అంధ్ర ప్రదేశ్ రాజధానిని అమరావతి నుంచి కడప జిల్లాలోని ఇడుపుల పాయకు తరలించేందుకు కుట్ర జరుగుతూ ఉందని తెలుగుదేశం నాయకుడు మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వర రావు ఆరోపించారు.
ఈ రోజు ఆయక కృష్ణా జిల్లా మైలవరం లో జరిగిన ఒక ధర్నాలో పాల్గొంటూ ఈ ఆరోపణ చేశారు. ప్రభుత్వం అమరావతి నిర్మాణం పనులు ఆగిపోయిన సంగతి తెలిసిందే. రాజధాని నిర్మాణం మీద జగన్ మనసులో ఏముందో వెల్లడించకపోయినా, అక్కడ నిర్మాణం పనులు ఆగిపోయాయి. పూర్తి కావస్తున్న పనులు కూడా ఆగిపోయాయి. కాంట్టాక్టర్లు అక్కడ నుంచి తమ యంత్రాలను కూడా తరలించుకుపోయారు. ఈ పనులకోసం వచ్చిన వేలాది మంది కార్మికులు కూడా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు.
రాజధానిని కేవలం కోర్ క్యాపిటల్ ఏరియాలో మూడునాలుగు వేల ఎకరాలకు పరిమితం చేస్తారని ప్రభుత్వ వర్గాలనుంచి హింట్స్ వస్తున్నా, ఎవరికీ నమ్మకం కలగడం లేదు. అమరావతి నిర్మాణం భారీ కుంభకోణమని ముఖ్యమంత్రి జగన్ చాలా సార్లు ప్రకటించారు.దీని మీద విచారణకుక్యాబినెట్ సబ్ కమిటీ వేశారు. ఈవిచారణ పూర్తయి, ఆ పై మరొక విచారణ జరిగితే… రాజధాని ప్రాజక్టులన్నీ రద్దవుతాయి. అమరావతి శిధిలమవుతుంది. ఇప్పటికేప్రపంచ బ్యాంకుతో సహాయ అంతర్జాతీయసంస్థలు అమరావతికి సాయం చేసే ఆలోచనను విరమించకున్నాయి.
ఈనేపథ్యంలో తెలుగుదేశం మాజీ మంత్రి ఇడుపుల పాయ రాజధాని అంటూ కొత్త కోణం బయటపెట్టారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఇడుపులపాయ ప్రాముఖ్యం పెరిగింది. ఆయన అక్కడ ట్రిపుల్ ఐఐఐటి ప్రారంభించారు. ఒక పశువుల పరిశోధనా కేంద్రం ప్రారంభించారు. పులివెందుకులకు కడపకు మంచి రోడ్డు వేశారు. అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇడుపుల పాయ వార్తల్లోంచి మాయమయింది.
ఇపుడు అక్కడ ఏకంగా రాజధాని ఏర్పాటుచేయాలనుకుంటున్నారని దేవినేని ఉమ పేర్కొనడం విశేషేం.
అన్న క్యాంటీన్లను వైసిపి ప్రభుత్వం రద్దుచేసినందుకు నిరసన తెలిపుతూ తెలుగుదేశం పార్టీ మైలవరంలో ఏర్పాటుచేసిన ధర్నాలో ప్రసంగిస్తూ మంత్రి ఈ విషయాలు వెల్లడించారు.
అన్న క్యాంటీన్లను వైసిపి ప్రభుత్వం మూసివేయడాన్ని ఖండిస్తూ ఈచర్యతో కోటి ఇరవై లక్షల మంది పేదోళ్ళ నోటికాడి కూడును ప్రభుత్వం లాక్కుందని దేవినేని ఉమా అన్నారు.
చంద్రాబాబు నాయుడు పిలుపుమెరకు శుక్రవారం నాడు కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గంలో జక్కంపూడి, కొండపల్లి, జి.కొండూరు, మైలవరం అన్న క్యాంటీన్ల వద్ద టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ధర్నాలు చేశారు.
చంద్రబాబు హయాంలో మొదలుపెట్టిన ఈ క్యాంటిన్ల వల్ల కోటి ఇరవై లక్షల మంది పేదలు కడుపునింపుకున్నారని, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం వారి కడుపుకొడుతూ ఉందని ఆయన విమర్శించారు.
క్యాంటీన్ల ఎత్తివేత అన్యాయమంటే కేసులు పెడుతున్నారని, ఇలా మైలవరంలో 17మందిపై అక్రమ కేసులు పెట్టినట్లు ఆయన విమర్శించారు.
మరొక వైపు ఇసుక ధరలను పెంచి 2లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డుకీడ్చారని చెబుతూల 5 వందల రూపాయల ట్రాక్టర్ ఇసుక రేటును రూ.4వేలు చేసారని, సిమెంట్ బస్తా కంటే ఇసుక బస్తా రేటే ఎక్కువని ఉమా పేర్కొన్నారు.
రాజధాని అమరావతిని ఇడుపులపాయకు తరలించే కుట్రలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇదే జరిగితే రాజధాని నిర్మాణానికి 34వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరుగుతుందని, వాళ్లకి అన్యాాయం చేస్తే తెలుగుదేశం పార్టీ మౌనం వహించదని దేవినేని హెచ్చరించారు.
చంద్రబాబు ఉండవల్లి ఇంటిలోకి వరదనీరు పంపాలనే దురుద్దేశంతోనే కృష్ణా బరాజ్ గేట్లు ఎత్తకుడా ఎగువ నుండి వస్తున్న వరద జలాలను నాలుగురోజుల పాటు నిల్వబెట్టారని మంత్రి ఆరోపించారు.