“శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు” అన్నది పెద్దలు చెప్పిన నానుడి.అయితే రాయలసీమ విషయానికి వస్తే “శతకోటి దరిద్రాలకు అనంతకోటి అడ్డంకులు” అని చెప్పక తప్పదు.
రాయలసీమతో పాటు కరువుకు అల్లాడుతున్న దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణా జిల్లాలకు కనీసం తాగునీరు, ఒక్క ఆరుతడి పంటకైనా సాగునీరు ఇవ్వాలని ఎవరు తలపెట్టినా వెంటనే అనేక రకాల అడ్డంకులు, వదంతులు, కొత్త ప్రతిపాదనలు, పలు సందేహాలు రంగంలోకి కుప్పలు, తెప్పలుగా వస్తున్నాయని రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర రెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పంపిన విజ్ఞాపన పత్రంలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
అలాగే ఆయన ఈ వ్యాసకర్తతో కూడా సవివరంగా మాట్లాడారు.
అన్ని రంగాలలో బలమైన రెండు ప్రాంతాల (కోస్తా తెలంగాణా) స్వార్థ ప్రయోజనాలు, రాజకీయ సమీకరణాలు, సాంకేతిక నిపుణుల పరిమితులు, మేధావుల వినూత్న ఆలోచనలు కలగలసి కరువు పీడిత ప్రాంతాలను ఆదుకోవాలన్న ఆలోచనలకు అడ్డంకులు సృష్టిస్తూ “ఈ ఆలోచనలను పురిటిలోనే సమాధి చేస్తున్నారని”, అందులో భాగంగానే “గోదావరి జలాల మల్లింపు” అంశం కూడా వివాదాస్పదం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
పూర్వపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, దక్షిణ తెలంగాణా, దక్షిణ కోస్తా ప్రాంతాలలో కరువు నివారణకు వృధాగా సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలే శరణ్యమని బ్రిటీష్ కాలం లోనే నిపుణులు తేల్చి చెప్పారని ఆయన గుర్తు చేశారు.
అలాగే మారుతున్న వాతావరణ పరిస్థితులు, ఎగువ రాష్ట్రాలు తమ ప్రాంతాలలో ప్రాజెక్ట్ లను ఇతోధికంగా నిర్మించడం లాంటి కారణాల వల్ల కృష్ణ, తుంగభద్ర నదుల నుండి ఈ ప్రాంతాలకు రావలసినన్నినీళ్లు రాకపోవడం వల్ల దిగువ రాష్ట్రాలైన తెలంగాణా, ఆంద్ర రాష్ట్రాలు భవిష్యత్తులో తీవ్ర నీటి కొరత ఎదుర్కోక తప్పని స్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయ పడ్డారు.
ఈనేపథ్యంలో కరువు ప్రాంతాలను ఆదుకోవడానికి, ప్రస్తుతం సాగులో ఉన్నభూమిని కాపాడటానికి గోదావరి జలాల మల్లింపే శరణ్యమని ఆయన పేర్కొన్నారు.
కరువు ప్రాంత అవసరాలకు “శ్రీశైలమే” ఏకైక మార్గం
రాయలసీమతో పాటు తెలంగాణా, దక్షిణ కోస్తా లోని కరువు ప్రాంతాలను ఆదుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిని పూర్తిగా ఈప్రాంతాలకే కేటాయించాలని, శ్రీశైలం పూర్తిగా నిండిన తర్వాత వరద సమయంలో మాత్రమే శ్రీశైలం నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించాలని ఆయన తన విజ్ఞాపన పత్రంలో కోరారు. అలాగే గోదావరి జలాలను నాగార్జునసాగర్ తో పాటు మిగిలిన ప్రాజెక్ట్ లకు తరలించి ఆప్రాంతాల ఆయకట్టును పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా కరువు ప్రాంతాలలో గత అనేక దశాబ్దాలకు ముందు చేపట్టి నత్తలతో పోటీ పడే విధంగా నిర్మిస్తున్నఅన్ని ప్రాజెక్ట్ లను “వాటి సామర్త్యాన్ని పెంచడంతో పాటు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సి ఉందని” అన్నారు. ఈ ప్రాంతాల్లో ఉన్నఆయకట్టును ఆదుకోడానికి, కేటాయించిన నీటిని ఉపయోగించుకోడానికి స్థిరీకరణ ప్రాజెక్ట్ లను కూడా వెంటనే నిర్మించాల్సి ఉందని చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
గోదావరి జలాలకు స్వాగతం
“రెండు రాష్ట్రాలలోని ప్రతి అంగుళం భూమిని తడపడానికి గోదావరి నీటి తరిలింపే మార్గమని, అందుకు అవసరమైన ప్రతిపాదనలను చేపట్టగలమని” రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ప్రకటించడం హర్షణీయమని చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. “తెలంగాణా నుండి లేదా ఆంధ్ర ప్రాంతం నుండి గోదావరి నీటిని తరలించినా కరువు ప్రాంత ప్రజలకు అభ్యంతరం అవసరం లేదని” అన్నారు.
గతంలో కేసీఆర్ “కరువు ప్రాంతాల్లో నిర్మిస్తున్న పోతిరెడ్డిపాడు, ఇతర నీటి ఫథకాల పట్ల చేసిన వ్యాఖ్యలు, తెలంగాణా ఉద్యమ సమయంలో చేసిన విమర్శలు” లాంటి కారణాల వల్ల “తెలంగాణా భూభాగం నుండి గోదావరి నీటి తరలింపు విషయంలో ఆయన వ్యవహారశైలిపై రాయలసీమ ప్రాంత ప్రజలలో అనేక అనుమానాలున్నాయని” ఆయన గుర్తు చేశారు.
అయితే అదే సమయంలో ఆంద్ర ప్రాంతం నుండి గోదావరి నీటిని తరలించి కరువు ప్రాంతాల దాహార్తిని తీరుస్తారనడం పట్ల “గత అనుభవాల దృష్ట్యా” ఇంకా అనేక అనుమానాలు ఈప్రాంత ప్రజలలో చెలరేగుతున్నాయని ఆయన గుర్తు చేశారు.
మద్రాస్ రాష్ట్రం నుండి ఆంద్ర రాష్ట్రం ఎర్పడే సమయంలో కుదిరిన పెద్ద మనుషుల ఒప్పందం “శ్రీభాగ్ ఒడంబడికను” ఆంద్ర ప్రాంత నాయకులు ఎపుడూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఆ ఒప్పందం మేరకు రాయలసీమకు రాజధాని లేదా హైకోర్టు కేటాయించాలని, రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాతనే దిగువ ప్రాంతాలకు నీటిని తరలించాల్సి ఉందని ఐతే ఆచరణలో అందుకు పూర్తి విరుద్ధంగా జరిగిందనేది చరిత్ర” అని ఆయన గుర్తు చేశారు.
2014 రాష్ట్ర విభజన సమయంలో కోస్తా నాయకులు పోలవరంను జాతీయ ప్రాజెక్ట్ గా చేసుకున్నారని, అదేసమయంలో రాయలసీమ నీటిఅవసరాలు తీర్చడానికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి చేపట్టిన “దుమ్ముగూడెం- సాగర్ టైల్పాండ్” ప్రాజెక్ట్ గురించి కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నాయకులు ఒక్కరు కూడా మాట్లాడలేదని ఆయన వాపోయారు.
విభజన తర్వాత కూడా ఆంద్ర ప్రాంత నాయకులు రాజధానిని కానీ హైకోర్టును కానీ సీమకు కేటాయించాలనే ఆలోచన కూడా చేయలేదని ఆయన గుర్తు చేశారు. ఈ రెండు సంస్థలతో పాటు అనేక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను కోస్తాలోనే ఏర్పాటు చేసి మరోసారి అధికార, అభివృద్ధి కేంద్రీకరణకు పాల్పడ్డారని, వెనుకపడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేశారని ఆయన ఆరోపించారు.
గత ఎనిమిది దశాబ్దాల నుండి ఇప్పటి వరకు కరువు ప్రాంత ప్రజలు అన్నిప్రాంతాలను, అందరి నాయకులను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నమ్మి”గోచిపాతతో” నడివీధిలో నిలిచి ఉన్నారని, ప్రస్తుతం కూడా ఎవరిని నమ్మినా రాయలసీమకు ఇంతకు మించి జరిగే నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
కాగా ఆంద్ర ప్రాంత నాయకులను నమ్మి ఆంద్ర ప్రాంతం ద్వారా గోదావరి నీటిని తరలించినా, తెలంగాణా ప్రాంతం నుండి నీటిని తరలించినా “వారి, వారి ప్రాంత అవసరాలు తీరిన తర్వాతనే” కరువు ప్రాంతాలకు ఆయా నాయకులు నీటిని ఇస్తారనేది కరువు ప్రాంత ప్రజలందరికీ తెలిసిన నిష్ఠుర సత్యమని ఆయన గుర్తు చేశారు. ఏది ఏమైనా రాయలసీమకు, ఇతర కరువు ప్రాంతాలకు నీళ్లివ్వడమే ప్రధానమని ఏ ప్రాంతం మీదుగా ఇచ్చారనేది ప్రధానం కాదని ఆయన ధృడంగా అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల పరిష్కారం కోసం బ్రిజేష్ మిశ్రా ట్రిబ్యునల్ పనిచేస్తున్నదని ఆయన గుర్తు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్నఈ నీటి వివాదాలు, నీటి తరలింపుల గురించి రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితే తర్వాత రెండు రాష్ట్రాలు ఆ ప్రతిపాదనలను ట్రిబ్యునల్ కు ఇచ్చి ఆమోదింప చేసుకోవాలని ఆయన ఆ లేఖలోముఖ్యమంత్రిని కోరారు. అందువల్ల ఈఒప్పందాలకు చట్టబద్ధత వస్తుందన్నారు.
కరువు ప్రాంతాల ప్రజల జీవించే హక్కును కాపాడటానికి ఏ ప్రాంతం నుండి నీటిని తరలిస్తున్నారనేది సమస్య కాదని, నీటి తరలింపే ప్రధానమని మరోసారి ఆయన గుర్తు చేశారు.
అలాగే ఈప్రాంతాలలోచేపట్టిన హంద్రీ-నీవా, గాలేరు- నగిరి లాంటి ప్రాజెక్ట్ ల సామర్త్యాన్నిపెంచాలని ఆయనకోరారు.
కరువు ప్రాంతాల ప్రజలు ఎన్నికష్టాలు ఎదుర్కొన్నానోరువిప్పని నాయకులు, సంఘాలు “ కరువు ప్రాంతాలకు ఏమైనా చేయాలనే ప్రతిపాదన వచ్చిన వెంటనే ఎందుకు తప్పులు, లొసుగులు ఎంచడానికి ఎక్కడలేని ఉత్సాహం ఎందుకు ప్రదర్శిస్తారో అర్తం కాదని” ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాయలసీమతో పాటు మిగిలిన కరువు ప్రాంతాలకు నీళ్లిచ్చి ఆప్రాంతాల ప్రజలను ఆదుకోడానికి కృషిచేయాలని ఆయన రెండు ప్రాంతాల మేధావులకు, నాయకులకు, సంఘాలకు విజ్ఞప్తిచేశారు.