వయసు మళ్ళినా “మన్మథుడే!” (మూవీ రివ్యూ)

(సలీమ్ బాష)
2002లో వచ్చిన మన్మధుడు ఒక క్లాసిక్!
అయితే మన్మధుడు-2 ఆ స్థాయిలో లేకపోయినా, మొదటి సినిమాతో పోలిస్తే(ఇదే సీక్వెల్స్ కు ఇబ్బంది) కొంత నిరాశ పరిచినా, తీసి పారేసే స్థాయిలో మాత్రం లేదు. సాధారణంగా సీక్వెల్ అంటే మొదటి సినిమాతో పోల్చుకోవడం మామూలే.
ఈ మన్మధుడు సినిమా కి వీక్ పాయింట్ లు కొన్ని ఉన్నాయి.
1. సినిమా కథ బలమైంది కాకపోవడం. రెండవది డైలాగులు. తెలుగు సినిమాకు వన్ లైనర్స్ అందించిన త్రివిక్రమ్ మన్మధుడు సినిమాలో చెలరేగిపోయాడు. సినిమా కథ, కథనాలు బాగున్నప్పటికీ డైలాగులు వల్లనే సినిమా ఇంకా బాగుంది అనే స్థాయిలో సంభాషణలు కామెడీకి మారుపేరుగా మారిపోయాయి. మన్మధుడు.
2. లో ఆ స్థాయిలో డైలాగులు లేకపోవడం ఊహించు తగ్గదే. పైగా మన్మధుడు వచ్చి దాదాపుగా రెండు దశాబ్దాలు అవుతోంది. సహజంగానే నాగార్జున అంత యంగ్ అండ్ చార్మింగ్ గా కనిపించకపోవడం సహజం.
అయితే నాగార్జున ఆరు పదుల వయసులో కూడా ఇంకా ఛార్మింగ్ గా, యాంగ్ గా కనిపించిన , నాగార్జున ఫిట్నెస్ ను మెచ్చుకోక తప్పదు.
ఇది కూడా చదవండి
చెట్లు కూలిన బాధ, సిఎంను కదలించిన మణిపూర్ అమ్మాయి కంటతడి
రెండు మన్మధుడులకు రెండు దశాబ్దాలు తేడా ఉన్నా, ఈ సినిమాలో మొదటి మన్మధుడుకి దగ్గరగా వచ్చాడు నాగార్జున. ఇరవై ఏళ్ళ తేడాను పదేళ్లకు తగ్గించాడు. అదే కొంత ఊరట.
ఇన్ని చెప్పిన తర్వాత ఒక మాట చెప్పాలి. ఈ మన్మధుడు సినిమా మొత్తం” పోర్చుగల్” లో తీయడము మంచిదయింది.
సినిమా సాంతం ఆహ్లాదకరమైన విజువల్స్ తో అలరిస్తుంది. పాతతరం నటి లక్ష్మి, ఈ తరం వాళ్ళు ఝాన్సీ, దివ్య దర్శిని, బాగా చేయడం వల్ల సినిమా కు కొంత బలం వచ్చింది. ఏమాటకామాటే చెప్పుకోవాలి అంటే నాగార్జున కూడా సినిమాను మోశాడు.
ఇది కూడా చదవండి :
మహేష్‌బాబు పుట్టినరోజు కానుక: ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్‌, టీజర్‌ 
రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పేదేముంది. సెన్సార్ వాళ్ళు అడ్డు పడకపోతే ఇంకా విజృంభించేదో ఏమో! కానీ నిజాయితీగా చెప్పాలంటే రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ సినిమాకు ఒక బలమే! ( ఇక్కడ పాతతరం ఆడియన్స్ కొంచెం ఇబ్బంది పడినా, ఈ తరం వాళ్ళు ఎంజాయ్ చేసే అవకాశం ఉంది).
ఇంత చేసి వెన్నెల కిషోర్ గురించి చెప్పకపోతే అన్యాయమే అవుతుంది. సినిమా మొత్తం కనిపించడమే కాకుండా తనవైన మేనరిజమ్స్ తో డైలాగులతో (సారీ డైలాగ్ డెలివరీతో. ఎందుకంటే డైలాగులు అతను రాయలేదు కదా) నాగ్ తో కలిసి సినిమా కొంతవరకు తన భుజాల మీద మోసినట్లే.
మిగతా భుజాలు ఫోటోగ్రఫీ, పైన చెప్పిన ముగ్గురు నటీమణులు, అక్కడక్కడ నగిషీలు అద్దిన కామెడీ సన్నివేశాలు, రెండో భాగంలో కొన్ని మంచి డైలాగులతో(!) కూడిన ఎమోషనల్ సీన్లు.
మొదటి భాగం మొదట్లో ప్రేక్షకులు కొంత భయాందోళనకు గురికావడం సహజం. ఎందుకంటే డబుల్ మీనింగ్ డైలాగులు, (కొంత బూతు కూడా) ఒకట్రెండు తీసేయదగ్గ సన్నివేశాలు ఉండడం వల్ల! ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బంది పడేది ఇక్కడే.
అయితే ఈ ఇబ్బందుల్ని రెండో సగంలో దర్శకుడు కొన్ని ఎమోషనల్ సీన్ లతోనూ, హార్ట్ టచింగ్ డైలాగ్లతో నూ కాంపెన్సేట్ చేసే ప్రయత్నం దాదాపుగా సఫలీకృతం అయింది.
ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు, మరి కొన్ని డైలాగులు మరింత ట్రిమ్ చేసి ఉంటే సినిమా మన్మధుడు కి దగ్గరగా వచ్చి ఉండేదేమో! రెండో సగం సినిమా కొంతవరకు మొదటి సగాన్ని మరిపించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్లడం ఈ సినిమాకు కాసింత చేవను ఇచ్చినట్లే!
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వ ప్రతిభ పైన నాగార్జున కు ఎంతో నమ్మకం ఉన్నట్లుంది. అయితే దర్శకుడు ఈ సినిమాను రొమాంటిక్ కామెడీగా తీర్చిదిద్దడంలో కొంతవరకు మాత్రమే సఫలమయ్యాడు. కొన్ని సన్నివేశాల్లో నాగార్జున సైలెంట్ నటన ఆకట్టుకుంటుంది.
అరవై ఏళ్ళ వయసులో(అవును ఆగస్టు 29 కి నాగ్ కు అరవై ఏళ్ళు!) కూడా కొంత చార్మింగ్ గా, కొంత యంగ్ గా కనబడిన నాగార్జున ఈ సినిమాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అయితే బెస్ట్ బ్యాట్స్ మన్ గా వెన్నెల కిషోర్ నీ అనుకోవచ్చు. బెస్ట్ బ్యాట్స్ విమెన్ గా ముగ్గురు పైన ఉదహరించిన నటీమణులు. రకుల్ ప్రీత్ సింగ్ పించ్ హిట్టర్ గా మ్యాచ్ ను కొంతవరకు గెలిపించే అవకాశం ఉంది.
ఇంతకుముందే చెప్పుకున్నట్లు సీక్వెల్ లో మొదటి సినిమాను మించి రెండో సినిమాను తీర్చిదిద్దడం అంత సులభం కాదు. ఇక్కడ అదే జరిగింది. అయితే ఈ సినిమా చూడాలనుకుంటే చూడొచ్చు. మిస్ అయితే ఫీల్ కావాల్సిన అవసరం లేదు.
ఇంకా చెప్పాలంటే భీభత్సమైన ఫైట్లతో, అర్థం పర్థం లేని సన్నివేశాలతో, మధ్యలో పాటలతొ ( ఐటమ్ సాంగ్ లు) మనల్ని హింసించి బోర్ కొట్టించే సినిమాల కన్నా ఇది చాలా చాలా బెటర్ అని చెప్పవచ్చు.
కొసమెరుపు ఏంటంటే సీక్వెల్ అయినప్పటికీ మన్మధుడు-2 కథ కి మన్మధుడు కి ఏ మాత్రం సంబంధం లేదు. ఇది ” ఐ డు” అనే ఒక ఫ్రెంచ్ (ఒరిజినల్ టైటిల్ : ప్రితే మోయి తామే) సినిమా కు రీమేక్! ఒకే కామన్ పాయింట్, మన్మధుడు(టైటిల్) అండ్ మన్మధుడు, అదే నాగార్జున. అంతే!

https://trendingtelugunews.com/a-tribute-to-kishore-da-and-aradhana/