అమరావతి రాజధాని నిర్మాణంపై సమీక్ష చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం
రాజకీయాల కతీతంగా భావోద్వేగాలతో కాకుండా శ్రీభాగ్ ప్రాతిపదికన బాధ్యతకూడిన చర్చ జరగాలి.
మహానగరం- ఆంధ్రప్రదేశ్
మహనగరం ఒక కల మాత్రమే. రాజధాని అంటే పాలించే వారి ఆనందం , పేరు ప్రతిష్టల కోసం నిర్మించేది ఏమాత్రం కాదు. ఎందుకంటే ఇది రాజరికం కాదు ప్రజాస్వామ్యం.
విభజన అనంతరం ఏర్పడిన పూర్వ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని ఎంపిక చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది శ్రీభాగ్ ఒప్పందం. ఎందుకంటే దాని ప్రాతిపదికనే మద్రాసు నుంచి విడిపోయింది. అందులో ఉన్నది ప్రధానంగా అభివృద్ది వికేంద్రీకరణ. రాజధాని, హైకోర్టు ఒక చోట అవసరం లేదని స్పష్టంగా చెప్పారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉత్తరాంద్ర, రాయలసీమ, మధ్య కోస్తా ఉత్తర కోస్తాలుగా విభిన్నంగా ఉంటుంది. అందుకే కేంద్రీకృత అభివృద్ది అవసరం లేదు. మరో ముఖ్యమైన అంశం హైదరాబాదు పోలిన మహనగరం ఆలోచన సాధారణ ప్రజలకు ఉండవచ్చును కానీ పాలకులకు ఉండటం మంచిది కాదు.
ఇప్పటికే తిరుపతి, విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు లాంటి నగరాల జనాభా దాదాపు 5 లక్షలు పై మాటే. విశాఖ , విజయవాడ జనాభా మరింత ఎక్కువ. అంటే అరకోటి జనాబా గలిగిన నగరాలు అందుబాటులో ఉన్నాయి.
ఇవికాక దాదాపు నగరాల స్దాయి కలిగిన పట్టణాలు 15 పైగా ఉన్నాయి. వాటి జనాభా కూడా దాదాపు అరకోటి. పెద్ద సంఖ్యలో మున్సిపాలిటీలు, మండల కేంద్రాలు ఉన్నాయి. మొత్తంగా పరిసీలిస్తే ఏపీలో కొత్తగా మరో నగరాన్ని నిర్మించడానికి అనువైన వాతావరణం లేదు.
అలాంటిది ఏకంగా మహనగరాన్ని నిర్మించడానికి పూనుకోవడం తొందరపాటు చర్య అవుతుంది. స్వల్పకాలంలో మహనగరాలను నిర్మించలేము. ప్రపంచంలో కూడా ఆదర్శమైన అమెరికాకు రాజధాని వాషింగ్టన్ డీ సీ అయితే ఆ దేశ మహనగరం న్యూయార్క్. ఆ దేశంలోని ఒక రాష్ట్రం కాలిపోర్నీయా రాజధాని సాక్రమెంటో అయితే ఆ రాష్ట్రంలోని మహనగరం లాస్ ఏంజల్స్. అలాగే ఆస్ట్రేలియా రాజధాని కానబెర కాగా మహనగరాలు మాత్రం సిడ్నీ, మెల్ బోన్స్. విజయవాడ, తిరుపతి, విశాఖ అభివృద్ది చెందిన నగరాలు ఉన్నాయి. కొత్తగా మరో నగరాన్ని నిర్మించడం కన్నా అందుబాటులో ఉన్న నగరాలపై శ్రద్ధ పెట్టవచ్చు.
అమరావతి ఎంపిక –అభివృద్ది ఆందోళనకరం
అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రభుత్వం ఎంపిక చేసిన పద్ధతి బహుశా ప్రపంచంలోనే ఎక్కడా జరగనిరీతిలో జరిగింది. శ్రీభాగ్ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకోలేదు.
కేంద్రం నియమించిన శివరామక్రిష్ణన్ నివేదికను పరిసీలించక, తాను నియమించిన నారాయణ నివేదికలో ఏముంది అన్న అంశాలుపై చర్చ కూడా పెట్టకుండా ఏకపక్షంగా అమరావతిని కొన్ని గంటలలో ఎంపిక చేసినారు.
ప్రపంచంలో కనీస పరిశీలన చేయకుండా ఎంపిక చేసిన రాజధానిగా అమరావతి మిగిలిపోతుంది.
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆర్థికంగా మంచి స్దితిలో రాష్ట్రం లేదు. కేంద్రం నియమించిన కమిటిని అసలు పట్టించుకోలేదు. విభజన చట్టంలో రాజధాని మౌళిక వసతులు, సచివాలయం, హైకోర్టు, గవర్నర్ బంగ్లా లాంటివి కేంద్రం నిర్మించాలి. వాటి విషయంలో ఏనాడు కేంద్రాన్ని అడిగిన దాఖలాలు లేవు.
అనేక మంది నిపుణుల దృష్టిలో అమరావతి ప్రాంతం వరద ముంపుకు అవకాశం ఉన్న ప్రాంతం. గొప్ప నిర్మాణాలకు అనుకూలమైన ప్రాంతం కాదు. అక్కడ జరిగే నిర్మాణాలకు వ్యయం కూడా అదికంగా ఉంటుంది. కానీ గత ప్రభుత్వం మాత్రం ముందుకు సాగింది. ప్రభుత్వం దృష్టి మొత్తం అమరావతి వైపు కేంద్రీకృతం చేయడం వలన అబివృద్దికి అవకాశం ఉన్న తిరుపతి, విశాఖ కు తీవ్రనష్టం జరిగింది.
రాజకీయాలు నిజం చెప్పకపోయినా ప్రకృతి వాస్తవాలను చూపింది
ఇప్పటి వరకు రాజధాని అంశంపై రాజకీయ కోణం నుంచి చర్చ జరిగింది. నేడు ప్రకృతి అమరావతి ప్రాంతం పరిస్థితిని కళ్ళ ముందు ఉంచింది. రాష్ట్రంలో వరదలు రాలేదు. ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలకు రాజధాని ప్రాంతంలోకి నీరు చేరింది. అదే రాష్ట్రంలో వరదలు వచ్చి , కొండవీటివాగు పొంగి పొర్లిఉంటే ఎలా ఉంటుందో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది.
అందుకే నగర నిర్మాణాల పట్ల మంచి అవగాహణ కలిగిన శివరామక్రిష్ణన్ నివేదిక నేటి పరిస్దితులలో శిరోధార్యంగా కనిపిస్తుంది. అమరావతి విషయంలో మాదారి మాది అన్న వైఖరితో గత ప్రభుత్వం వెల్లింది.
అన్నిరకాల అంశాలను పరిగణనలోకి తీసుకుని నూతన ప్రభుత్వం శ్రీభాగ్ అవగాహన ప్రాతిపదికన ప్రజాస్వామ్య పద్దతిలో అందరితో చర్చ జరిపి కేంద్ర సూచనలను పరిగణలోకి తీసుకుని రాజధానిపై మంచి నిర్ణయం తీసుకోవాలని అలాంటి హేతుబద్ధమైన వైఖరితో ప్రభుత్వం ముందుకు వస్తే పార్టీలు , ప్రజలు సహకరించాలని రాయలసీమ మేధావుల ఫోరం కోరుతుంది.
చివరగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుద్దేశించి శివరామక్రిష్ణన్ చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగించడమే కాదు పాలకులను, ప్రజలను ఆలోచింప చేసేవిగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు నేటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంచి సలహా అవుతుంది.
“నాయుడి గారు ముందున్న ప్రధాన అంశం రాష్ట్ర సమతౌల్య అభివృద్ది. ఇప్పటికీ నాయుడుకి తన అడుగులు వెనుకకు తీసుకొనే అవకాశం ఉన్నది. ఒక చరిత్రలో నిలిచిపోయే రాజధాని నిర్మాణం ప్రధాన అంశం కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఆత్మహత్యా సాదృశ్యంగా రాష్ట్ర వనరులను శక్తిని రాజధాని ప్రాజెక్టు కోసం తాకట్టు పెట్టడమనేది ఈనాటి ప్రధాన అంశం ”