చప్పట్లు కొట్టండి: జెఎన్ యు ఎంట్రన్స్ పాసయిన సెక్యూరిటీ గార్డ్…

రోజూ న్యూఢిల్లీ జెఎన్ యు కాలేజీ గేటు దగ్గిర నిలబడుకుని వచ్చి పోయేవిద్యార్థులను గమనించేవాడు.
డ్యూటీలో భాగంగా  క్యాంపస్ కలియతిరుగుతూ విద్యార్థులెలా చదువుకుంటున్నారో చూసే వాడు.
క్యాంపస్ లో 24 గంటలు లైబ్రరీ తెరచివుండటం చూసి ఆశ్చర్యపోయేవాడు. తాను లోనికెళ్లి చదువుకుంటే ఎంత బాగుంటుందనుకునేవాడు.
ఢిలీ జవహర్ లాల్ యూనివర్శిటీ వాతావరణంతో ఆయన చాలా ఉత్తేజితుడయ్యాడు.
ఎలాగైనా సరే ఈ యూనివర్శిటీలో చదవాలనుకున్నాడు. కష్టపడి ఎంట్రన్స్ ప్రిపేరయ్యాడు. ప్రిపరేషన్ అంతా మొబైల్ తోనే చేసేవాడు.చివరకు రష్యన్ లాంగ్వేజీలో బిఎ ఆనర్స్ కోసం జరిపే ప్రవేశపరీక్ష పాసయ్యాడు.
 
జెఎన్ యు ఎంట్రన్స్ చాలా టఫ్ గా ఉంటుంది. అయినా సరే,పట్టుదలతో అడ్మిషన్ సంపాదించాడు యూనివర్శిటీ సెక్యూరీటీ గార్డ్ రామ్జాల్ మీనా. ఆయన వయసెంతో తెలుసా? 34 సంవత్సరాలు.
పేదరికం పదహారేళ్ల కిందట మీనా చదవుకు అడ్డంపడింది. వయసు మళ్లిన తల్లితండ్రులు పనిచేయలేని స్థితిలో ఉన్నారు. అంతో ఇంతో తాను సంపాదించి కుటుంబాన్ని ఆదుకోవాలి.  దీనితో రామ్జాల్ మీనా చదువు మానేయాల్సి వచ్చింది.
అయితే, కాలేజీ చదువు మానేసినా మీనా చదవడం మానలేదు. ఆ కృషితోనే ఇపుడు జెఎన్ యులో బిఎ (ఆనర్స్ )లో చేరబోతున్నాడు.
నిజానికి ఆయన ఇప్పటికే  మరొక బిఎ పూర్తి చేశాడు. ఎమ్మే పొలిటికల్ సైన్స్ ప్రీవియస్ పాసయ్యాడు.
ఈ లోపు ఆయనకు జెఎయులో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగంలో చేరాడు. అక్కడ అడ్మిషన్ సాధించి తీరాలనుకున్నాడు. సాధించాడు. జాతీయ వార్తల హెడ్ లైన్ అయిపోయాడు. ఆయన వయసు 34 సంవత్సరాలు. యుపిఎస్ సి పరీక్షలు కూడా రాయలనుకుంటున్నాడు.
మీనాకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలున్నారు. అయినా సరే చదువుమీద ఆయనకు పట్టుదల సడల లేదు.
మీనాది రాజస్థాన్. 18వ యేటనే కుటుంబం కోసం పెళ్లిచేసుకోవలసి వచ్చింది. దీనితో బిఎస్ సి కోర్సును మధ్యలోనే ఆపేశాడు.కుటుంబాన్ని పోషించేందుకు ఉద్యోగం వెదుక్కంటూ భార్యతో కలసి ఢిల్లీకి వచ్చాడు.
తన జీవితం గురించి భావో ద్వేగానికి లోనయి చెబుతున్నాడు. ‘రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వలస వచ్చాక రెండేళ్ల పాటు కూలిపని చేశాను. అపుడే నిలకడయిన ఉద్యోగం దొరికితే బాగుంటుందని కలకనే వాడిని.చివరకు 2005 లో నెలకూ రు.3000 లతో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం లభించింది. దీనితో కుటుంబాన్ని పోషించాలి.’
ఈ ఉద్యోగంలో సెటిలయ్యేందుకు కొంతకాలం పట్టింది.తర్వాత మనసు మళ్లీ మానేసిన చదువు మీదకు మళ్లింది. అపుడు రాజస్థాన్ యూనివర్శిటీ దూర విద్య విధానంలో డిగ్రీ కట్టాడు. పూర్తి చేశాడు. ఢిగ్రీ సర్టిఫికేట్ కళ్లచూసేందుకు 13 సంవత్సరాలు వేచిచూడాల్సి వచ్చిందని ఆనందం, ఆవేదన కలసిన స్వరంతో మీనా ది బెటర్ ఇండియాకు చెప్పాడు.
డిగ్రీ పూర్తయ్యాక మీనా మరికొంచెం మెరుగైన ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడు. చివరకు జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా చేరాడు. జీతం బాగా పెరిగింది. నెలకు రు. 15 వేలు.
పిఎప్ , ఇతర కటింగ్స్ పోయాక రు. 13 వేలు చేతికి వచ్చేవి. ఇందులో ఇంటి అద్దెకు 5 వేలు, మిగతా మొత్తంతో కుటుంబం గడవాలి. చాలా పొదుపుగానే జీవిస్తూ వస్తున్నాం,’ అని ఆయన చెప్పాడు.
రామ్జా మీనాకు ఐఎఎస్ అధికారి కావాలనే కల కూడా ఉండింది. రాజస్థాన్ ప్రభుత్వంలో రెండు సార్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు కూడా రాశాడు. ప్రిలిమినరీ పాసయ్యాడు. మెయిన్స్ కొట్ట లేకపోయాడు.
అంచెలంచెలుగా పై కొస్తున్న మీనాకు తన గోల్ తప్పక సాధిస్తాననే నమ్మకం ఉంది. దీనికోసం ఎన్నికష్టాలు పడేందుకైనా సిద్ధమనంటున్నాడు మీనా.

-టిటిఎన్ డెస్క్