(మాకిరెడ్డి పురుషోత్తమరెడ్డి)
వరద జలాలను సీమకు విడుదల చేస్తేనే అంగీకరించని కేసీఆర్ గారితో కలిపి గోదావరి నీరు రాయలసీమకు తరలించి రతనాలసీమ చేస్తామంటే నమ్మేదెలా ?
కృష్ణలో నీటి లభ్యతకు పరిమితులు ఏర్పడిన పరిస్థితిలో అపారంగా లభిస్తున్న గోదావరి నీటిని ఎత్తిపోతల పథకం ద్వారా శ్రీశైలం ప్రాజెక్టులో నింపడం ద్వారా రాయలసీమ నీటి సమస్యకు పరిష్కారం చేస్తామని ఇంతకాలం కేసీఆర్ చెపుతున్న మాటలకు వారి ప్రభుత్వ అధికార నిర్ణయాలకు పొంతన కనబడటం లేదు.
రాయలసీమకు నీరు విడుదల చేయాలంటే పోతిరెడ్డిపాడు ద్వారానే సాధ్యం అవుతుంది. సీమజిల్లాలకు నీటి ముఖద్వారం పోతిరెడ్డిపాడు అని చెప్పవచ్చు.
శ్రీశైలం జలాశయం కనీస నీటిమట్టం 854 అడుగుల ఎత్తు నిర్వహణ ఉన్నపుడు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కు నీరు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి నీరు విడుదల చేసినపుడు రాయలసీమ నాలుగు జిల్లాలకు చెందిన గాలేరు నగరి , తెలుగుగంగ , కేసి కెనాల్ ద్వారా ప్రాజెక్టులకు నీరు అందుతుంది.
చెన్నై నగరానికి నీరు కూడా ఇక్కడి నుంచే. నేడు నెల్లూరు జిల్లా సోమశిల , కండలేరుకు కూడా ఇక్కడి నుంచి నీరు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉంటేనే హంద్రీనీవా , ప్రకాశం జిల్లాలోని వెలుగొండకు నీరు విడుదల చేయడానికి ఆస్కారం వుంటుంది.
1. పోతిరెడ్డిపాడు
2. శ్రీశైలంలో నీటిమట్టం 854 అడుగుల నిర్వహణ
పై రెండు అంశాలు రాయలసీమ కొంత వరకు నెల్లూరు , ప్రకాశం జిల్లాలకు రెండు కళ్ళు లాంటివి.
తాజా వివాదం ఒక పరిశీలన…
కృష్ణలో వరద ఉండటం వల్ల శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ జలాశయంకు రోజు సుమారు 60 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నారు. అక్కడ నుంచి సముద్రంలోకి ప్రకాశం బ్యారేజీ నుంచి వందల టీఎంసీల నీరు వదులుతున్నారు.
అదే సమయంలో శ్రీశైలం దగ్గరలో ఉన్న పోతిరెడ్డిపాడు నుంచి చాలా పరిమిత స్థాయిలొ నీటిని సీమ ప్రాజెక్టుల కోసం విడుదల చేసారు. ఏ ఏ ప్రాజెక్టులకు ఎంత నీరు విడుదల చేస్తున్నారు అన్న విషయం కృష్ణా యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం సమాచారం ఇస్తోంది.
ఏపీ ప్రభుత్వం చెపుతున్న లెక్కలకు పోతిరెడ్డిపాడు నుంచి విడుదల చేస్తున్న నీటికి మధ్య దాదాపు 2 టీఎంసీల వ్యత్యాసం ఉన్నదని బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం పిర్యాదు చేసింది. తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదన వెనక రహస్యం పోతిరెడ్డిపాడు నుంచి నీటి సరఫరా హక్కు లేదు కాబట్టి ఇపుడు విడుదలైన నీటిని లెక్కగట్టి ఏపీ కోటాలో చూపాలి.
నిజానికి రాయలసీమ ప్రాజెక్టులకు నికరజలాలు లేవు. కానీ సీమ ప్రాజెక్టులు వరదజలాల వినియోగం ప్రాతిపదికన నిర్మించారు. నేడు విడుదల చేస్తున్నది వరద జలాలు మాత్రమే. ఏపీకి నీతులు చెప్పే తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో కనీస నీటిమట్టం రాక మునుపే విద్యుత్ ఉత్పత్తి ఎందుకు ప్రారంభించినది. తమకు ఒక న్యాయం రాయలసీమకు మరో న్యాయం. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వంతో ఖచ్చితంగా వ్యవహరించాలి.
రాయలసీమ కీలక ప్రాజెక్టులపై తొలినుంచి వ్యతిరేక వైఖరి….
కేసీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు వై యస్ ముఖ్యమంత్రిగా పోతిరెడ్డిపాడు వెడల్పు చేసినపుడు తీవ్రంగా వ్యతిరేకించే రాజకీయాలు చేశారు. ఒక దశలో కిరణ్ ముఖ్యమంత్రిగా చిత్తూరు జిల్లాకు త్రాగునీటి పథకాన్ని అమలు చేయాలని ప్రయత్నం చేసినపుడు కూడా ప్రతిఘటించినారు.
విభజన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో కూడా సీమ ప్రాజెక్టులకు నీటి హక్కు లేదని , పోతిరెడ్డిపాడు ఉనికినే ప్రశ్నించారు. ఇక ఎన్నికల సమయంలో అయితే లెక్కలేని మాటలు అన్నారు. రాజకీయాలు మారాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పటు చేసుకుని గోదావరి నీటిని వాడుకోవాలని ముందుకువచ్చారు.
తెలంగాణ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి రాయలసీమను సస్యశ్యామలం చేసే బాధ్యత తనదే అంటూ ప్రకటనలు చేసినారు. మంచి వాతావరణం ఏర్పడిన సమయమా అన్నట్లు కృష్ణలో వరదలు వచ్చాయి. వందలాది టీఎంసీల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పోతిరెడ్డిపాడు నుంచి నీటి విడుదలను ప్రశ్నిస్తూ కృష్ణా యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా లేఖ రాయడంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కెసిఅర్ వైఖరి మారలేదని అర్థం చేసుకోవచ్చు.
సముద్రంలో వృధాగా నీరు వెళుతున్న సమయంలో కూడా రాయలసీమకు నీరు విడుదల చేయడాన్ని అంగీకరించలేని కేసిఆర్ తో కలిపి గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామన్న మాటలను రాయలసీమ ప్రజలు ఎలా నమ్మాలి.
(యం. పురుషోత్తమ రెడ్డి, సమన్వయ కర్త, రాయలసీమ మేధావుల ఫోరం
తిరుపతి)
ఇది కూడా చదవండి
https://trendingtelugunews.com/andhra-intellectural-fume-over-kcr-letter-krishna-board/