(సలీం బాష)
దాదాపు పదేళ్ల నుంచి ఓ సూపర్ హిట్ సినిమా కోసం తపిస్తూ, కసి మీదున్న పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్ నుంచి ఏ శంకరాభరణమో , సాగర సంగమమో ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు.
అయితే ఇలాంటి సినిమాని కూడా ఆశించరు.
దశాబ్ద కాలంగా దాదాపు 15 సినిమాలు తీసినా ఒక బ్లాక్ బస్టర్ కూడా లేదు. మహేష్ బాబు తో ‘బిజినెస్ మన్’ లాంటి హిట్,, అంతకన్నా ముందు హిందీలో అమితాబచ్చన్ తో ‘బుడ్డా హోగా తెరా బాప్’ లాంటి ఓ మోస్తరు హిట్, ఎన్టీఆర్ తో ‘టెంపర్’ లాంటి హిట్ తప్ప పెద్దగా విజయాలు లేవు. (చిత్రమేమిటంటే “టెంపర్” సినిమా స్టోరీ పూరి ది కాదు!)
గత పదేళ్లలో పూరి సినిమాల్లో రవితేజ, మహేష్ బాబు, ఎన్టీఆర్ తో మాత్రమే ఇంతకు ముందు ఒక సినిమా చేసిన పూరి కి వాళ్ళిద్దరు మాత్రమే హిట్ సినిమా ఇచ్చారు.
రవితేజ ను ‘దేవుడు చేసిన మనుషులు’ తో రిపీట్ చేసినా లాభం లేకపోయింది.
ఇంకా అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ కూడా రిపీట్ అయినా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. ఈ పదేళ్లలో అయిదుగురు హీరోలు తప్ప దాదాపుగా ప్రతి సినిమా కొత్త వాళ్లతో చేసిన పూరికి బాలకృష్ణ తో తీసిన ‘పైసా వసూల్’ కూడా పైసలు తేలేదు!
2018 లో తన కుమారుడు ఆకాష్ తో తీసిన ‘మహబూబా’ కూడా అంతే!
ఈ నేపథ్యంలో ఒక డిఫరెంట్ సినిమా తీస్తాడని అందరూ ఊహించారు. అయితే డిఫరెంట్ కథని తీసుకున్నాడు, కానీ డిఫరెంట్ గా తీయలేకపోయాడు.
ఒక ఫక్తు సినిమా, అదీ ఏ సర్టిఫికెట్ సినిమా తీసి జనం మీదకు వదిలాడు. ఇంతకుముందు పూరి గొప్ప సినిమాలు ఏమి తీయలేదు.
ఇట్లు ‘శ్రావణి సుబ్రహ్మణ్యం’ పూరి తీసిన ఒక చక్కని సినిమా. మొదటి సినిమా బద్రి కూడా పర్వాలేదు.
నిజానికి మొదటి సినిమాతో హిట్ కొట్టిన పూరి తర్వాత కాలంలో కమర్షియల్ సినిమాల కోసం ట్రై చేశాడు. కానీ ఇలాంటి సినిమా కూడా తీసిన అనుభవం లేదు.
ఈ సినిమాలో ఒక విచారకరమైన విషయం ఏంటంటే గతంలో ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘నేనింతే’ సినిమాలకు సంభాషణలు గాను నంది అవార్డులు అందుకున్న పూరి ఈ సినిమాలో ఫక్తు డబుల్ మీనింగ్, కొండకచో బూతు, పచ్చి డైలాగులు రాయడం!
ఇక ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గురించి ఎవరు ఏం చెప్పినా కసితో, ఓ లక్ష్యంతో సినిమా తీసిన పూరి జగన్నాథ్ తన లక్ష్యాన్ని కొంతవరకు అందుకోవచ్చు!
ఇక ఈ సినిమా గురించి చెప్పాలంటే ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ని, రాం ఎనర్జీని, ఇద్దరు హీరోయిన్ల శృతి మించిన ఎక్స్పోజింగ్ ని,( ఈ రెండు అంశాలే సినిమాను, పూరి జగన్నాథ్ కాపాడే అవకాశం ఉంది) బీభత్సమైన ఫైట్లను, ఇంకా బీభత్సమైన తెలంగాణ యాసను, ఓ హత్య కేసును, కొంచెం బాగున్న సంగీతాన్ని, ఇంకా కొంచం బాగున్న ఫోటోగ్రఫీని, మాస్ మసాలా దట్టించిన డబుల్ మీనింగ్ డైలాగులను కలిపి ఒక పద్ధతిలో కాకుండా ఎలా పడితే అలా వండిన ఒక మాస్ మసాలా కిచిడీ!!
సినిమాల్లో, అది తెలుగు సినిమాలలో లాజిక్ వెతకడం సరి కాదు కానీ, ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ ని ఎంత అన్ సైంటిఫిక్ గా తీయవచ్చు అన్నది ఈ సినిమా రుజువు చేస్తుంది.
అయితే ఇటువంటి సినిమాలో రామ్ కొంతవరకు బాగానే చేశాడు. డాన్సులు, ఫైట్లలో ఎనర్జీతో పాటు, రెండు రకాల మనస్తత్వాలను, వాటిలోని షేడ్స్ ను బాగా చూపించాడు. అదే విధంగా హీరోయిన్లు నభా, నిధి లు కూడా ఏం చూపించాలో అవి చూపించారు! ( ఇలాంటి సినిమాలకు రివ్యూ రాస్తే అందులో కూడా డబుల్ మీనింగ్ వాక్యాలు వస్తాయి మరి!)
సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం పాటలు “శంకర్” ద్వారా చితక్కొట్టబడిన తెలంగాణ యాస డైలాగులు, ఒకటి రెండు చోట్ల బ్రిలియంట్ సన్నివేశాలు, అనవసరమైన పాటలతో నడుస్తుంది. ఇందులో ఒక హీరోయిన్ వీర ఎక్స్ పోజింగ్ అదనం.
సెకండాఫ్ లో కొంత ఆశ కలిగించినా, చివరికి నిరాశ మిగిలిస్తుంది. నిజానికి సెకండాఫ్ లో కొంత ఉత్కంఠ కలిగించినా, మళ్ళీ దాన్ని రొటీన్ దారిలోకి తీసుకెళ్లటం వల్ల సినిమా కొంత లాగబడినట్లనిపిస్తే ప్రేక్షకుల తప్పు కాదు. ఇందులో రెండో హీరోయిన్ వీర ఎక్స్ పోజింగ్ అదనం.
పూరి టాలెంటెడ్ డైరెక్టర్ అనడానికి ఒక రెండు సీన్లు ఉదహరించాలి. ముఖ్యంగా రామ్ మెమరీ క్రమక్రమంగా మాయమైపోతుంది అని న్యూరో సైంటిస్ట్ నిధి చెప్పినప్పుడు ఆ సన్నివేశాలను సముద్ర కెరటాలు అలా వచ్చి చెరిపేయడం సూపర్బ్! అలాంటి సన్నివేశాలు రెండు మూడు ఉన్నాయి. వాటిని ఎవరూ పట్టించుకోకపోవచ్చు.
ఎందుకంటే అంతకుముందు, ఆ తర్వాత ఇద్దరు హీరోయిన్లు తమదైన శైలిలో అలరిస్తారు(అల్లరి చేస్తారా?) ఆ మత్తులో ఇవే కాదు ఏవీ గుర్తుకు రావు, ముఖ్యంగా కుర్రకారుకి. పూరిక్కూడా అదే కావాల్సింది! వాళ్లే పూరికి ముఖ్యం. మన దేశంలో యువతకు కొదవ లేదు కదా! ఇది కచ్చితంగా ఫ్యామిలీ మూవీ కాదు. కుర్రకారు,ఫ్యామిలీ లేకుండా పెద్దకారు(అంటే పెద్దలు, ఆఫ్ కోర్స్ దొంగతనంగానే) ఈ సినిమా చూసి ఎంజాయ్ చెయ్యవచ్చేమో. ఈ మధ్య కాలంలో ఇలాంటి సినిమా రాలేదు మరి!
కొసమెరుపు ఏమిటంటే ఈ సినిమా కథ తాను రాయగా, తననే హీరోగా పెట్టి తమిళంలో “నాన్ యార్” అనే సినిమా తీశారని “ఆనందం” సినిమా హీరో ఆకాష్ ఆరో పించాడు. దాన్ని తెలుగులో “కొత్తగా ఉన్నాడు” అన్న పేరుతొ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పాడు. పూరీని సంప్రదించగా అందుబాటులో లేడని, విషయం కోర్టులో తేల్చుకోవాల్సి వస్తుందని చెప్పాడు.
తారాగణం: రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభ నటేష్, సత్యదేవ్, గెటప్ శ్రీను, ఆశీష్ విద్యార్థి, తులసి, పునీత్ ఇస్సార్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పూరీ జగన్నాథ్
మ్యూజిక్: మణి శర్మ
సినిమాటోగ్రఫి: రాజ్ తోట
ఎడిటింగ్: జునైద్ సిద్ధిఖీ
బ్యానర్: పూరీ కనెక్ట్స్, పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్
రిలీజయింది: 2019-07-18 న