ఈ మధ్యకాలంలో తెలుగులో ఇటువంటి సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ రాలేదనే చెప్పాలి. రీమేక్ అయినప్పటికీ తెలుగులో బాగానే తీశారు. ఏడాది క్రితం తమిళంలో వచ్చిన “రాచ్చసన్” కు ఇది రీమేక్. తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాను దాదాపు యధాతధంగా తీశారు. సినిమా డైరెక్టర్ రమేష్ వర్మ పెద్దగా మార్పులేమీ లేకుండా ఈ సినిమాలు తీశానని చెప్పుకున్నాడు. అదే సినిమాకు మంచిదయింది.
తమిళ దర్శకుడు రామ్ కుమార్ మొదటి సినిమా “ముందాసుపట్టి” (2014) సినిమాతో డైరెక్టర్ గా అరంగేట్రం చేశాడు. ఇది ఒక కామెడీ సినిమా కావడం విశేషం.! దీని తర్వాత ఒక సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ ని ఎంచుకున్నాడు!!
మొదటి సినిమాకి రెండో సినిమాకి మధ్య నాలుగు సంవత్సరాలు గ్యాప్ రావడానికి కారణం ఈ కథ ఎవరికి ఓ పట్టాన నచ్చకపోవడం! రామ్ కుమార్ కూడా అలెగ్జాండర్ స్పెశ్వితసేవ్ అనే రష్యన్ సీరియల్ కిల్లర్ జీవితం ఆధారంగా కథను రాసుకున్నాడు.
ఇతను ఇంకా బతికే ఉన్నాడు. ఒక మెంటల్ హాస్పిటల్లో! దాదాపు 80 (1991 నాటికి) మందిని కిరాతకంగా హతమార్చిన ఈ సీరియల్ కిల్లర్ ని నిత్యం సంకెళ్లతో బంధించి ఉంచుతున్నారు.
సినిమా ఫస్ట్ సీన్ తోనే కొంత వైవిధ్యంగా ఉంటుందనిపిస్తుంది. తర్వాత కూడా సినిమా మనల్ని నిరాశపరచదు. ఈ సినిమాకు రెండు స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి జిబ్రాన్ సంగీతం, రెండు వెంకట్ దిలీప్ ఛాయాగ్రహణం. ఈ రెండు మనల్ని చివరి వరకు కూర్చోబెడతాయి.
ఈ సినిమాకు ఉన్న మరో బలం హీరో పెద్దగా హీరోయిజం చూపకపోవటం. అక్కడక్కడ నాటకీయత ఎక్కువ అయినట్లు అనిపించినా, (ఏసీపీ లక్ష్మి ఉన్న కొన్ని సన్నివేశాలు) సినిమా చివరి వరకు అదే టెంపోను కొనసాగించడం విశేషం. చాలా మటుకు సినిమాలో సన్నివేశాలు సహజత్వానికి దగ్గరగానే ఉన్నాయి.
తెలుగులో ఈ సినిమాకు హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ ని తీసుకోవడం ఆశ్చర్యకరమే. ఎందుకంటే శ్రీనివాస్ ఇలాంటి సినిమా ఇంతకుముందు చెయ్యలేదు. పైగా గతంలో చేసిన “కవచం” (ఇందులోనూ పోలీస్ పాత్రే ) “సీత” పెద్దగా పోలేదు. ఈ నేపథ్యంలో ఇలాంటి కథం ను ఎంచుకోవటం సాహసమే! కానీ ఈ సినిమాలో శ్రీనివాస్ పర్వాలేదు, బాగానే చేశాడు అనిపించే విధంగా ఉన్నాడు.
సినిమా సస్పెన్స్ సినిమా కాబట్టి కథను ఎక్కువగా చెప్పడం సమంజసంగా ఉండదు. సీరియల్ కిల్లర్ పద్నాలుగు, పదిహేను వయసున్న అమ్మాయిలను అత్యంత కిరాతకంగా చంపటం, ఆ కిల్లర్ ను పట్టుకోవడానికి పోలీసులు విశ్వ ప్రయత్నం చేయడం, సబ్ ఇన్స్పెక్టర్ అరుణ్ కుమార్ తనదైన శైలిలో కీలకమైన క్లూలు సంపాదించి ముందుకు వెళ్లడం ఈ సినిమా కథ.
ఈ సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్రలో రాజీవ్ కనకాల మంచి నటన కనబరిచాడు. అలాగే అహం తో కూడిన ఏసీపీ పాత్రలో (తమిళంలో కూడా ఈమెనే చేసింది) సుజానే జార్జ్ బావుంది ( అంటే బాగా చేసిందని).
టీచర్ గా అనుపమ పరమేశ్వరన్ పర్వాలేదు. మిగతా పోలీసు పాత్రల్లో అందరూ పర్వాలేదు. హెడ్ కానిస్టేబుల్ గా కాశీవిశ్వనాధ్ కొంచెం మెరిశాడు.
ముందే చెప్పినట్టు ఈ సినిమాకి ప్రాణం సంగీతం , ఫోటోగ్రఫీ. ఈ రెండింటి కాంబినేషన్ కొన్ని చోట్ల ఒళ్ళు జలదరించేలా మరి కొన్ని చోట్ల ఉత్కంఠ రేకెత్తించేలా ఉంది..
ఈ సినిమాలో మరో బలమైన అంశం పకడ్బందీగా రాసుకున్న స్క్రిప్ట్. కొన్ని సన్నివేశాలయితే (ముఖ్యంగా అమ్మాయి సంజనా కిల్లర్ బారినుండి తప్పించుకునే సన్నివేశం) “ఎడ్జ్ ఆఫ్ ది సీట్” సన్నివేశాలు.
దాదాపు అనవసరమైన సన్నివేశాలు లేకపోవటం వల్ల కథలో కథనంలో బిగువు తగ్గలేదు.అందుకే సస్పెన్స్ రివీల్ అయిన తర్వాత కూడా సినిమా థ్రిల్లింగ్గా ఉంటుంది.
కొన్ని సినిమాటిక్ అంశాలు, నాటకీయత అక్కడక్కడ ఉన్నప్పటికీ ఈ సినిమాను చివరి వరకు అదే ఉత్కంఠతతో చూసేలా తీయటం, అది తెలుగులో ఒక ఐటం సాంగు, బీభత్సమైన ఫైట్లు, చొప్పించిన కామెడీ లేకుండా తీయటం అభినందించదగ్గ విషయమే.
తమాషా ఏమిటంటే ఈ సినిమాలో మొదటి భాగంలో కొంత సేపు కామెడీ ఉంటుంది. బహుశా తమిళ డైరెక్టర్ రామ్ కుమార్ కు కామెడీ ఇష్టం కావటం వల్ల కాబోలు! ఇప్పుడు థ్రిల్లర్ల కాలం. తెలుగులో ఈ మధ్య థ్రిల్లర్లు బాగానే వస్తున్నాయి. కొన్ని సో,సో గా ఉన్నాయి, కొన్ని పోయాయి. ఒకటో ఆరో బావున్నాయి. అయితే ఇది మాత్రం చూడదగ్గ థ్రిల్లరే!