కెఫె కాఫీ డే సంస్థ చెయిర్మన్ మేనే జింగ్ డైరెక్టర్, భారత మాజీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ సోమవారం నుంచి కనిపించడం లేదు.
ఈ సంస్థ గత కొద్ది రోజులుగా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులో ఉంది. పన్ను బకాయిలు వందల కోట్లలో ఉన్నాయి. సోమవారం నుంచి ఆయన అందుబాటులో లేకుండా పోయారు. దీని మీద ఇన్ కం టాక్స్ సుదీర్ఘమయిన వివరణ ఇచ్చింది.
ఈ ఇబ్బందుల మధ్య ఆయన హాఠాత్తుగా మాయమయ్యారు.
ఆయనను ఎక్కడున్నారో కనుగొనేందుకు సంబంధిత అధికారుల సాయం తీసుకుంటున్నామని కంపెనీ పేర్కొంది.
ఆయన కనిపించడం లేదనే వార్త వెలువడగానే కెఫె కాఫీడే (CCD) కంపెనీ షేర్ల ధరలు 20 శాతం పడిపోయాయి.
మొన్న సిద్ధార్థ సకలేష్ పూర్ కు బయలుదేరారు. అయితే, మార్గ మధ్యంలో కారును మంగళూరు వైపు మళ్లించాలని ఆయన డ్రైవర్ ను కోరారు. దారిలో దక్ణిణ కన్నడ జిల్లా కోటేపుర దగ్గిర నేత్రావతి నది మీద బ్రిడ్జి దగ్గరకు వచ్చాక ఆయన కారాపి దిగారు.
కొద్ది సేపు అలా వాక్ చేసివస్తానని డ్రైవర్ కు చెప్పి వెళ్లిపోయారు. ఆయన రాక కోసం డ్రైవర్ రెండుగంటల సేపు వేచి చూశారు.ఆయన రాలేదు.
దీనితో డ్రైవర్ వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ విషయం మీద ఫిర్యాదు చేశారు. అపుడు పోలీసులు మిస్సింగ్ ఫిర్యాదు నమోదు చేశారని దక్షిణ కన్నడ జిల్లా పోలీసుడిప్యూటి కమిషనర్ సెంధిల్ శశికాంత్ చెప్పారు.
ఇపుడు దాదాపు 200 మంది పోలీసులు, 2 పడవలు ఆయనకోసం నదిలో గాలిస్తున్నాయని పోలీసులు తెలిపారు.
సిద్ధార్థ చిక్క మగళూరులో కాఫి పండిస్తారు. ఆయన ఏటా దాదాపు 28 వేల టన్నుల కాఫీని ఎగమతిచేస్తుంటారు. మరొక రెండు వేల టన్నులు ఇండియా విక్రయిస్తుంటారు. ఆయనకు 12 వేల ఎకరాల కాఫీ తోటలున్నాయి.
దీనితో ఆయన 1996లో కర్నాటక లో విజయవంతంగా కెఫే కాఫీ డే బిజినెస్ ప్రారంభించారు. తర్వాత ఇండియా అంతా వ్యాప్తి చేశారు. ఇపుడు భారతదేశమంతా 243 పట్టణాలలో కాఫీ డేకి 1751 షాపులున్నాయి.
ఈ కంపెనీ 2019లో 4,466.79 కోట్ల వ్యాపారం చేసింది , దీని మీద 2019లో రు. 127 కోట్ల ఆదాయం వచ్చింది. కాఫీ డే ఎంటర్ ప్రైజెస్ లో సిద్ధార్థకు 53 శాతం వాటా ఉంది.
అయితే, కంపెనీ మీద అప్పుల భారం పెరుగుతూ వచ్చిందని చెబుతున్నారు. ఈ అప్పుల భారం తగ్గించుకునేందుకే ఆయన మైండ్ ట్రీ ఐటి కంపెనీలో తన వాటాని అమ్మేశాడని చెబుతారు. ఇక్కడే ఇన్ కమ్ టాక్స్ కు ఆయనకు గొడవ మొదలయింది. ఆయన మైండ్ ట్రీ వాటాను అమ్మేస్తున్నాడని తెలియగానే ఇన్ కం టాక్స్ తనకు రావలసినపన్ను బకాయీల కింద ఈ వాటాలను అటాచ్ చేసింది. తర్వాత దీనికి బదులు వేరే షేర్లు ఐటి శాఖకు పూచీకత్తుగా చూపిస్తానని చెప్పి ఆయన మైండ్ ట్రీ షేర్లను విడిపించుకున్నారు. వీటిని అమ్మితే రు 3200 కోట్లు వచ్చాయి. ఇందులో 3000 కోట్లు కొన్నిరుణాలు తీర్చేందుకు చెల్లించారు. ఆయన ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమయిపోయిందని ఇన్ కం టాక్స్ విడుదలచేసిన ఒక ప్రకటన వల్ల అర్థమవుతుంది.
గత ఏడాది ఆయన కంపెనీ మీద ఇన్ కమ్ టాక్స్ దాడులు కూడా జరిగాయి.
ఆయన మంగళూరు యూనివర్శిటీలో ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చదివారు. మొదట స్టాక్ మార్కెట్ ఉద్యోగం చేశారు. అనంతరం ఈయన 1983లో మోర్గాన్ స్టాన్లీ ఫైనాన్షియల్ లిమిటెడ్ లో మేనేజ్ మెంట్ ట్రెయినీగా పనిచేశారు. తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ వైస్ చెయిర్మన్ మహేంద్ర కంపానీ దగ్గిర కూడా పనిచేశారు.
అయితే, రెండేళ్ల తర్వాత ఆయన బెంగుళూరు తిరగొచ్చారు. సొంతంగా వ్యాపారం చేయమని ఆయనను తండ్రి ప్రోత్సహించారు. తర్వాత ఇండియన్ స్టాక్ మార్కెట్ లో పనిచేశారు. 30వేలరూపాయలతో ఆయన స్టాక్ మార్కెట్ కార్డు ను కొని శివన్ సెక్యూరిటీస్ అనే సంస్థను ప్రారంభించాడు.
అనంతరం దాన్ని 2000లో వే2 వెల్త్ సెక్యూరిటీస్ గా మార్చారు. తర్వాత గ్లోబల్ టెక్నాలజీ వెంచర్స్ పేరుతో వెంచర్ క్యాపిటల్ వ్యాపారం ప్రారంభించారు. ఇందులో బాగా విజయవంతమయ్యారు.
జిటివి ఒక సక్సెస్ ఫుల్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ అండ్ స్టాక్ బ్రోకింగ్ కంపెనీ అయిపోయింది.
ఈ విజయం తర్వాతే ఆయన అమాల్గమేటెడ్ బీన్ కంపెనీ (ABC)పేరుతో కాఫీ బిజినెస్ ప్రారంభించారు.
తర్వాత బెంగళూరులోని రద్ధీ ప్రాంతమైన బ్రిగేడ్ రోడ్డులో కేఫే కాఫీ డేను ప్రారంభించారు. ఇది దేశంలో కాఫీ విప్లవం తీసుకొచ్చింది. కాపీ తాగడాన్ని నేటి యువతరంలో ఒక లైఫ్ స్టయిల్ గా మార్చింది.