కరువు ప్రాంతాల కోసం నదీజలాల వివాద చట్టంలో చోటుండాలి

(యనమల నాగిరెడ్డి)
అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956కు ప్రస్తుతం చేసిన సవరణలకు అదనంగా మరో సవరణ చేయాలని, తద్వారా కరువు ప్రాంతాల ప్రజలకు కనీసం త్రాగునీరు,  ఆరుతడి పంటకు సాగునీరు అందించే అధికారాన్ని, అవకాశాన్ని ట్రిబ్యునల్స్ కు కల్పించాలని రాయలసీమ కార్మిక కర్షక కార్యాచరణ సమితి అధ్యక్షుడు సి హెచ్ చంద్రశేఖర రెడ్డి, ఉపాధ్యక్షుడు ఎస్. రమణయ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు.
ఆ మేరకు వారు ఒక వినతి పత్రాన్ని ప్రధానికి పంపారు.
నదీ జలాలవివాద చట్టం 1956    
1956 నదీ జలాల వివాద చట్టం మేరకు రెండు లేదా అంతకు మించిన రాష్ట్రాల మధ్య  నదీ జలాల పంపిణీలో లేదా వాటాలలో వివాదం ఏర్పడినపుడు కేంద్ర ప్రభుత్వం ఆ వివాద పరిష్కారం కోసం సుప్రీం కోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తుంది.
ఈ ట్రిబ్యునల్ ఆయా రాష్త్ర ప్రభుత్వాలు చేసే వాదనలు, నిపుణులు అందచేసే పత్రాలు, నీటి ప్రవాహ గణాంకాలు, నిపుణుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకొని తీర్పులు చెప్పడం జరుగుతుంది.
ఇది కూడా చదవండి
నిన్న కొండెక్కిన బంగారు ధర ఈ రోజు ఒక మెట్టు దిగింది…
ఈ చట్టం మేరకు ట్రిబ్యునల్స్ నదీపరివాహక ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలు తప్పమరో అంశాన్ని పరిశీలించలేవు. అలాగే ప్రతి జల వివాదానికి ఒక  ట్రిబ్యునల్ ఏర్పాటు చేయవలసి ఉంది.
 ప్రస్తుతమున్న ట్రిబ్యునల్స్ స్థానంలో అన్ని జలవివాదాలను వేగంగా పరిష్కరించడానికి ఒకే ట్రిబ్యునల్ ను ఏర్పాటుచేసి  ఆ ట్రిబ్యునల్ నేతృత్వంలో వివిధ ధర్మాసనాలను ఏర్పాటు చేయడానికి, నిర్దిష్ట కాలపరిమితితో జల వివాదాలను పరిష్కరించడానికి  చేసిన చట్ట సవరణ బిల్లు లోక్ సభలో పాస్ అయింది. ఇక రాజ్యసభ ఆమోదం పొందాల్సి ఉంది.
 అయితే ఇదే సమయంలో రాష్ట్రాలలో ఉన్న దుర్భిక్ష  ప్రాంతాలలో  తాగునీటికి, సాగునీటి కోసం అలమటిస్తూ ప్రజలను గురించి, ఆ కరువు ప్రాంతాల కనీస అవసరాలు తీర్చడానికి  నీటిని కేటాయించవలసిన అవకాశాలను ట్రిబ్యునల్స్ పరిశీలించే అంశాన్ని చట్టంలో చేర్చాలని వారు ప్రధానికి పంపిన లేఖలో కోరారు.
నీరు జాతి సంపద
“జల సంపద అత్యంత విలువైన, ప్రజలకు ప్రాణాధారమైన జాతీయ సంపద”.  ఇప్పటి వరకు ఈ జలసంపదను రాష్ట్రాల ఆస్తిగానో, నదీ పరివాహక ప్రాంతాల హక్కుగానో, అనుభవ హక్కుగానో  పరిగణిస్తునన్నారు . అలా పరిగణించడం వల్ల అధిక వర్ష పాతం , భూగర్భ జలాలు అధికంగా ఉండి నీటికొరత లేని  ప్రాంతాలకే అధికంగా నీటి కేటాయింపులు జరిగాయి. నేటికీ జరుగుతున్నాయి కూడా. ఈ కారణాల వల్ల ఆ ప్రాంతాల ప్రజలు  వ్యవసాయ, ఆర్థిక, సామాజిక, విద్య, రాజకీయ రంగాలలో ఇతోధికంగా రాణిస్తున్నారు.
అదే సమయంలో నీటి కరువుతో  అల్లాడుతున్నదుర్భిక్ష ప్రాంతాల ప్రజల జీవితాలు మాత్రం రోజు రోజుకు ఛిద్రమౌతూ వారు బ్రతకడానికి వీలు లేని పరిస్థితి కలుగుతున్నది. స్వాతంత్య్రం  వచ్చి ఏడు దశాబ్దాల కాలం దాటినా నీటివసతి ఉన్న ప్రాంతాల ప్రజలకు, కరువు పీడిత ప్రాంతాల ప్రజలకు మధ్య అంతరం పెరుగుతూనే ఉన్నది. ఈ దుస్థితిని సరిదిద్దడానికి ఏ  ప్రభుత్వమూ కూడా ఇప్పటి వరకు సరైన ప్రయత్నమూ చేయకపోవడం దురదృష్ట కరము.
అందువల్ల కరువు పీడిత ప్రాంతాల ప్రజలను ఆదుకోవడానికి మీరు 2019 అంతరాష్ట్ర జల వివాద చట్టంలో “నదీ పరివాహక ప్రాంతం లోపల , పరివాహక ప్రాంతం వెలుపల ఉన్న కరువు ప్రాంతాల ప్రజలకు తాగునీరు మరియు ఒక ఆరుతడి పంటకు సాగు నీరు అందించే అంశాన్ని ట్రిబ్యునల్ లేదా ధర్మాసనాలు పరిశీలించే అధికారాన్ని/ అవకాశాన్ని కల్పిస్తూ,  2019అంతరాష్ట్ర జలవివాదాల చట్టంలో ఒక క్లాజ్ ను చేర్చి కరువు పీడిత ప్రాంతాల, ప్రజల సమస్యకు  శాశ్వత పరిష్కారం లభిస్తుందని వారు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
కరువు ప్రాంతాలు,రాయలసీమ కరువులు 
దేశ వ్యాప్తంగా  కరువులున్నా దక్షిణ భారత దేశంలో కరువుల ప్రభావం  తీవ్ర స్థాయిలో ఉందని, ప్రత్యేకించి పూర్వపు అవిభక్త ఆంధ్రప్రదేశ్  లోని రాయలసీమ లోని కర్నూల్, కడప, అనంతపూర్, చిత్తూర్ జిల్లాల దీనస్థితి గురించి రాయడానికి  వీలు కానంత దుర్భరంగా ఉంది. అలాగే దక్షిణ కోస్తా లోని ఒంగోలు, నెల్లూరు జిల్లాలలోని మెట్ట ప్రాంతాలు, దక్షిణ తెలంగాణాలోని మహబూబ్ నగర్, ప్లోరైడ్ సమస్యతో అల్లాడుతున్న నల్గొండ జిల్లాల దుస్థితి  చెప్పడానికి అలవి కాదు.
రాయలసీమ ప్రాంతంలో స్వాతంత్ర్యానికి పూర్వం, ఆ తర్వాత కూడా ఈ జిల్లాల ప్రజలను  కరువు రక్కసి ప్రతి నిత్యం పలకరిస్తూనే ఉంది.
రాయలసీమ ప్రాంతంలో  గత శతాబ్దంలో చెలరేగిన  “నందన కరువు, ధాతు కరువులు”  ఇక్కడి జనాభాలో మూడవ వంతు ప్రజలను తుడిచి పెట్టాయనేది మరచి పోలేని చారిత్రిక సత్యం.
1956 తర్వాత ప్రతి నాలుగు సంవత్సరాలకు ఈప్రాంతాన్ని ఒకసారి పలకరించే కరువు 1980 దశాబ్దం  నుండి ప్రతి రెండుసంవత్సరాలకు ఒకసారి పలకరిస్తూ, 1990 దశాబ్దం నుండి కరువులు ఇక్కడే తిష్టవేసి ప్రజల జీవనాన్ని ధ్వంసం చేయగా  2019 నాటికి ఈ దుస్థితి మరింత తీవ్రమైంది. కరువు పరిశీలనకు వస్తున్న కేంద్ర బృందాలు తాత్కాలిక ఆర్థిక సాయానికి నివేదికలు ఇస్తున్నాయి  తప్ప ఈ ప్రాంతంలో కరువుల శాశ్వత నివారణకు మార్గం చూపడం లేదు.
రాయలసీమలో జీవన పరిస్థితులు ఎంత హీనంగా ఉన్నాయో చెప్పాలంటే  ఉదాహరణలు కోకొల్లలు. గతంలో 50 నుండి 100 ఎకరాల భూస్వాములుగా ఉండి, తమకు ఉన్నంతలో పదిమందికి అన్నంపెట్టిన  ఆసాములు, చిన్న, మధ్య తరగతి ప్రజల పరిస్థితి చెప్పడానికి వీలుకానంత దుర్భరంగా తయారైంది.
  “కొందరు వలస కూలీలుగా మారితే, మరికొందరు ఆడబిడ్డలను వ్యభిచార గృహాలకు అమ్ముకోవడం జరిగింది. కుటుంభ పరిస్థితి గమనించి కొందరు ఆడబిడ్డలే తమ మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి వ్యభిచార వృత్తిలో కూరుకు పోయి మిగిలిన కుటుంబ సభ్యులకు తిండి పెట్టడం ఈ ప్రాంత దురవస్థకు అద్ధం  పడుతున్నది”. అలాగే బ్రతుకు భారమై ఎన్నో వేల మంది మహిళలు కట్టుకున్నవాడిని, కన్నబిడ్డలను వదలి గల్ఫ్ దేశాలలో చెప్పలేని కష్టాలకు గురౌతూ బ్రతుకులీడుస్తున్నారు. అలాగే గల్ఫ్ కు వెళ్లిన పురుషుల విషయం చెప్పనలవి కాదు. కరువుకు  తోడు వీరికి నకిలీ ఏజెంట్ల బెడద కూడా ఒకటి.
ఈ ప్రాంతంలోఉన్న చిన్న, చిన్న నదుల  ఒడ్డున ఉన్న గ్రామాలకు కూడా ప్రస్తుతం ట్యాన్కర్ ల ద్వారా త్రాగునీటిని  సరఫరా చేయవలసి రావడం ఈ ప్రాంతంలో నెలకొన్న తీవ్ర నీటి కరువును ఎత్తి చూపిస్తున్నది. ఈ దుస్థితి నుండి  ఈ కరువు ప్రాంత ప్రజలను కాపాడాల్సిన భాద్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉంది.
ప్రధానికి వినతి
2019 అంతరాష్ట్ర జలవివాదాల చట్టం  ప్రస్తుతం లోకసభలో ఆమోదం పొంది రాజ్యసభకు వెళ్లిందని తెలుస్తున్నది. “రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాల పరిష్కారంలో ఏర్పడుతున్న ట్రిబ్యునల్స్ లేదా ధర్మాసనాలు, ఆయా  రాష్ట్రాలలోని కరువు ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతంలోఉన్నా, పరివాహక ప్రాంతంలో లేకున్నా, ప్రజలకు కనీసం తాగునీరు, ఒక్క పంటకైనా సాగునీరు అందించే అంశాన్ని పరిశీలించే అధికారాన్నిచట్టంలో చేర్చాలని కోరుతున్నాము.
మీరు దయతో  పై తెలిపిన కారణాలను దృష్టిలో ఉంచుకొని కరువు ప్రాంతాలను ఆదుకోవడానికి ఈ మేరకు చట్ట సవరణ చేసి “ రాజ్యాంగం ప్రజలకు కల్పించిన జీవించే హక్కును కరువు ప్రాంత ప్రజలకు కూడా వర్తింప చేయాలని కోరుతున్నాము.

https://trendingtelugunews.com/kashmir-conspiracy-case-nehru-sheik-abdullah-kashmir-politics/