కొండల్లో గుట్టలో ఎడా పెడా పెరిగే బొమ్మ జెముడు (Opuntia Cacti) లో శాస్త్రవేత్తలు ముదిరి పోయిన ప్లాస్టిక్ సమస్యకు పరిష్కారం కనుగొన్నారు. బొమ్మ జెముడు రసం నుంచి వారు ఒక రకమయిన ప్లాస్టిక్ తయారుచేశారు.
ఈ కొత్త రకం బయోడిగ్రేడబుల్ పాస్టిక్ వాడటం వల్ల అసలు ప్లాస్టిక్ కు గుడ్ బై చెప్పవచ్చని మెక్సికో శాస్త్ర వేత్తలు చెబుతున్నారు.
మెక్సికో, జొపాపన్ లోని వాల్ డి ఎటెమజాక్ విశ్వవిద్యాలయం (Valle De Atemjac) శాస్త్రవేత్తలు బొమ్మ జెముడు రసం నుంచి ఈ కొత్త బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ తయారు చేశారు.
ఈ ప్లాస్టిక్ భూమిలో ఒక నెలరోజులుంటే చాలు కుళ్లిపోవడం మొదలుపెడుతుంది. అదే విధంగా నీళ్లలో వదిలితే కొద్ది రోజుల్లోనే విచ్ఛిన్నమవుతుంది.
కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ శాండ్రా పాస్కో ఒర్జిజ్ బృందం ఈ ప్లాస్టిక్ తయారు చేశారు.
బొమ్మజెముడు రసానికి కెమికల్ పాలిమర్ ను ఇచ్చే గుణం వున్నట్లు మొదట ఆమె కనుగొన్నారు.దీనిని మరికొన్ని పదార్థాలతో కలిపి వాడితే ప్లాస్టిక్ పాలిమర్ తయారవుతుంది. ఇవన్నీ నాన్ టాక్సిక్ అని, బయోడిగ్రేడబుల్ అని ఆమె ఫోర్బ్ కు చెప్పారు.
ఈ పదార్థాలు శరీరం లోకి ప్రవేశించినా హాని జరగదని ఆమె చెప్పారు. అంటే ఈ కొత్త బొమ్మజెముడు ప్లాస్టిక్ చెరువుల్లో, సముద్రంలోకి ప్రవేశించిన అవి కరిగిపోతాయ తప్ప నిలవ వుండవు.
ప్రతియేడాది దాదాపు 1.15 నుంచి 2.41 మిలియన్ టన్నుల హానికర ప్లాస్టిక్ సముద్రంలోకి ప్రవేశిస్తూ ఉంది. గత నెలలో ఆస్ట్రేయలియా క్వీన్స్ లాండ్ లోని బుల్ కాక్ బీచ్ ను శుభ్రం చేస్తున్నపుడు 1970 లో పడేసిన ప్లాస్టిక్ కెఎప్ సి బ్యాగ్ కనుగొన్నారు. అంటే అప్పటినుంచి అది అలాగే ఉండిపోయింది.
ఆ బోమ్మజెముడు ప్లాస్టిక్ ఆలోచన మెక్సికోలో డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎగ్జాక్ట్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ ఏర్పటు చేసి ఒక సైన్స్ ఫెయిర్ లో కెమి స్ట్రి క్లాస్ లో వచ్చింది. వారు బోమ్మజెముడు నుంచి ప్లాస్టిక్ తయారుచేసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయోగం ఆధారంగా ప్రొఫెసర్ శాండ్రా పాస్కో ఒర్టిజ్ ప్లాస్టిక్ తయారుచేసేందుకు పూనుకున్నారు.
ఇపుడిది ల్యాబ్ దశలోనే ఉంది. తొందర్లోనే దీనిని ఇండస్ట్రియల్ స్థాయికి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అపుడే బొమ్మ జెముడు ప్లాస్టిక్ మీద అనేక కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయని ఆమె చెప్పారు.