ఫోక్స్ వ్యాగన్ కేసును అంతా మర్చిపోయారు. దాదాపు 15 సంవత్సరాల కిందట, వైఎస్ ఆర్ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటుచేసిన సంవత్సరంలో ఎదురయిన ముడుపుల కేసు.
ఈ కేసేమిటో చాలా మందికి పెద్దగా తెలియదు. ఇలాంటి కేసును దుమ్ము దులిపి విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్ మంత్రి బోత్స సత్యనారాయణకు హైదరాబాద్ సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఏదైనా మతలబు ఉందా?
ఎందుకంటే, తనకు ఈ కేసులో సిబిఐ ఎపుడో క్లీన్ చిట్ ఇచ్చిందని ఆయన చెప్పుకున్నారు. ఇది నిజమేనేమో అనుకునేలా ఆ తర్వాత ఎవరూ ఈ కేసు గురించి మాట్లాడలేదు.
వచ్చే నెల 12న సీబీఐ కోర్టుకు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆయన ఆదేశాలు జారీ చేసింది.
2004లో రాజశేఖర్ రెడ్డి అఖండ విజయంతో ప్రభుత్వం ఏర్పాటుచేసినపుడు బోత్స పరిశ్రమల శాఖ మంత్రి. అపుడు విశాఖలో 500 ఎకరాలలో ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఒక కార్ల ఫ్యాకర్టీ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ఆమేరకు అంతకుముందున్న తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఫోక్ష వ్యాగన్ కు ఒక ఒప్పందం కుదిరింది.
ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవెలప్ మెంట్ కార్పరేషన్ తో ఫోక్స్ వ్యాగన్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది.
తర్వాత వైఎస్ ఆర్ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని గౌవరించింది. ఈ మేరకు కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటుచేసేందుకు తన కూడా వాటా దారుగా చేరాలనుకుంది. దీనికోసం రు. 11 కోట్ల రుపాయలను వశిష్ట వాహన్ అనేసంస్థకు తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. అయితే, వశిష్టవాగన్ కు తమకు సంబంధం లేదని ఫోక్స్ వ్యాగన్ ప్రకటించడంతో కథ తారుమారయింది.
ఈ డబ్బులు విశిష్ట వాగన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రముఖులకు వెనక్కువచ్చాయని ఆరోపణలొచ్చాయి. ఇందులో ప్రముఖంగా వినిపించిన పేరు పరిశ్రమ ల శాఖ మంత్రిగా ఉన్న బోత్సాదే.
ఈ గొడవ జరుగుతున్నపుడు వ్యవహారాన్ని వైఎస్ ఆర్ సిబిఐకి అప్పగించారు. అయితే, బోత్సాను క్యాబినెట్ నుంచి పీకేయాలని పెద్ద గొడవ జరిగింది. అయితే, అన్నీ తెలిసిన ముఖ్యమంత్రి ఆ పనిచేయకుండా బోత్సాను మార్కెటింగ్ శాఖకు మార్చారు. దీని మీద కూడా నిరసన మొదలయింది.
ముడుపులు తిన్నాడన్న అనుమానం ఉన్న బోత్సాను మంత్రి పదవినుంచి ఎందుకు తప్పించలేదో ఇప్పటికీ అర్థం కాదు. తర్వాత బోత్సాకు 2010లో సిబిఐక్లీన్ చిట్ ఇచ్చిందని చెబుతారు. అంతే ఆయన మీద అపవాదు తొలగిపోయింది.
కథ కంచికిపోయింది.కేసు సిబిఐ ఫైళ్ల లో ఉండిపోయింది.
ఇపుడు సడన్ గా బోత్సకు సిబిఐ కోర్టు నోటీసులిచ్చింది. ఈ కేసులో ఫోక్స్ వ్యాగన్ సీనియర్ అధికారి హెల్మట్ షూస్టర్, భారత ప్రతినిధి అశోక్ కుమార్ జైన్, వశిష్ట వాహన్ డైరెక్టర్లు జగదీష్ అలగ్ రాజా, గాయత్రీ రాయ్, వికె చతుర్కవేది అనే వాళ్లు నిందితులుగా ఉన్నారు.
కేసులో క్లీన్ చిట్ తెచ్చుకున్న బోత్సాకు నోటీలుంటే… కథ మళ్లా మొదటి కొచ్చిందా. ఇపుడు సిబిఐ చాలా యాక్టివ్ గా పని చేస్తూ ఉంది. ఇందులో బోత్సాకుకొత్త కష్టాలొస్తాయా లేక మరొక సారి క్లీన్ చిట్ తెచ్చుకుంటారా చూడాలి…