రాయలసీమ ప్రజలు ఈ ప్రాంత కరువుపై రాజకీయ పార్టీల సానుభూతికై పరితపించడం లేదని ఈ ప్రాంత సమస్యల శాశ్విత పరిష్కారానికి చిత్తశుద్ధితో కార్యాచరణ చేపట్టాలని రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామిరెడ్డి అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల విజయవాడలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగిన అన్ని రాజకీయ పార్టీల సమావేశానికి ఆయన ఆ మేరకు ఒక నోట్ అందించారు.
కృష్ణా, గోదావరి నదీ జలాలను సంపూర్ణంగా వినియోగించుకొని రెండు తెలుగు రాష్ట్రాల లోని అన్ని కరువు ప్రాంతాలను ఆదుకోవడం, పరస్పర సహకారంతో రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్ తుంగభద్ర నీటి విషయంలో చొరవ తీసుకొని కర్నాటక ప్రభుత్వంతో కూడా చర్చలు జరపాలని ఆయన తన పత్రంలో కోరారు.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి ఆన్నది అన్ని ప్రాంతాల వాస్తవ పరిస్థితులతో పాటు ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల కోణంతో చూడవలసిన అంశమని, వెనుకబడిన ప్రాంతాల సమస్యలను రాజకీయ సమస్యగా కాకుండా, సామాజిక, ఆర్థిక సమస్యగా గుర్తించాలని, ఆ ప్రాంత ప్రజల బతుకు తెరువు సమస్యగా చూడాలని,అందుకు అనుగుణంగా సమావేశం సహేతుకమైన కార్యాచరణను ప్రకటించాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తుంగభద్ర నదిలో గత 20 సంవత్సరాలలో 15 సంవత్సరాలు రాయలసీమకు చట్టబద్ధంగా ఉన్న సాగునీటి కేటాయింపులకు మించి నీరు ప్రవహించింది. కాని రాయలసీమలో నీటి హక్కు ఉన్న 19 లక్షల ఎకరాల్లో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు అందింది.
తుంగభద్రలో నీటి లభ్యత పుష్కలంగా ఉండి, ఆ నీటిపై రాయలసీమకు హక్కు ఉన్నాకూడా నీరు పొందలేని దుస్థితిలో ఉన్న ఈ కరువు పీడిత ప్రాంతంలోని 11 లక్షల ఎకరాలకు నీరందించడానికి కల్లబొల్లి మాటలు కట్టిపెట్టి రాజకీయ పార్టీలు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టాలని ఆయన కోరారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మిగులు జలాలపై తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. కాని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా కర్నాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది.
ఈ ప్రాజెక్టులకు నీరు కేటాయించడానికి అత్యంత కీలకమైన “దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టైల్ పాండ్” ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేపట్టిన విషయాన్ని గుర్తుచేస్తూ, రాష్ట్ర విభజన సమయంలో ఈ ప్రాంతనాయకులు రాజకీయ పార్టీలు ఈ ప్రాజెక్టును విస్మరించి రాయలసీమకు తీరని అన్యాయం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
వెనుకబడిన ప్రాంతాలలో మిగులు జలాలపై నిర్మాణం చేపట్టిన పై ప్రాజెక్టులకు నికర జలాలు రావడానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు సాధనకై రాజకీయ పార్టీలు ఇప్పటికైనా క్రియాశీలకంగా వ్యవహరించాలనిఆయనకోరారు.
పట్టిసీమ నిర్మాణం తరువాత ఆదా అయిన కృష్ణా జలాలను రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయిస్తామని అప్పటి ముఖ్యమంత్రి పత్రికాముఖంగా ప్రకటించారని, ఆచరణలో ఆ మేరకు జిఓ ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
ఈ విషయంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు ఉదాసీనంగా వ్యవహరించారని, రాయలసీమకు కృష్ణా జలాలు సక్రమంగా అందడానికి శ్రీశైలంలో కనీస నీటిమట్టాన్ని 854 అడుగులకు పునరుద్దరించాలన్న సీమ వాసుల ఆక్రాందన కూడా రాజకీయ పార్టీలు వినిపించుకోలేదని ఆయన తన పత్రంలో ఆరోపించారు.
అధిక వర్షపాతంతో ప్రతి సంవత్సరం వరదల పాలవుతున్న అభివృద్ధి చెందిన ప్రాంతంలో మూడు పంటలు సాగు చేయడానికి, సాగునీటి స్థిరీకరణకు అవసరమైన పోలవరం ప్రాజెక్ట్ చేపట్టడం ఎంతో అవసరమని, అదే సమయంలో నీటి కోసం కోటి గొంతులతో ఆర్తనాదాలు చేస్తున్న కరువు ప్రాంతాల సమస్యలతో పాటు సాగునీటి హక్కులున్న అరకొర నీటిని కూడా పొందలేని వెనుకబడిన ప్రాంతాల సమస్యలను కూడా కీలకమైనవిగా రాజకీయ పార్టీలు గుర్తించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు పట్టిసీమ, పులిచింతల, చింతలపూడి, పోలవరం ల ద్వారా ఆదా అయ్యే నీటిని రాయలసీమలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు కేటాయించేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి చేయడానికి రాజకీయ పార్టీలు పని చేయాలని ఆయన కోరారు.
రాష్ట్రానికి విభజన సమయంలో ఇచ్చిన “ప్రత్యేక హోదా” హామీపైన అన్ని రాజకీయ పార్టీలు ద్రుష్టి పెట్టాయని,అయితే రాష్ట్ర విభజన చట్టంలో వెనుక పడిన ప్రాంతాలకు ఇస్తామని పేర్కొన్న “బుందేల్కండ్ తరహా ప్రత్యేక ప్యాకేజీని” రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు మంజూరు చేసి, అమలు చేసే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవడానికి అన్ని రాజకీయ పార్టీలు, తమ రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి పని చేయాలని విజ్ఞప్తి చేశారు.
అనేక దశాబ్దాలుగా రాయలసీమను ఆడుకుంటున్న సాంప్రదాయక జలవనరులుగా ఉన్న కుంటలు, చెరువుల పునరుద్ధరణ, కొత్త చెరువుల నిర్మాణం కోసం ప్రత్యేక ఫథకాలను రూపొందించి, వాటిని అమలు చేయించడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఆయన అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
రాయలసీమ విషయంలో రాజకీయ పార్టీలు అనుసరించిన నిర్లిప్త వైఖరిని విడనాడి, కరువు రైతుల కడగండ్లు తీర్చడానికి చిత్తశుద్ధితో పని చేయాలని, తమ రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ప్రజల అవసరాలు తీర్చడానికే కృషి చేయాలని దశరథరామిరెడ్డి తన లేఖలో కోరారు.