అంతరిక్షంపై పట్టు సాధించేందుకు తహతహలాడుతోన్న భారత్.. ఇప్పటికే తన సత్తా ను చాటుకుంది. తదుపరి లక్ష్యం చంద్రయాన్ -2 కు రంగం సిద్దం చేసుకోవడంతో ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది.
అనుకున్న సమయానికి ప్రయోగాన్ని చేపట్టలేకపోయినా..భారత అంతరిక్ష సంస్థపై ఎలాంటి అపనిందలు రాలేదు. అనుమానాలు కలగలేదు. చంద్రయాన్-2 ద్వారా కేవలం భారత సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు చాటడం అని మాత్రమే అనుకోవడం అవివేకమే అవుతుంది. ఇప్పటికే చంద్రయాన్-1 తో భారత్ శక్తి-సామర్ధ్యాలు ప్రపంచ దేశాలకు తెలిసాయి. తాజా ప్రాజెక్టుతో భారత్ పెట్టుకున్న లక్ష్యం చిన్నదేం కాదు.
భూమికి 3.84 లక్షల కి.మీ దూరంలో ఉన్న చంద్రుడ్ని చేరుకోవడం మామూలు విషయం కాదు.
ఈ సవాల్ ను భారత్ పదేళ్ల క్రితమే సునాయాసంగా ఛేదించింది. ఇప్పటి వరకు అంతరిక్ష రంగంలో భారత్ సాధించిన విజయాలతో, ఇస్రో పై అపారమైన నమ్మకం కుదిరింది ప్రపంచ శాస్త్రవేత్తలకు. ఇది భారత్ కు ఇమేజ్ పెంచే చర్యే అయినా, చంద్రయాన్-2 కు మాత్రం అత్యంత బాధ్యతయుతమైన టాస్క్.
ఇస్రోకున్న ట్రాక్ రికార్డుతో,ఇప్పుడు అగ్రరాజ్యం సంస్థ నాసా కూడా చంద్రయాన్-2 కు చేయి కలిపింది. చందమామపై ల్యాండర్ దిగడం, దాట్లో నుంచి రోవర్ దించి చంద్రుడి తలాన్ని పరిశోధిచడం… వంటి పనులను ఇప్పటి వరకు అమెరికా-చైనా దేశాలు మాత్రమే చేశాయి.
మేం ఏం తక్కువని భారత్ కూడా వాటికి భిన్నంగా పరోశోధనలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. వాటి ఫలితాలు రాబోయో రోజుల్లో ప్రపంచానికి వెల్లడి కానున్నాయి. అయితే, వీటిన్నిటికి మించి చంద్రయాన్-2 ప్రాజెక్టుతో ఇస్రో మరో కీలక బాధ్యతను భుజాన వేసుకుంది.
మరో రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు విదేశీయ ఉపగ్రహాలను కక్ష్యలో నిలబెట్టిన ఇస్రో, ఇప్పుడు ఏకంగా అగ్రరాజ్యం నాసాకు చెందిన కీలక పరికరాన్ని చందమామపై ప్రతిష్టించే కార్యక్రమానికి పూనుకుంది. అదే మిర్రర్ లేజర్ లెట్రో రిఫ్లెక్టర్ పరికరం. ఈ పరికరాన్ని చందమామ ఉపరితలం మీద ప్రతిష్టించడం ద్వారా భవిష్యత్ లో చందమామపై ఏర్పాటు చేసే రీసెర్చ్ స్టేషన్ కు పునాది వేయాలని నాసా భావిస్తోంది.
చంద్రయాన్-2 ద్వారా ఇస్రో జారవిడుస్తోన్న ఈ మిర్రర్ లేజర్ లెట్రో రిఫ్లెక్టర్ పరికరం నాసాకు ఎలా ఉపయోగపడుతుందనే చర్చలోకి వెళ్తే..అమెరికా చంద్రుడిపై భవిష్యత్ లో చేపట్టే ప్రయోగాల తీరుతెన్నులను కూడా మనం పసిగట్టవచ్చు.
1969 లో అపోలో ద్వారా చంద్రమండలంపై తొలిసారిగా మనుషులను పంపి..చరిత్ర సృష్టించిన అమెరికా, తరువాత కాలంలో చందమామపై దృష్టి సారించలేకపోయింది. సౌరమండలంలోని ఇతర గ్రహలపై దృష్టి సారించి అనేక ఉపగ్రహాలను పంపింది.
దానికి అనుగుణంగా భూమికి తరువాత గ్రహంగా ఉన్న మార్స్ పై కి 2036 నాటికి మనిషిని పంపాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. దానికి అనుగుణంగ, మార్స్ పైకి ఇప్పటి వరకు పదుల సంఖ్యలో ఉపగ్రహాలను పంపించి పరిశోధనలు చేస్తోంది.
మూడు రోవర్లను పంపి అంగారక గ్రహ వాతావరణ తీరుతెన్నులను జల్లెడ పడుతోంది. తాజాగా క్యూరియాసిటీ పంపిన సమాచారంతో మార్స్ పై మానవ మనుగడ విషయంలో అనేక రిపోర్టులను సిద్దం చేస్తోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రాకతో, నాసా అంతరిక్ష విధానాలను మార్చుకోవల్సి వచ్చింది.
ఎక్కడో దూరంగా ఉన్న మార్స్ పై రీసెర్చ్ స్టేషన ను ఏర్పాటు చేయడం కంటే ముందుగా చందమామపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ట్రంప్ సర్కార్… నాసాకు సూచించింది.
దానికి అనుగుణంగ 2025 నాటికి రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటుకు అడుగులు వేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో చందమామపై ఎక్కడ ఈ స్టేషన్ ను ఏర్పాటు చేయాలి, ల్యాండ్ మార్క్ ఏంటీ. రాకపోకలు, వాతవరణ పరిస్థితులు..తదితర అంశాలను బేరీజు వేయాలి. దానికి ఓ ప్రాంతం ప్రాతిపధికన అడుగులు వేయాలి.
ఓ విధంగా చెప్పాలంటే మన దేశంలో ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి దూరం లెక్కగట్టే క్రమంలో మహారాష్ట్రలో ని నాగపూర్ ప్రాంతంలో జీరో మైల్ స్టోన్ ఏర్పాటు చేశారు. ఈ మైల్ స్టోన్ ను బట్టే ముంబాయి టూ ఢిల్లీ, ముంబాయి టూ హైదరబాద్, గుజరాత్ నుంచి కలకత్తా..ఇలా దేశంలోని అన్ని ప్రాంతాల దూరాలను లెక్కించడంలో ఈ జీరో మైల్ స్టోనే కేంద్రంగా ఉంటుంది.
సరిగ్గా ఇలానే చంద్రమండలంపై ఓ మైల్ స్టోన్ ను ఏర్పాటు చేసే ఆలోచనతోనే నాసా మిర్రర్ లేజర్ లెట్రో రిఫ్లెక్టర్ పరికరాన్ని తెరపైకి తెచ్చింది. ఈ పరికరం అందించే సంకేతాలతో చందుడి కక్ష్యలోకి ఉపగ్రహాలు-వాహక నౌకల కదలికలు నిర్దేశించడంనికి ఓ ప్రాతిపధికగా ఉంటుందని నాసా అంచనా వేస్తోంది.
ఇంతటి కీలకమైన ఈ పరికరాన్ని చంద్రుడిపై ప్రతిష్టిస్తే, రీసెర్చ్ స్టేషన్ ఏర్పాటులో తదుపరి అంకానికి అడుగు పడినట్లే నని అమెరికా భావిస్తోంది.
దానికి అనుగుణంగా నే ఇస్రో తో చర్చలు జరిపి చంద్రయాన్-2 లో ఈ కీలక పరికరాన్ని జారవిడిచే ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. మరో మార్గంలో చెప్పాలంటే, భవిష్యత్ లో జాబిల్లిపై ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రానికి చంద్రయాన్-2 శంఖుస్థాపన చేస్తుందనే చెప్పాలి.