తెలుగు భాషను,చదువును ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ లో ఊరూర గ్రంథాలయం నిర్మించాలని ప్రముఖ రచయిత, కేంద్ర సాహిత్య యువపురస్కార గ్రహీత డాక్టర్ అప్పిరెడ్డి హరినాథ రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
ఈ రోజు ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాస్తూ తెలుగుభాషాభివృధ్ది రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాల గురించి ప్రస్తావించారు.
ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యవర్గం వెంటనే నియమించాలని, ప్రతి గ్రామంలో గ్రంథాలయం నిర్మించి, తెలుగు పుస్తకాలను అందుబాటులోకి తీసుకొని రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
డాక్టర్ హరినాథ్ రెడ్డి అనంతపురం లో వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రాన్ని కూడా నిర్వహిస్తున్నారు.
ఆయన లేఖలోపేర్కొన్న విశేషాలు:
శ్రీ గిడుగు వేంకట రామమూర్తి పంతులు గారి జయంతి అయిన రోజైన ఆగష్టు 29 వ తేదిని తెలుగు భాషా దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి గత కొన్నేళ్ళుగా కార్యక్రమాలు కొనసాగిస్తుంది. ఈ సందర్భంగా తెలుగు భాష ,సంస్కృతుల విషయంగా రాష్ట్రంలో చేపట్టవలసిన కింది అంశాలను పరిశీలించి కార్యచరణ చేపట్టాలి.
1. తెలుగుభాష ప్రాచీన హోదా పొందినప్పటికీ , కార్యాలయ కేంద్రస్థానం కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు లో కొనసాగుతుంది. నిధులు పుష్కలంగా ఉండికూడా పూర్తి స్థాయిలో వినియోగించు కోలేని పరిస్థితి ఉంది. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో తెలుగు ప్రాచీన అధ్యయన కేంద్రాన్ని తెలుగు రాష్టాలలో నెలకొల్పే విధంగా తగు చర్యలు తీసుకోవాలి.
2.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు తెలుగు మాధ్యమంలో కొనసాగించాలి. ఆంగ్లం ఒక అంశంగా కొసాగించాలి. గణితం,విజ్ఞాన, సాంఘీక శాస్త్రాల పాఠ్యపుస్తకాలలను తెలుగు మాధ్యమంలో కొనసాగిస్తు అందులోని ముఖ్య పదజాలన్ని పాఠ్యపుస్తకాలలో అనుబంధంగా ఆంగ్లంలో ఇచ్చి పరిచయం చేయవచ్చు. ఆరవ తరగతి నుండి విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆలోచన మేరకు తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలను ఎంపిక చేసుకొనే స్వేచ్ఛను ఇవ్వాలి. వారికి అవసరమైన మాధ్యమంలో పాఠశాలలోచదివే అవకాశం ఉండాలి. ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యలలోను ఒక అంశంగా తెలుగు ఉండాలి.
3. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహిస్తున్న అన్ని పరీక్షలను కూడా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల లాగా ప్రశ్నాపత్రాలు తెలుగులో ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని జాతీయ స్థాయి పరీక్షలు తెలుగు భాషలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి.
4. పదవతరగతి వరకు తెలుగు ప్రథమ భాషగా చదివి ఇంటర్ లో సంస్కృతం తీసుకొనే వెసులుబాటును రద్దు చేసి తెలుగు చదివే విధంగా చర్యలు తీసుకోవాలి.
5. ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘాన్ని మరింత పటిష్ఠం చేసి అధికారాలు కల్పించాలి. అన్ని ప్రభుత్వ శాఖలలో అధికార బవాషగా తెలుగు అమలుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలి.
6.నూతన మంత్రిమండలిలో భాషా మంత్రిత్వ శాఖను కేటాయించి నిధులు సమకూర్చాలి.
7. పాఠశాలలో తెలుగు పండితుల పదోన్నతుల విషయంగా ప్రాధాన్యత కల్పించాలి. విశ్వవిద్యాలయాల తెలుగు శాఖలను పటిష్ఠం చేయాలి.
8. 2017 లో రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక సంబంధమైన ఏడు అకాడమీ లను నెలకొల్పుతూ ఉత్తర్వులు ఇచ్చింది. సాహిత్య, సంగీత నృత్య, నాటక, దృశ్యకళాత్మకత, జానపద, చరిత్ర, శాస్త్ర సాంకేతిక అకాడమీలకు కార్యనిర్వాహక వర్గాలను నియమించాలి. అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిథ్యం వహించేలా కార్యవర్గం ఎంపిక చేయాలి. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం కార్యవర్గం నియమించాలి. ప్రతి గ్రామంలో గ్రంథాలయం నిర్మించి, తెలుగు పుస్తకాలను అందుబాటులోకి తీసుకొని రావసలి.
9. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం, తాళప్రతుల సంస్థ, రాతప్రతుల సంస్థ, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, నేషనల్ బుక్ ట్రస్ట్ తదితర సంస్థలను పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ లోను నెలకొల్పేవిధంగా చర్యలు తీసుకోవాలి.
10. ఇతర రాష్ట్రాలు, దేశాలలోని తెలుగు ప్రజల భాషా, సాంస్కృతిక సమస్యల పరిష్కారానికి చేదోడుగా నిలవాలి.
(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి,కేంద్ర సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత,వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం. అనంతపురము.చరవాణి: 99639 17187,Email: a.harireddy@gmail.com)