లు.