కాంగ్రెస్ నాయకుడు, మేధావి, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛానలతో నెక్లెస్ రోడ్డులో ఈ రోజు ముగిశాయి.
రాష్ట్రానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులతో పాటు కర్ణాటక మాజీ స్పీకర్ రమేష్ కుమార్ , సదానందగౌడ స్వయంగా హజరయ్యారు.
సురేష్ కుమార్, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జైపాల్ పాడె మోశారు. వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య జైపాల్ రెడ్డి అంతి మసంస్కారాలు నిర్వహించారు.
మొదట జైపాల్ రెడ్డి పార్ధీవదేహాన్ని ఆయన ఇంటి నుంచి ర్యాలీగా గాంధీభవన్ కు తీసుకు వచ్చారు. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ఆయనను కడసారి సందర్శించారు.
తర్వాత అక్కడ నుంచి నెక్లెస్ రోడ్డు వరకు అంతిమయాత్ర సాగింది.చివర పీవీ ఘాట్ దగ్గర జైపాల్ రెడ్డి అంత్యక్రియలు జరిగాయి.
జైపాల్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొంటూ కర్నాటక స్పీకర్ కంట తడి పెట్టారు. అంత్య క్రియలకు హాజరయ్యేందుయే ఆయన కీలకమయిన అసెంబ్లీ సమావేశాలను కూడా కుదించుకున్నారు.
ఒక వైపు రాజకీయ సంక్షోభం లో రాజీనామా చేసినా కూడా ఆయన హైదరాబాద్ వచ్చారు. జైపాల్ రెడ్డితో తనది అన్నాతమ్ముల అనుబంధమని ఆయన అన్నారు. అందుకే ఆయన తుదిసారి వీడ్కోలు చెప్పేందుకు వచ్చానని, ఆయన అంతిమమయాత్రలో పాల్గొని పాడె మోసి తన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నానని ఆయన చెప్పారు.
సెక్యులరిజానికి భారీ నష్టం
జైపాల్ రెడ్డి లేని లోటు సెక్యులరిజానికి పెద్ద దెబ్బఅని కాంగ్రెస్ నాయకుడు మల్లి కార్జున్ ఖర్గే అన్నారు. జైపాల్ రెడ్డి అంత్యక్రియలకు హాజరయిన ఖర్గే, విద్యార్థి దశనుంచి జైపాల్ తో తన కున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు.
జైపాల్ ఒక డిక్షనరీ అని ఆయన వర్ణించారు. ఆయన ఏపదవిలో ఉన్న దానికి న్యాయం చేశారని ఖర్గే అన్నారు. సోషలిజం, సెక్యులరిజం విలువలకు ఆయన ప్రతీక అని అంటూ ఆయన మరణం సెక్యులరిజానికి పెద్ద నష్టం అనిమరొక సీనియర్ కాంగ్రెస్ నేత గులాం నబీ అజాద్ పేర్కొన్నారు.
జైపాల్ తోతనకు 30 సంవత్సరాల స్నేహమని, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నానని సిపిఎం నేత ఏచూరి సీతారామ్ అన్నారు.
జైపాల్ రెడ్డికి నివాళి
పార్లమెంటులో చాలా మంది బల్ల గుద్ది, గట్టిగా ఆరచి తాము చెప్పేది నిజమని చెప్పే ప్రయత్నం చేస్తారు. మరికొంతమంది సభ వెల్ లోకి వెళ్లి కార్యకలాపాలను అడ్డుకుని తమ పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తారు. అవతలి పక్షాన్ని ఒప్పించాలన్న ఆశయం కంటే, గట్టిగా మాట్లాడాలనే ఉద్రేకం ఇందులో ఎక్కువగా ఉంటుంది.
సూదిని జైపాల్ రెడ్డి (1942 జనవరి 16- 2019 జూలై 28) దీనికి భిన్నంగా చాలా సౌమ్యంగా, ఎలాంటి భావోద్వేగాలకు లోను కాకుండా, భాషను బాణంలాగా ప్రయోగించి, రూలింగ్ పార్టీని బంధించే వాడు. ఉక్కిరి బిక్కిరి చేసేవాడు.
ఈ సంప్రదాయం పాటించిన బిజెపియేతర పార్లమెంటేరియన్ లలో జైపాల్ రెడ్డిచివరి వాడు. ఆయనతో పార్లమెంటెరీ మేధావులు అనే తరం అంతరించిపోయింది.
ఇక ముందు పార్లమెంటులో జైపాల్ రెడ్డి లాంటి మేధావి కనబడరు. ఎందుకంటే, జైపాల్ రెడ్డి పాలిటికల్ ఫిలాసఫర్. రాజకీయంగా బాగామాట్లాడే వాళ్లు రావచ్చు. ఫిలాఫర్లు రావడం కష్టం.
జైపాల్ రెడ్డి రాజీపడని హేతువాది. సెక్యులర్. ఆయన విమర్శలు నిస్సంకోచంగా ఉంటాయి. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నపుడు ఆయన్నికూడా జైపాల్ రెడ్డి వదలి పెట్టేవాడు కాదు.
పార్లమెంటులో రెండు రకాల ప్రసంగాలుంటాయి. ఒకటి తిట్టు లేద భజన. రెండోది వాదం. జైపాల్ రెడ్డి వాదాన్ని తన మార్గంగా ఎంచుకున్నాడు. తార్కికంగా ప్రంసగించేవాడు. వితండం ఉండేది కాదు.
సాధారణంగా పార్లమెంటులో ప్రతిపక్ష పార్టీ సభ్యలు తమ నేత మెప్పు కోసం ప్రసంగిస్తుంటారు. ట్రెజరీ బెంచెస్ వాళ్లు ప్రధాని కంటపడేలా ప్రసంగిస్తారు. వీళ్ల ప్రసంగాలన్నీ ఒక పొగడ్తలు, మరొక వైపు తెగడ్తలు ఉంటాయి.
జైపాల్ రెడ్డి ఇలా కాకుండా స్వతంత్ర వ్యక్తిత్వంతో ప్రసంగించే వాడు.
ఇది కూడా చదవండి : ఇండియాబుల్స్ హౌసింగ్ లో రు. లక్ష కోట్ల ఫ్రాడ్: డా. సుబ్రమణియన్ స్వామి
జైపాల్ రెడ్డి రాజకీయనాయకుడి లాంటి ఫిలాసఫర్ ని కాంగ్రెస్ నాయకుడు, మాజీ మంత్రి అని కుదించడం ఆయన్ని పూర్తిగా అర్థంచేసుకోవడం కిందికి రాదు.
మైకులు విసిరేస్తూ పైపైకి దూషించడం కాకుండా,రాజకీయ అక్రమాల, ప్రజాస్వామ్య పతనం ఫౌండేషన్ తాకేలా ఆయన ప్రసంగాలు ఉండేవి. అందుకే అర్థం చేసుకున్నవాళ్లని ఆయన ప్రసంగాలు విపరీతంగా బాధించేయి.
నాటి ప్రధాని వాజ్ పేయి కూడా చాలా సార్లు జైపాల్ ప్రసంగంతో తట్టుకోలేకపోయి, ఆయన అంగవైకల్యం మీద కూడా కామెంట్ చేశారు. జైపాల్ రెడ్డి ప్రసంగాలు ఒక తాత్వికంగా ఉంటాయి.
తన వాదనతో రూలింగ్ పక్షంలో తప్పు చేశామన్న గిల్టీ ఫీలింగ్ కల్గించేవాడు.
ఇపుడు పరిణామం చెందుతున్న పార్లమెంటరీ రాజకీయాలలో ఇమడలేననే భావం ఆయనలో చాలా రోజుల కిందటే వచ్చింది. ఈ పరిణామాన్ని ఆయన మనస్పూర్తిగా ఆహ్వానించాడు, ఈ పరిణామం అనివార్యం అన్నాడు.
ఆ పరిమాణం ఎమిటంటే దేశంలో రాజకీయాలు సార్వజనీనం కావడం. మండల్ రాజకీయాల తర్వాత అట్టడుగు ప్రజల ప్రతినిధులకూడా పార్లమెంటులోకి వస్తారు. ఇదొక పరిణామం. దీనితో పార్లమెంటు స్వరూపంమారిపోతుందని ఆయన ఎపుడో గ్రహించారు. దీనినే commonization of Parliamentary democracy అని ఆయన అన్నారు.
‘పూర్వం విదేశాలలో చదువుకుని వచ్చిన న్యాయవాదులు, లేదా జాతీయోద్యమంలో పాల్గొన్న వారు పార్లమెంటుకు వచ్చే వాళ్లు. అందుకే వాళ్ల ప్రసంగాలు కూడా అదేస్థాయిలో ఉండేవి. అందులో సాధారణ ప్రజలకు పనికొచ్చే కంటెంట్ తక్కువ. దేశంలో రాజకీయలు విశాలమవుతున్నాయి. రిజర్వేషన్ల వల్ల చట్ట సభల్లోకి అన్ని వర్గాల ప్రజలు, చదువు పెద్దగా లేని వాళ్లు వస్తున్నారు. వాళ్లు పార్లమెంటులోకి నిత్యజీవితంలోని సమస్యలను తీసుకువచ్చారు.ఇది గొప్పపరిణామం కాదని ఎలా అనగలం. దీనికి నిత్యజీవితంలో వాడేభాష ను ప్రయోగిస్తున్నారు. అందువల్ల పార్లమెంటులో అపుడపుడు పరుష పదజాలం, గొడవలు జరుగుతాయి. ఇది అనివార్యం’ అని ఆయన ‘ వార్త’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.
రాజకీయాలు సార్వజనీనం అవుతున్నపుడు తన లాంటి వాళ్లకు చోటు దొరకదని కూడా గమనించారు. ఆయన ఓటమి నిజానికి రాజకీయాల సార్వజనీనం పీక్ లో ఉన్నపుడు జరిగింది.
తెలంగాణ ఉద్యమం తర్వాత ఆయన పార్లమెంటరీ రాజకీయాలకు దూరంకావడం మొదలయింది.
అందుకే తానెపుడూ బహిరంగంగా మాట్లాడని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాల్సి వచ్చింది. గాంధీభవన్ లో కూడా విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేశారు. ఆయన తెలంగాణ ప్రభుత్వం మీద గురి పెట్టడం మొదలు పెట్టారు.
ప్రతి విషయం కొద్ది రోజులే వెలుగులో ఉంటుంది. తర్వాత ఎక్సపయిర్ అయిపోతుంది.చారిత్రకాంశంగా మిగిలిపోతుంది.
జైపాల్ రెడ్డి కూడా గొప్ప పార్లమెంటరీ సంప్రదాయాన్ని మొన్న మొన్నటి దాకా మోసుకువచ్చారు. ఇంద్రజిత్ గుప్తా, గురు దాస్ దాస్ గుప్తా, గీతా ముఖర్జీ, అశోక్ మిత్రా వంటి వారు ప్రాతినిధ్యం వహించిన ఎక్స పయిర్ అయిపోతున్న మహోతన్న సెక్యులర్ పరంపరంలో ఆయనే చివరి వాడు. ఆయన తరహా రాజకీయాలకు ఇపుడు చోటు లేదు.
ఆగస్టు 18,2003న లోక్ సభ వాజ్ పేయి ప్రభుత్వం మీద కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మాణం ప్రవేశపెట్టింది. దీనిని అప్పటి ప్రతిపక్ష నేత సోనియా గాంధీ ప్రతిపాదించారు.
చర్చలో జైపాల్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మొత్తం చర్చలో జైపాల్ రెడ్డి ప్రసంగమే హైలైట్.