తుం ముఝే యూ భులాన పావోగే జబ్ కభీ భీ సునోగే గీత్ మేరే సంగ్ సంగ్ తుం భి గున్ గునావోగే …… మీరు నన్ను అంత సులభంగా మర్చిపోలేరు నా పాట ఎప్పుడు విన్నా సరే నాతొ పాటు మీరు కూడా ఆ పాటని పాడుకుంటారు…
(మధుర గాయకుడు.. మహా మనిషి మహమ్మద్ రఫీ (డిసెంబర్ 24,1924- జూలై 31, 1980) పాడిన మధుర గీతాల్లో ఇది ఒకటి)
నిజమే ! రఫీ ఎప్పటికి మరచిపోలేము. అసలు ఎలా మార్చిపోగలం?
ఈ రోజు మహమ్మద్ రఫి వర్ధంతి(జూలై 31..1980). ఈ సందర్భంగా నేను కొన్ని సంగతులు మీతొ పంచుకోవాలనుకుంటున్నా ….
1937 ప్రాంతంలో… ‘లాహోర్’లో కె.ఎల్. సైగల్ గారి సంగీత కార్యక్రమం జరపడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. సరిగ్గా ప్రోగ్రాం మొదలు కాబోతుండగా కరెంటు పోయింది. కరెంటు వస్తేగాని పాడనని కె.ఎల్. సైగల్ కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అప్పుడో కుర్రవాడు నిర్వాహకుల్ని కలిసి, ‘‘అయ్యా నా తమ్ముడికి ఒక్క ఛాన్సు ఇస్తే కరెంటు వచ్చే వరకూ… ప్రేక్షకుల్ని ఆనందపరుస్తాడు…’’ అని వినయంగా అన్నాడు.
అప్పటికే ప్రేక్షకులు నానా గోలా చేస్తుండటంతో నిర్వాహకులు ఒప్పుకోక తప్పలేదు. ఆ బుడత గాయకుడే మహమ్మద్ రఫీ. హాలు మొత్తం 13 సంవత్సరాల ఈ బుడతడి ప్రజ్ఞకు ఊగిపోయింది. అక్కడున్న సంగీత దర్శకుడు శ్యామ్ సుందర్ ‘రఫీ’ని దగ్గరికి పిలిచి ‘‘నీకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. బొంబాయి వచ్చెయ్’’… అని ఆహ్వానం పలికాడు.
చిన్నతనం నుంచీ రఫీకి సంగీతం అంటే ప్రాణం. హిందుస్తానీ, శాస్త్రీయ సంగీతాల్లో మహామహుల దగ్గర శిక్షణ పొంది అద్భుతమైన స్వర సంపద మూటగట్టుకున్నారు రఫీ.1944లో అంటే తన ఇరవయ్యవ ఏట రఫీ తన మొదటి పాటని ‘గుల్బలోచ్’ అనే పంజాబ్ సినిమా కోసం శ్యామ్సుందర్ సంగీత దర్శకత్వంలో పాడారు.
ఆ తరవాత నౌషాద్ ‘పెహలేఆప్’, ఆ తరువాత లైలా మజ్ఞు, జుగ్ను, అన్మోల్ఘడీ… ఇలా ఏ సినిమాలో పాడినా రఫీ తన స్వరమంత్రజాలంతో ప్రేక్షకుల్ని సమ్మోహనపరిచేవారు. హుషారు పాటైనా, విషాదమైనా, తత్వమైనా, ఏదైనా సరే రఫీ స్వరంలో ప్రాణం పోసుకునేది. గాయకుడు తలత్ మహమూద్ ధూమపానం అలవాటు రఫీకి వరమైంది.
అదెలా అంటే… నౌషాద్కి సిగరెట్టన్నా, దాని వాసనన్నా మహా చికాకు. స్టూడియోలో తలత్ సిగరెట్ తాగడం చూసిన నౌషాద్ ఆ చికాకులోనే, అర్జంటుగా రమ్మని రఫీకి కబురెట్టారు. అసలు సంగతేమంటే, ‘బైజొబావ్రా’ పాటలన్నీ తలత్ పాడాల్సింది. ‘సిగరెట్’ పెట్టిన చికాకుతో నౌషాద్గారు మొత్తం పాటలన్నీ రఫీతో పాడించారు. ఆ సినిమా ఓ మైలురాయిగా సినీ చరిత్రలో మిగిలిపోతే, మహమ్మద్ రఫీ స్వరం దేశమంతా మారుమోగి పోయింది. అంతే!
‘చాహే కోయీ ముఝే జంగ్లీ కహే’ అని రఫీ పాడుతుంటే ‘యా… హూ…’’ అంటూ కుర్రకారు వెర్రెత్తి అరిచారు. ఏ మేరా ప్రేమ్ పఢ్కర్’ అని రఫీ సుమధురంగా ఆలపిస్తే ప్రేమని ద్వేషించే వాళ్లు కూడా ప్రేమలేఖలకు తలవొంచారు. రఫీ లేక పొతే షమ్మీకపూర్ లేడు అన్నది అతిశయోక్తి కాదు. అతనికి పాడినన్ని పాటలు ఏ హీరోకి రఫీ పాడలేదు. రఫీ పోయినప్పుడు షమ్మీ కాశ్మిర్ లో ఉన్నాడు. ఫోన్ చేస్తే ” నా గొంతు మూగపోయింది అన్నాడు”.
రఫీ పాటలు అజరామరాలు. వాటిని చర్చిస్తూ పొతే అంటూ ఉండదు.
మన తెలుగు వాళ్ళని కూడా రఫీ అలరించాడు.(రామారావు గారి పుణ్యమాని) భలే తమ్ముడు(ఎంత వారు కానీ, ఇద్దరి మనసులు, గోపాల బాల నిన్నే కోరి, నేడే ఈ నాడే ) అక్బర్ సలీమ్ అనార్కలి(హసీనా, రేయి ఆగిపోనీ, సిపాయి, సిపాయి ,తానె మెలి ముసుగు తీసి) తల్లా పెళ్ళామా( నువ్వు నవ్వుతున్నావు)వంటి చిత్రాల్లో రఫీ గొంతు విని ఆనందించాము.. భాషలో కొంచెం ఇబ్బంది ఉన్నా మాధుర్యం తగ్గ లేదు. రామారావు గారి ఆరాధన సినిమాలో ” నా మాది నిన్ను పిలిచింది..” అని రఫీ పాడితే శ్రోతలు మైమరచి పోయారు.
మహమ్మద్ రఫి నాకు అభిమాన గాయకుడవటానికి కారణం మా నాన్నగారి “నేషనల్ ఎకో” రేడియో.. (ఇప్పుడు వాల్వ్ రేడియో లు ఎక్కడున్నాయి?) మా మేన మామ దాదాపీర్ కు రఫి అంటే ప్రాణం. వాళ్ళింట్లొ రేడియో లేదు కనుక దాదాపు రోజు మా ఇంట్లోనే రేడియో వినేవాడు.(అది మా నాన్నకు నచ్చేది కాదు!)అయినా వచ్చేవాడు..వినేవాడు. ఇక నాకు స్కూల్ ఎగరగొట్టడమంటే చాలా ఇష్టమైన కార్యక్రమం(1965 నుండి అదే అలవాటు..అప్పుడు నేను మునిసిపల్ ఎలిమెంటరీ స్కూల్ లో చదువుతున్నాను).మా మామతో పాటు(అర్థం కాకపొయినా) నేను రఫి ని వినటం..క్రమేణా రఫి కి దాసుడనైపోవటం జరిగిపోయింది. ఆ తర్వాత లతా దీదీ కి దాసుడినయ్యను. ఈ ఇద్దరే నేను ఆరాధించే గాయకులు! వాళ్ళిద్దరూ పాడిన యుగళ గీతాలు, బహుశా మరెవ్వరూ పాడలేరన్నది నా అభిప్రాయం.అవి అజరామరమైనవి! ఇప్పుడు రఫి పాట ఒక్కటైనా, ఒక్కసారైనా వినకుండ లేదా చూడకుండా(సోని మిక్స్ టీవీ చానెల్ లో) నాకు నిద్ర పట్టదు.!
రఫి గొప్ప గాయకుడా? గొప్ప మనిషా? ఇది చాలా రోజుల్నుంచి ఉన్న సందేహం(కొందరికి).. ఈ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితంలోనుంచి కొన్ని సంఘటనలు మీతో పంచుకుంటున్నా..
రఫి కొత్తలో కోరస్ లలో ఫాడాడు(నౌషాద్ సంగీతం) ఒక సారి రికార్డింగ్ ఇంకా మిగిలి ఉండగా కోరస్ పాడినవారిని మర్నాడు రమ్మన్నారు.డబ్బులు కూడా అప్పుడే ఇస్తామన్నారు. తన పని ముగించికుని బాగా పొద్దు పోయాక నౌషాద్ స్టుడియో నుంచి బయటికి వస్తుండగా సాయంత్రం కోరస్ లో పాడిన కుర్రాడు(అంటే రఫి) గేటు బైట కనపడితే “ఏమయ్యా? ఇంకా ఇంటికి వెళ్ళలేదా?” అని అడిగితే అ కుర్రాడు(రఫి)” లేదు” అన్నాడు. “ఎందుకు?” అని అడిగితే,”రేపు మళ్ళీరావాలి కదా, ఇంటికి వెళ్ళి మళ్ళీ రావటానికి నా దగ్గర డబ్బులు లేవు” అన్నాడా కుర్రాడు. అప్పుడు నౌషాద్ “డబ్బులు అడగొచ్చు కదా?” అంటే, “ఎలా అడగాలి, పాట ఇంకా పూర్తి కాలేదు కదా?” అన్నాడు రఫి (అదే ఆ కుర్రాడు)!
ఒక సారి “ఇంపాలా” కారు కొన్నాడు. పాత డ్రైవర్(సుల్తాన్) కు అది నడపటానికి రాదు. అందరూ కొత్త డ్రైవర్ ను పెట్టుకోమన్నారు. రఫి కు అది ఇష్టం లేదు.అయితే ఏం చెయ్యాలో కూడా తోచలేదు. ఒక రోజు డ్రైవర్ ను పిలిచి ” ఇదిగో నీ కోసం కొత్త ట్యాక్సీ కొన్నాను. దీంతో నీ కుటుంబాన్ని పోషించుకో.నేను కొత్త డ్రైవర్ ను పెట్టుకుంటాను” అన్నాడు!
మరో సంఘటన .. “నీల్ కమల్” సినిమాలో పాడిన “బాబుల్ కి దువాయే..” పాట. ఇప్పటికి పెళ్ళిల్లలో వినిపిస్తూ ఉంటుంది. పెళ్ళికూతురిని తండ్రి సాగనంపేటపుడు(“బిదాయీ”)ఆ పాట ఉంటుంది. రికార్డింగ్ అయ్యాక నిర్మాత చెక్ ఇస్తే రఫి తీసుకుని ఇంటికి వెళ్ళాడు. కొంచెం సేపటికే తిరిగి వచ్చి నిర్మాతకు చెక్ వాపసు ఇచ్చాడు.”ఎందుకు” అని అడిగితే “కూతురిని సాగనంపటానికి నేను డబ్బులు తీసుకోను” అన్నాడు!
జూలై 31,1980 తేది రఫి పాడిన చివరి పాట “ఆస్-“పాస్” సినిమాలో. లక్ష్మికాంత్-ప్యారేలాల్ సంగీత దర్శకుడు. పాట ఇంకా రెండు లైన్లు ఉండగా, రఫి రేపు పూర్తి చేద్దామని ఇంటికి వచ్చాడు. కాని ఎందుకో(!) మళ్ళీ వెనక్కి వచ్చి “రేపు ఎవరు చూశారు. ఈ రోజే పూర్తి చేద్దాం” అని పాడేసి వెళ్ళిపోయాడు.. నిజంగానే వెళ్ళిపోయాడు….. ఆ రొజు రాత్రే! … అంటే ఈ రోజు రాత్రే.
చివరగా……. గేయ రచయితా భువనచంద్ర గారి మాటల్లో చెప్పాలంటే…మన గొంతులో పాటలా…మనతోటే ఉన్నట్టుగా..!…..
రఫీని స్మరించుకోవడం అంటే… భారతీయ సంగీతాన్ని స్మరించుకోవడమే. రఫీకి అంజలి ఘటించడమంటే… చలనచిత్ర సంగీతానికి సాష్టాంగ నమస్కారం చెయ్యడమే!మహమ్మద్ రఫీ పరమపదించిన రోజున (31 జూలై 1980) బాంబే మొత్తం మూగబోయింది. వేలాది మంది అభిమానులు రఫీ అంతిమ యాత్రలో పాల్గొన్నారు. మన గొంతులో పాటలా… మన కళ్లల్లో కలగా… మన జీవితంలో భాగంలా… మనతోటే ఉన్నట్టుగా…! అభీనా జావో ఛోడ్ కర్… ఏ దిల్ అభీ భరా నహీ’’ అని పాడుకుంటే, ఆయనే మరలి వస్తారు… మధుర స్మృతిగా.