చెట్టంటే… మనిషికి నీడనియ్యాలి. బతికేందుకు అండగా నిలబడాలి. చెట్లు ఈ పవిత్రమయిన కార్యాలు నెరవేరుస్తాయి కాబట్టే విత్తనం మొలకెత్తినా, మొలక చిగురేసినా, చెట్టు పూతకొచ్చినా చిన్న పిల్లల దగ్గరునుంచి పెద్ద వాళ్ల దాకా ఆనందిస్తారు. అయితే, ఈ వూర్లో చెట్లు నాటే కార్యక్రమం బతుకులను నాశనం చేస్తున్నది.విషాదం నింపింది.
తెలంగాణ కాగజ్ నగర్ పట్టణం సమీపంలో సర్సాలలో చెట్లు నాటేకార్యక్రమం దశాబ్దాలుగా సాగుతున్న చక్కటి గిరిజన సంసారాలో చీకట్లు నింపింది. వాళ్ల బతుకుల్ని రోడ్లమీద పడేసింది. నోటికాడి కూడు తీసేసింది.
చెట్లు నాటే పేరుతో సర్సాల గ్రామంలో గిరిజనునులు ఎప్పటినుంచో సాగుచేస్తుకుంటున్న వ్యవసాయభూములను లాక్కున్నారు. అక్కడ పంటవేసుకున్నా లెక్క చేయకుండా పోలాల్లోంచి గిరిజనులను తరిమేశారు. పత్తి మొక్కలు దాదాపు ఒక జానెడు పెరిగాయి.దీని మీద గిరిజనులు కొంత పెట్టుబడి కూడా పెట్టారు.అదంతా పోయింది.
వందల సంఖ్యలో ఈ భూముల్లోకి ఉన్నట్లుండి పోలీసులు, అటవీ అధికారులు చొరబడి ఇక్కడ చెట్లు నాటాలి, తెలంగాణను పచ్చబర్చాలని వారందరిని తరిమేశారు. ఈ భూమి చుట్టూ కందకం తవ్వి ఇది అటవీ భూమి అని ఎవరూ ప్రవేశించకుండా నిషేధం విధించారు. అడ్డొచ్చిన వాళ్ల మీద కేసులు పెట్టారు.
వర్షాలు కురిసిన ఆనందంతో కలుపు తీసుకోవలసిన సమయంలో తమ పొలాలను చెట్లు నాటే కార్యక్రమానికి బలి చేయడంతో ఏం చేయాలో తోచక అక్కడి గిరిజనులు బిక్కమొకం వేసుకుని చూస్తున్నారు.
ఎవరైనా కొత్త వ్యక్తి వస్తే చాలు, ‘ మా భూములు మాక్కిప్పంచండి సారో, మా బతుకు బుగ్గిపాలు చేయొద్దండి సారో,’ కాళ్ల మీద పడుతున్నారు. చెట్లు నాటేందుకు అక్కడ ప్రభుత్వ భూములే లేవా?
చెట్లు నాటడం ప్రజా ఉద్యమంగా సాగాలి. అయితే, తెలంగాణ గిరిజన గూడెం సరసాలలో వందల సంఖ్యలో పోలీసులు, అటవీ అధికారులు చొరబడి, అక్కడ మూడు దశాబ్దాలుగా పంట పండించుకుంటున్న భూములలో చెట్టు నాటే కార్యక్ర మం మొదలు పెట్టారు. ఈ చెట్లను అక్కడి ప్రజలంతా ఆగ్రహంతో ఉన్నపుడు కాపాడుకోగలరా? కేసులతో, పోలీసుల కాపలతో ఈ మొక్కలను బతికించుకోగలరా?
‘ఈ భూములు మా బతుకు దెరువు. అందుకే ఫారెస్టు అధికారులు వస్తే అడ్డుపడ్డాం. ఈ భూములు లాక్కుంటే మేమెలా బతకాలి. ఎక్కడికెళ్లాలి. ఏ పని చేసుకోవాలి. ఒక సంవత్సవరం కాదు, రెండు సంవత్సరాలు కాదు, ముప్పై యేళ్లుగా ఈ భూముల్లో పత్తి, జొన్నలు, బొబ్బర్లు వేసుకుని బతుకున్నాం. మాకూ పట్టాలిచ్చారు. అడివక్కు కల్పించారు. ఇపుడు మమ్మల్నితరిమేస్తున్నారు. అడవక్కు కాగితం చూపిస్తే చించేశారు. అడ్డుకోబోతే తోసేసారు. కొందరికి గాయాలయ్యాయి. మాలో ఒక మనిషి భార్యని గర్భవతి అని కూడా చూడకుండా కొట్టారు. ఆమె భర్త అవమానంతో ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించి పురుగుల మందు తాగాడు. ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆసుపత్రికి తీసుకువెళ్లేందకు కూడా సహకరించలేదు. సరిగదా అతని ఆసుపత్రికి మోసుకుపోయేందుకు ప్రయత్నించినవారి మీద కేసులు పెట్టారు,’ అని గిరిజనులు వాపోతున్నారు.
ఇందులో కొందరి రెవిన్యూపట్టాపాస్ పుస్తకాలున్నాయి. కింది అటవీహక్కు పత్రాలున్నాయి.అటవీ భూములనే పేరుతో ఈ భూముల్లోంచి పేద గిరిజనులను తరిమేస్తే ఎట్లా? అని ప్రశ్నించలేని బలహీనులు వాళ్లు. చెట్టునాటేందుకు వ్యవసాయభూములే కావాలా?
ఎన్నికల ముందు పోడు భూములకు పట్టాలిస్తామన్న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన ఏమయింది?
చెట్లు నాటడమంటే గిరిజనులను ఈడ్చి తరిమేసికేసులు పెట్టడమేనా?