ఈ పాట వినని వారుండరంటె అతిశయోక్తి కాదేమో. అంతకంటె, ముఖ్యమైన సంగతేమిటంటే, ఈ రొజు కూడ జెనరేషన్ గ్యాప్ లేకుండా ఈ పాటని పాడుకునే వారున్నారంటే ఈ పాట వుద్భవించినప్పుడు ఎలాంటి అద్భుతాలు సృష్టించి వుంటుందో వూహించనక్కరలేదు.
1969 – “ఆరాధన” హిందీ సినిమా (రాజేష్ ఖన్నా, షర్మిలా ఠాగోర్) విడుదలైన సంవత్సరం. హిందీ సినిమా జగత్తులో ఇద్దరి జీవితాలను మలుపు తిప్పిన సంవత్సరం. ఈ సినిమా, ఈ పాట, రాజేష్ ఖన్నా ను సూపర్ స్టార్ గానూ, కథకుడు, నటుడూ, గాయకుడు, కమేడీ యన్, దర్శకుడు, ఇలా పలు వృత్తుల తలుపులు తడుతూ తిరుగుతున్న కిశోర్ కుమార్ (4 ఆగస్టు 1929 – 13 అక్టోబర్1987) ను సూపర్ సింగర్ గా నిలబెట్టాయి. దీని తరువాత, కిశొర్ కుమార్ మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. కిశొర్ కుమార్ బహుషా ఈ పాటద్వారా తన అదృష్టాన్ని ప్రశ్నించాడేమో. అది వెంటనే జవాబిచ్చింది.
విచిత్రమేమిటంటే ఈ పాటను గాయకుడు మహమ్మద్ రఫీ పాడవలసింది . ఈ చిత్ర సంగీత దర్శకుడు సచిన్ దేవ్ బర్మన్ (ఎస్. డీ. బర్మన్) అనారోగ్య కారణంగా సంగీత దర్శకత్వ బాధ్యతను ఆయన కుమారుడు, రాహుల్ దేవ్ బర్మన్ (ఆర్. డీ. బర్మన్) చేపట్టాడు. ఈ పాట పాడే అవకశాన్ని తన మిత్రుదైన కిశోర్ కుమార్ కి ఇచ్చాడు. మిగతదంతా చరిత్రే .
ఈ సంవత్సరం కిశోర్ కుమార్ 90 వ పుట్టిన రోజు సంవత్సరం. కిశోర్ కుమార్ యాభై సంవత్సరాల క్రితం ఎంత లోకప్రియంగా వున్నాడొ, ఈనాటికీ అంతే లొకప్రియంగా వుండడమే విశేషం. ఆయన గొంతు నేటి గళం. 1970 లో ని గాయనీ గయకులను నేడు ఎవ్వరూ ఎక్కువగా తలచు కోక పోవచ్చు కానీ కిశోర్ కుమార్ మాత్రం ఆనాడు ఎంత జనరంజకంగా వున్నాడో, ఈనాడూ అలాగే కొనియాడబడుతున్నాడు
1970 లో మొదలయిన కిశోర్ కీర్తి ప్రయాణం, అతడు హఠాత్తుగా 1987 లో చనిపోయేంతవరకూ శిఖరాలను అధిరోహిస్తూనే సాగింది . దీన్ని ఓవర్ నైట్ సక్సెస్ అనొచ్చు. కానీ ప్రతి ఓవర్ నైట్ సక్సెస్ వెనుక ఇరవై సంవత్సారల శ్రమ వుంటుందన్న నానుడి కి ఇది అద్దం పడుతుంది.
1950 మొదలుకుని 1970 వరకు రెండు దశాబ్దాల పాటు కిశోర్ కుమార్ సినీ రంగం లొ ఎన్నో కష్టాలు పడ్డాడు. ఆతడి దినచర్య స్టుడియో ల చుట్టూ ఎక్కే మెట్టు, దిగే మెట్టు గానే సాగింది. కొన్ని సార్లు హీరో గా మరికొన్నిసార్లు హాస్యనటుడిగా, షిఫ్టు ల్లో షూటింగులు జరుపుకుంటు బాక్సాఫీసు వద్ద నిలిచినా, అనామకమైనవిగా పరిగణించబడ్డ అనేక సినిమాల్లో నటించాడు.
చివరికి తను గాయకుడయివుండీ, మహమ్మద్ రఫీ, మన్నాడేలు తనకు పాటలు పాడినా కాదనలేదు. అప్పటివరకూ సినీరంగం అతడినొక గాయకుడిగా గుర్తించనేలేదు. 1950 నుండి 1957 వరకు అతడు దాదాపు 170 పాటలు పాడాడు. 1957 లో ఈ సంఖ్య మరీ బాగా తగ్గింది. బహుశా తన కలల రాణి వస్తుందని వూహించాడేమో. కొన్ని సినిమాలు తీసాడు. 1964 తాను నిర్మించిన “దూర్ గగన్ కి ఛావొ మె” (రచన, దర్శకత్వం, నిర్మాణం, సంగీతం, హీరో, మాటలూ, పాటలు అన్నీ కిశోర్ కుమారే) తప్ప తన చిత్రాలేవి అంతగా పేరు కానీ డబ్బు కానీ సంపాదించలేదు. అప్పట్లో తెలుగులో ఈ చిత్రపు రీమేక్ “రామూ” గా వచ్చింది.
1960 కిశోర్ కుమార్ కి అంతగా కలిసి రాలేదు. 1958 – 59 లో మొదటి భార్య తో విడాకులూ, అనారొగ్యం తొ బాధపడుతున్న మధుబాలా తో మళ్లీ వివాహం. తన సినిమాలు ఫెయిల్ అవ్వడం మళ్లీ అతడిని గాయకుడిగా మారమనే సంకేతాన్నిచ్చాయి. ఆ తరువాత నటుడు దేవానంద్, సంగీత దర్శకుడు ఎస్.డి బర్మన్ ల సహకారం తో “తీన్ దేవియా” చిత్రం ద్వారా కిశోర్ కుమార్ ఒక గాయకుడిగా దారి పట్టాడు.
ఈ దశాబ్దపు రెండో భాగం లో సంగీత దర్శక ద్వయం కల్యాన్ జీ ఆనంద్ జీ అతడ్ని బాగా ప్రొత్సహించారు. బహుశా ఈ ప్రొత్సాహం తో అతడి ఆత్మ విశ్వాసం పెరిగివుండవచ్చు. మిగతా గాయనీ గాయకులు కూడా విభేదాల్లేకుండా అతడి కి అండగానే వున్నారు. అప్పుడొచ్చింది “ఆరాధన”. కొత్తగా బైకులు కొని తిరిగే కుర్రకారులో హుషారు నింపుతూ “మెరి సపునోంకి రాణి” పాట నింగి కెగిసింది. ఆ తరువాత తన సరికొత్త ప్రయోగం “యోడ్లెహి యోడ్లేహి” తో “జిందగి ఎక్ సఫర్ హై సుహానా” (అందాజ్ సినిమాలో పాట) మహమ్మద్ రఫీ ని మిగతా గాయకులనీ తెరమరుగు చేసేసింది.
జీవితం పూల పానుపు కాదని తెలుసుకుని అనేక వొడిదుడుకుల ను ఓర్చుకుని, సంగీత ప్రపంచం లో తనకంటూ ఒక స్థానాన్ని సృస్తించుకుని మనకు అనేక మధురమైన పాటల్ని పంచి పోయిన కిశోర్ కుమార్ ధన్యుడు.