“చుట్టూ నీళ్లున్నా తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకని దుస్థితి సముద్రంలో ఉన్ననావికుడిది. ప్రస్తుతం రాయలసీమ దుస్థితి కూడా అలాగే ఉంది.” లక్షలాది క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నా సీమవాసులకు కానీ రెండు రాష్ట్రాలలోని కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు కానీ సరిపడినంత సాగు, తాగునీరు ఇవ్వలేని స్థితిలో రాజకీయ అధికార వ్యవస్థలు ఉన్నాయని రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి ముఖ్యమంత్రికి, ఇతర మంత్రులకు పంపిన వినతి పత్రంలో ఆవేదన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో – సమగ్ర నీటి వనరుల వినియోగం అన్న అంశంపై తిరుపతి లో ఆగష్టు 12 న జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చేసిన తీర్మానాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలోని అన్నిప్రాంతాలకు, ప్రత్యేకించి కరువు ప్రాంతాలను రక్షించడానికి చర్యలు వెంటనే చేపట్టాలని ఆయన ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం జల విద్యుత్ ప్రాజెక్టుగా ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ను వెంటనే సాగునీటి ప్రాజెక్టుగా మార్చాలని, ఈ ప్రాజెక్టును రాయలసీమలోని నాలుగు జిల్లాలకు , ప్రకాశం, నెల్లూరు, మరియు దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల త్రాగు, సాగునీటి వినియోగానికే కేటాయించాలని సమావేశం తీర్మానించిందని ఆయన ఆ లేఖలో వివరించారు.
రాష్ట్ర విభజన సమయానికి నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించి, విభజన చట్టం షెడ్యూల్ 11 లో చేర్చిన హంద్రీ-నీవా, గాలేరు -నగరి, తెలుగుగంగ, వెలిగొండ, తెలంగాణాలోని కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులు ఇప్పటి వరకు 2014 నాటి స్థితిలోనే ఉన్నాయని, ఈ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టి, నిధులు కేటాయించి పూర్తి చేయాలని సమావేశం కోరింది.
అత్యంత కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమలోని కర్నూల్, అనంతపూర్, కడప, చిత్తూర్ జిల్లాలలోని మెట్ట ప్రాంతాలలో కనీసం 30 లక్షల ఎకరాలకు పైగా సాగుకు యోగ్యమైన భూమి ఉండి కూడా ప్రజలు దుర్భర దారిద్య్రం అనుభవిస్తున్నారు.
ఈ మెట్ట ప్రాంతాలను ఆదుకోడానికి ఏర్పాటు చేసిన “హంద్రీ- నీవా” ప్రస్తుతం 3350 క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించారు. అయితే 2300 క్యూసెక్కుల నీటిని పంపింగ్ చేసినా కాల్వలు భరించడం లేదు. ఆశించిన ఫలితం దక్కడం లేదు.
అందువల్ల ఈ భూములకు ఒక్క ఆరుతడి పంటకు నీళ్లివ్వడానికి, ప్రజలకు త్రాగునీటి కొరత శాశ్వతంగా తీర్చడానికి “హంద్రీ-నీవా” ప్రాజెక్ట్ పంపింగ్ మరియు కాలువ సామర్థ్యాన్ని కనీసం 22000 వేల క్యూసెక్కులకు పెంచాలని, ఈ నీటితో ఆయా ప్రాంతాలలోని చెరువులు, కుంటలు నింపడానికి చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది
శ్రీశైలం కుడి ప్రధాన కాలువ (SRMC) మరియు పోతిరెడ్డిపాడు గేట్లు ప్రస్తుతం (ముందున్న గేట్లతో కలసి)55,000 వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. అయితే ఏర్పాటు చేసిన కాల్వ సామర్థ్యం మాత్రం కేవలం 28,000 క్యూసెక్కులే. పైగా వరద సమయం కూడా నానాటికి తగ్గుతున్నది. అందువల్ల ఈ కాల్వ సామర్త్యాన్ని, గేట్ల సామర్త్యాన్ని ప్రస్తుతం ఉన్న 28000/55000 నుండి 75000 వేల క్యూసెక్కుల కు పెంచాలని సమావేశం కోరింది.
అలాగే బ్రిటీష్ కాలంలో ఒక వెలుగు వెలిగిన K.C.కెనాల్ ఆయకట్టుకు పూర్వ వైభవం తేవడానికి 2014 లో 20 TMC ల సామర్ధ్యంతో ప్రతిపాదించిన “గుండ్రేవుల రిజర్వాయర్” నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలి.
అలాగే, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువలకు కేటాయించిన నీటిని పూర్తిగా వినియోగించుకునేలా స్థిరీకరణ ప్రాజెక్టులు చేపట్టాలని, తుంగభద్ర ఎగువ సమాంతర కాలువ నిర్మాణం, వేదవతి నదిపై ఎత్తిపోతల నిర్మాణాలను తక్షణమే చేపట్టి తుంగభద్ర ద్వారా మన రాష్ట్రానికి కేటాయించిన నీటిని సక్రమంగా తీసుకోవడానికి చర్యలు తీసుకోవాలని సమావేశం కోరింది.
కుందూ వరద నీటిని వినియోగించుకునేందుకై గతంలో మంజూరైన జోలదరాశి, రాజోలి ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని, కృష్ణానది మేనేజ్మెంట్ బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలని సమావేశం తీర్మానించింది.
“రాయలసీమకు ప్రత్యేక సాగునీటి కమీషన్” ను చట్టబద్దమైన అధికారాలతో ఏర్పాటు చేసి, తగినన్ని నిధులు కేటాయించి రాయలసీమలో ఉన్న చెరువులు, కుంటలు పునరుద్ధరించి, ప్రస్తుతం చేపట్టిన పెద్ద ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటితో వాటిని నింపాలని సమావేశం కోరింది.
కృష్ణా- గోదావరి జలాల వినియోగ విషయంలో రెండు రాష్టాల ముఖ్యమంత్రుల మద్య జరుగుతున్న చర్చలను సమావేశం స్వాగతించింది.
ఒప్పందాలను కుదుర్చుకోవడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, రెండు రాష్ట్రాల మధ్య కుదురుతున్న ఒప్పందాలను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు సమర్పించి, ఆమోదింప చేసుకొని, ఆ ఒప్పందాలకు ట్రిబ్యునల్ ద్వారా చట్టబద్ధత కల్పించాలని సమావేశం తీర్మానించింది.
ఈ సమావేశంలో అఖిలభారత రైతు సంఘం (సీ.పి.ఐ) ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, రైతాంగ సమాఖ్య అధ్యక్షులు ఎర్నేని నాగేంద్రనాథ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాధం, భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, లోక్ సత్తా రాష్ట్ర నాయకులు బాల సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (సిపిఎం) నాయకులు నారాయణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షులు మాగంటి గోపాల్ రెడ్డి, రాయలసీమ కార్మిక కర్షక కార్యాచరణ సమితి అధ్యక్షులు సి హెచ్ చంద్రశేఖర్ రెడ్డి, రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షులు భూమన్, రాయలసీమ సాగునీటి సాధన సమితి చిత్తూరు జిల్లా కో కన్వీనర్ ప్రొఫెసర్ సుబ్రహ్మణ్య రెడ్డి, రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ అరుణ్, బి సి సంక్షేమ సంఘం నాయకులు నక్కలమిట్ట శ్రీనివాసులు, అట్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, అనంతపురం జలసాధన సమితి నాయకులు రాంకుమార్, ఒపిడిఆర్ నాయకులు శ్రీనీవాసులు, హంద్రీనీవా సాధన సమితి నాయకులు లోచర్ల విజయభాస్కర్ రెడ్డి, రాయలసీమ స్టూడెంట్ ఫోరం నాయకులు భాస్కర్, విద్యార్థి నాయకులు సీమకృష్ణ, అఖిల భారత రైతు సంఘాల నాయకులు పి.వి. రెడ్డి, ప్రొఫెసర్ రంగారెడ్డి, చైతన్య ఎన్ జి వొ నాయకులు గంగిరెడ్డి, నెల్లూరు జిల్లా రైతు నాయకులు కోటిరెడ్డి, నిరంజన్ రెడ్డి , రాయలసీమ సాగునీటి సాధన సమితి కడప జిల్లా కన్వీనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, సీనియర్ పాత్రికేయులు రాఘవ శర్మ, రమణయ్య, రాయలసీమలోని వివిధ ప్రజా సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో రాయచోటి నాగిరెడ్డి తీర్మానాలను ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఏకగ్రీవంగా ఆమోదించిన ఈ తీర్మానాలను ముఖ్యమంత్రి పరిశీలించి ఈ ప్రాంతాలకు న్యాయం చేయాలని దశరథరామిరెడ్డి కోరారు. తమకు సమయం కేటాయిస్తే తమగోడు వినిపిస్తామని ఆయన ముఖ్యమంత్రి ని కోరారు.